క్రికెట్‌ ఫైనల్‌ ఫీవర్‌ | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ ఫైనల్‌ ఫీవర్‌

Published Mon, Nov 20 2023 1:44 AM

ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో డ్రమ్ములు వాయిస్తూ సందడి చేస్తున్న అభిమానులు - Sakshi

ఏలూరు రూరల్‌: ఆదివారం జరిగిన ప్రపంచ కప్‌ క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ హై ఫీవర్‌ పుట్టించింది, యువతను ఉర్రూతలూగించింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ఏలూరులో యువత జాతీయజెండాలు పట్టుకుని బైక్‌లు నడుపుతూ రోడ్లపై తిరిగారు. జీతేగా జీతేగా, ఇండియా జీతేగా అంటూ చక్కర్లు కొట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో వ్యాపారులు దుకాణాలు బంద్‌ చేసి మ్యాచ్‌ తిలకించేందుకు ఇంటివద్దనే ఉండిపోయారు. ప్రధాన వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఏలూరు ఇండోర్‌ స్టేడియంలో ఫైనల్‌ మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం చేసింది. భారీ స్క్రీన్‌తో పాటు ఫ్లడ్‌లైట్లు, డీజే సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటుచేయడంతో నగరంలో యువత స్టేడియంకు క్యూ కట్టారు. కొంతమంది కుర్రకారు జాతీయజెండాలతో పాటు వాయిద్యాలతో స్టేడియంకు తరలివచ్చారు. నిర్వాహకులు మ్యూజిక్స్‌ ప్లే చేసి అభిమానులను మరింత ఉత్సాహపరిచారు.

ఎమ్మెల్యే కొఠారు ఇంటి వద్ద స్క్రీన్‌

అభిమానుల కోసం పెదవేగి మండలంలోని కొండలరావుపాలెంలో ఇంటి వద్ద ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి ప్రత్యేక స్క్రీన్‌ ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఎమ్మెల్యేతో కలిసి మ్యాచ్‌ వీక్షించారు.

బెట్టింగ్‌ జోరు

ఫైనల్‌ మ్యాచ్‌పై జోరుగా బెట్టింగ్‌ జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే రూ.కోట్లలో బెట్టింగ్‌ జరిగి ఉంటుందని అంటున్నారు. ప్రధానంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరంలో బుకీలు నేరుగా బెట్టింగ్‌ నిర్వహించినట్టు తెలిసింది. గ్రామాల్లో యువకులు సైతం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిర్వహించినట్టు సమాచారం.

వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై ప్రత్యేక ఆసక్తి

భారీ స్క్రీన్లు, ప్రొజెక్టర్లతో ప్రదర్శన

Advertisement
Advertisement