రత్నగిరిపై మంటపంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న పండితులు | Sakshi
Sakshi News home page

రత్నగిరిపై మంటపంలో సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న పండితులు

Published Thu, Apr 18 2024 10:40 AM

- - Sakshi

రమణీయం.. రత్నగిరి రాములోరి కల్యాణం

అన్నవరం : రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారాముల దివ్యకల్యాణం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం రత్నగిరి రామాలయం పక్కన గల వార్షిక కల్యాణ వేదికపై వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఉదయం పది గంటల నుంచి 12–30 గంటల వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత ప్రముఖుడు, వైదిక కమిటీ సభ్యుడు ఛామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) తదితర పండితులు నిర్వహించారు.

వెండి పల్లకిపై ఊరేగింపు

ఉదయం ఏడు గంటలకు శ్రీ సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లిపెద్దలు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వధూవరులు శ్రీసీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ప్రత్యేక సింహాసనం మీద సీతారాములను పండితులు ఉంచారు. ఆ సింహాసనం పక్కనే గల మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు అమ్మవార్లను ఉంచారు. ఉదయం 10–15 గంటలకు విఘ్నేశ్వరపూజతో కల్యాణం ప్రారంభమైంది. ఈఓ కె.రామచంద్రమోహన్‌ నూతన పట్టువస్తాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మధ్యాహ్నం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్య ధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు.

Advertisement
Advertisement