అనంతికా కళానందం | Ananthika Sanilkumar Opens Up About Her Inspiring Journey in Cinema | Sakshi
Sakshi News home page

అనంతికా కళానందం

Oct 4 2026 1:02 AM | Updated on Oct 4 2026 1:02 AM

Ananthika Sanilkumar Opens Up About Her Inspiring Journey in Cinema

సమయం సరిపోవడం లేదని చెప్పే వాళ్లకు... రోజును సరిగ్గా ప్లాన్  చేసుకుంటే ఏదైనా సాధ్యమే అంటోంది నటి అనంతిక సనిల్‌ కుమార్‌. రోజులోని ఇరవైనాలుగు గంటలను ఒక్కో చిన్న ప్రపంచంగా మార్చుకొని చదువు, నటన, నాట్యం, మార్షల్‌ ఆర్ట్స్, సంగీతం– ఇలా ఏదొక కళకు సద్వినియోగిస్తూ ఆనందాన్నే అలవాటుగా చేసుకుంది. ఆ విషయాన్నీ ఆమె మాటల్లోనే ..

సినిమాలు చూడటమే లగ్జరీ!
మాది త్రిసూర్‌లోని చాలా సాధారణ కుటుంబం. నాన్న మెకానిక్‌. చిన్నప్పుడు థియేటర్‌కు వెళ్లడమే మాకొక లగ్జరీ! అందుకే, మా వాళ్లకు సినీ ఇండస్ట్రీ అంటే చాలా భయం. పరిచయాలు లేవు, పెద్దగా ఏమీ తెలియదు. ఎలా అని? నన్ను పంపించడానికి చాలా ఆలోచించారు కాని, ఇప్పుడు నన్ను చూసి చాలా ఆనందంగా ఉన్నారు. 

కథకళి కష్టం!
ఐదేళ్ల వయసు నుంచే నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. భరతనాట్యం, కథకళి, కూచిపూడి, మోహినీయాట్టం– ఇలా ఒక్కో నాట్యరూపం నేర్చుకుంటూ వెళ్లాను. ముఖ్యంగా కథకళి చాలా కష్టమైనది. కానీ నేర్చుకుంటున్నప్పుడు దాని వెనక ఉన్న కళ, భావప్రకటన ఎక్కువ ఆసక్తి కలిగించాయి.

అందంగా ఉన్నానని అనొద్దు!
ఒక అమ్మాయి అందంగా ఉంటే ఆమె విజయం వెనక ఉన్న కష్టాన్ని చాలాసార్లు మర్చిపోతారు. అందుకే, నా లుక్‌ గురించి కాకుండా, నేను పోషించిన పాత్ర గురించి మాట్లాడాలని కోరుకుంటాను. ప్రస్తుతం సినిమాలతో పాటు న్యాయ విద్య చదువుతున్నాను. ఉదయం క్లాసులు, తర్వాత షూటింగ్‌... ఇలా రోజంతా బిజీగా ఉంటుంది.

ఫైట్‌ కూడా చేస్తా!
నాట్యంతో ఆగిపోలేదు. కరాటేలో బ్లాక్‌ బెల్ట్‌ తీసుకున్నాను. కలరిపయట్టు, కత్తిసాము లాంటివి కూడా నేర్చుకున్నాను. ఇప్పుడు యాక్షన్  సన్నివేశాలు వచ్చినప్పుడు అప్పుడెప్పుడో నేర్చుకున్నదంతా ఉపయోగపడుతోంది. హీరోయిన్  అంటే కేవలం పాటల్లో కనిపించాలి అనే రూల్‌ నాకు అసలు నచ్చదు!

అది నా అదృష్టం!
‘లాల్‌ సలామ్‌’లో రజినీకాంత్‌ సార్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన నుంచి నేర్చుకోవడానికి ప్రతి రోజు ఒక కొత్త విషయం ఉండేది. ‘8 వసంతాలు’ కూడా అంతే. ఈ సినిమాకు ప్రత్యేకంగా ఆడిషన్  ఇవ్వలేదు. కాని, దర్శకుడు నా నటనపై నమ్మకంతో నన్ను నేరుగా ఎంపిక చేశారు. ఆ నమ్మకమే నాలో బాధ్యతను పెంచింది.  

అమ్మే నా బ్యాటరీ!
షూటింగ్‌ ఎంత కష్టంగా ఉన్నా, ఎన్ని గంటలు పనిచేసినా ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మతో మాట్లాడితే చాలు... మళ్లీ ఎనర్జీ వచ్చేస్తుంది. నా జీవితంలో అమ్మ నాకు పెద్ద సపోర్ట్‌. నేను అలసిపోయినప్పుడు రీచార్జ్‌ చేసే పవర్‌ బ్యాంక్‌ కూడా ఆమెనే అనొచ్చు!

ఫోన్ కి ఫ్యాన్ ని కాదు!
నేను ఫోన్ కి అంతగా అతుక్కుపోయి ఉండను. సోషల్‌ మీడియాలో ఏం ట్రెండ్‌ అవుతోంది, ఎవరు ఏం చేస్తున్నారు అనే దానికంటే, నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం నాకు ఎక్కువ ఇష్టం. ఖాళీ సమయం దొరికితే డ్రాయింగ్, థియేటర్‌ ఆర్ట్స్, సంగీత వాయిద్యాలు నేర్చుకోవడం లాంటివి చేస్తుంటాను.

మరో మనిషిగా !
నటిగా నాకు అన్నింటికంటే ఎక్కువగా నచ్చేది ఒక పాత్రను జీవించడం. అలా మరో మనిషిగా మారటం అద్భుతంగా ఉంటుంది. వీటితోపాటు. కెమెరా వెనక ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ. భవిష్యత్తులో దర్శకత్వం, సినిమాటోగ్రఫీ లాంటి విభాగాల్లో కూడా పనిచేయాలని ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement