స్పందనలో అర్జీలకు తక్షణమే పరిష్కారం | Sakshi
Sakshi News home page

స్పందనలో అర్జీలకు తక్షణమే పరిష్కారం

Published Tue, Nov 21 2023 2:52 AM

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ మాధవీలత, 
ఎస్పీ జగదీష్‌ తదితరులు - Sakshi

కలెక్టర్‌ మాధవీలత, ఎస్పీ జగదీష్‌

సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం): ప్రజల అర్జీలను సత్వర పరిష్కరించాలని కలెక్టర్‌ మాధవీ లత అధికారులను ఆదేశించారు. ఈ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఆమె ఎస్పీ జగదీష్‌, జేసీ తేజ్‌ భరత్‌లతో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్‌ సమీక్షిస్తూ స్పందనలో 192 అర్జీలు వచ్చాయని కలెక్టర్‌ చెప్పారు. అర్జీలను 24 గంటల్లో ఓపెన్‌ చేసి కాల పరిమితి లోగా పరిష్కరించాన్నారు. రెవెన్యూ, పంచాయతీ శాఖలకు చెందిన 6 అర్జీలను కాలపరిమితి లోగా పరిష్కరించలేదన్నారు. మాదక ద్రవ్యాలు, మద్యం, తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అటువంటి వారిపై, వారిని ప్రోత్సహించే వారిపై పీడీ కేసులను నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసు శాఖ పరిధికి చెందిన 40 అర్జీలను స్వీకరించామన్నారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఆడుదాం ఆంధ్రాలోవిద్యార్థులు పాల్గొనాలి

కులగణన, ఆడుదాం ఆంధ్రా, భారత్‌ సంకల్ప యాత్రకు సంబంధించి ఈనెల 23లోగా క్షేత్ర స్థాయిలో శిక్షణ తరగతులు పూర్తి చెయ్యాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లో వివిధ అంశాలపై జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌ భరత్‌తో కలిసి ఆమె మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, ఆడుదాం ఆంధ్రా క్రీడలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను పంపించామన్నారు. కులగణన సర్వే ప్రక్రియపై క్షేత్ర స్థాయి సిబ్బందికి, అధికారులకు రెండు రోజుల్లో మ్యాపింగ్‌ పూర్తి చేసి, తదుపరి శిక్షణ తరగతులను పూర్తి చేయాలన్నారు. భారత్‌ సంకల్ప్‌ యాత్రపై మంగళవారం రాజమహేంద్రవరంలో శిక్షణ నిర్వహించనున్నామని తెలిపారు. ఖరీఫ్‌లో కోతలు పూర్తి చేసిన చోట ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలన్నారు. రబీ సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి లభ్యతపై ఎలాంటి సందేహాలు పెట్టుకోరాదని ఆమె రైతులకు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement