సివిల్స్ సాధించడమే లక్ష్యం
మామిడికుదురు: సివిల్స్ సాధించడమే తన లక్ష్యమని మామిడికుదురు గ్రామానికి చెందిన లిఖితపూడి హరిసత్య రామమోహన్ అన్నాడు. ఈ విద్యార్థి ఏపీఆర్‌జేసీ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించాడు. మంగళవారం రాత్రి ఈ ఫలితాలు విడుదల అయ్యాయి. రామమోహన్ ఎంఈసీ విభాగంలో 150 మార్కులకు 140 సాధించాడని తండ్రి, పీఈటీ రమేష్ బుధవారం తెలిపారు. తల్లి సునీత ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రామమోహన్ మాట్లాడుతూ ఇంటర్‌లో ఎంపీసీ చదువుతానని, అనంతరం ఐఐటీ ద్వారా సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో ముందుకు వెళతానన్నాడు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో రామమోహన్ 600 మార్కులకు 585 సాధించాడు.
పది కాసుల బంగారం చోరీ
నిడదవోలు: పట్టణ శివారు బసివిరెడ్డిపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఇంటి యజమానికి సమాచారమిచ్చారు. వివరాల్లోకి వెళితే.. బసివిరెడ్డిపేటకు చెందిన కవితరపు మోహనరావు తన కుటుంబ సభ్యులతో మంగళవారం ఊటీ వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దుండగులు ఆ ఇంటి ప్రధాన ద్వారం గడియను ఇనుప రాడ్డుతో పెకిలించి తాళం తీసేశారు. బెడ్‌రూమ్‌లోని బీరువాను బద్దలుగొట్టి మూడు కాసుల బంగారు ఆభరణాలు, రూ.10 వేలు అపహరించుకుపోయారు. కాగా.. ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని ఇరుగుపొరుగు వారు గమనించి, యజమాని మోహనరావుకు సమాచారం ఇచ్చారు. ఆయన ఊటీ నుంచి వచ్చి చూసేసరికి దొంగతనం జరిగిన విషయం నిర్ధారణ అయ్యింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై పి.అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment