లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
దేవరపల్లి: విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ అమరావతి బస్సు గుండుగొలను–కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి డైమండ్ జంక్షన్ వద్ద ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయట పడ్డారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దేవరపల్లి ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు.
పాల ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
రావులపాలెం: జాతీయ రహదారిపై ఈతకోట వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన అజ్జరపు రాజారావు (60) స్థానికంగా ఉన్న ఒక ప్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఫ్యాక్టరీకి సమీపంలో రోడ్డు పక్కన సైకిల్‌తో నిలబడి ఉన్నాడు. ఆ సమయంలో రావులపాలెం వైపు వస్తున్న పాల ట్యాంకర్ అదుపు తప్పి అతడిని ఢీకొంది. లారీ వెనుక చక్రాలు తలపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కొత్తపేట ఏరియా ఆస్పత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ వైకుంఠరావు తెలిపారు.
19న చదరంగం పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్ర చెస్, జిల్లా చదరంగం అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పిడింగొయ్యిలోని ఫ్యూచర్‌కిడ్స్ గ్లోబల్ స్కూల్లో ఈ నెల 19వ తేదీన రాష్ట్రస్థాయి ఓపెన్ చదరంగం పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా చదరంగం అసోషియేషన్ సెక్రటరీ జీవీ కుమార్ బుధవారం తెలిపారు. పోటీలో గెలుపొందిన మొదటి 25 మంది విజేతలకు రూ.లక్ష నగదును విభజించి అందజేస్తామన్నారు. ఆసక్తి కల క్రీడాకారులు తమ పేర్లను శుక్రవారంలోపు ఏపీచెస్‌ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 62812 50967 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment