అబద్ధాలకు కలియుగమేనా? రామాయణంలో కలియుగ ప్రస్తావన! | Bharata Words Kaliyuga Ramayana | Sakshi
Sakshi News home page

అబద్ధాలకు కలియుగమేనా? రామాయణంలో కలియుగ ప్రస్తావన!

Oct 26 2026 7:58 AM | Updated on Oct 26 2026 7:58 AM

Bharata Words Kaliyuga Ramayana

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

జ్యోతిర్మయం

తండ్రి మాట పాటించి శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా అడవులకు వెళ్ళిన తరువాత, వసిష్ఠుల వారు భరతుడిని రాజ్యభారం వహించమని కోరాడు. భరతుడు అందుకు అంగీకరించక, అన్నయైన శ్రీరాముడిని బ్రతిమలాడి ఇంటికి తీసుకువస్తానని బయలుదేరాడు.

భరతుడి వెంట చాలా మందీ మార్బలం కూడా వెళ్ళింది. గంగానది సమీపాన రామసఖుండగు గుహుడు తన బంధువులతో కూడి నివాసం ఉండిన శృంగిబేరపురం అనే పల్లె ప్రదేశం చేరే సమయానికి సాయంత్రం కావస్తుండటంతో అక్కడ విడిది చేశాడు భరతుడు.

భరతుడు సైన్యసమేతంగా రావడం చూసిన గుహుడు, ఆ అట్టహాసానికి కారణాన్ని తెలుసుకోవాలని భరతుడి దగ్గరకు వెళ్ళాడు. ఏమీ మొహమోటపడకుండా ‘మీ వాలకం చూస్తూ ఉంటే శ్రీరాముడికి మరొక ఆపద రాబోతున్న దేమో అని నాకు సందేహంగా ఉంది’ అన్నాడు భరతుడితో. ‘రామ రామ, అటువంటి ఆలోచన నాకు లేదు. పెద్దన్న నాకు పితృసమానుడు. ఆచార్యుడు. వందనీయుడు. ఆ మహాత్ముడి చరణాలకు ప్రణమిల్లి, జరిగిన తప్పిదానికి క్షమించమని వేడుకుని, ఎలాగైనా సరే ఒప్పించి  దండకారణ్యం నుండి వెనక్కి తీసుకుని వెళ్ళి రాజ్యపదస్థుడిని చేయాలని ఇలా నా సేనతో కూడి...

ఆ. పోవుచున్నవాడ, బొంకు గాదీమాట
నమ్ము, మదికి సందియమ్ము వలదు;
కలియుగంబు గాదు కల్లలాడు టకు నీ
డెందమందు శంకనొంద వలదు.’ అన్నాడు భరతుడు గుహుడితో.
        ‘నా మాటలు నిజం. అందులో అబద్ధం లేదు. సందేహించవద్దు. అబద్ధం చెప్పి తప్పించుకోవడానికి మనమున్నది కలియుగం కాదు కదా!’ అని పై పద్యంలో భరతుడి మాటల భావం. అబద్ధాలు చెప్పడానికి సందేహించకపోవడం, అసత్యంతో కూడుకున్న జీవనం సాగించడం కలియుగానికి లక్షణంగా ఉంటాయని త్రేతాయగం నాటికే నిశ్చయమైపోయినట్లుగాను, నిందాగర్భితంగాను, అయోధ్యకాండలోని పై పద్యంలో, గుహుడితో సంభాషణలో భరతుడి మాటలుగా ‘గోపీనాథ రామాయణం’
సూచించి చెప్పింది.
– భట్టు వెంకటరావు

ఇదీ చదవండి: జరాసంధ వధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement