పకడ్బందీగా ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్ష | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా ఎన్‌ఎంఎంఎస్‌ అర్హత పరీక్ష

Published Sat, Dec 2 2023 2:42 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
డీఈవో కమలకుమారి   - Sakshi

డీఈవో కమలకుమారి

ముమ్మిడివరం: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పిలుపునిచ్చారు. స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం ఎన్‌ఎంఎంస్‌ పరీక్షకు నియమించిన సీఎస్‌, డీవో, మండల విద్యాశాఖాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పది పరీక్షల మాదిరిగానే ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఎక్కడా లోటుపాట్లకు అవకాశం ఉండరాదన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్‌, టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులు అసౌకర్యానికి గురికాకుండా ఫర్నీచర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నక్కా సురేష్‌ మాట్లాడుతూ అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్‌ కేంద్రాల పరిధిలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణపై ఎంఈవో అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు బొజ్జా రమణశ్రీ, డీసీఈబీ మెంబరు బీవీ కామేశ్వరరావు అవగాహన కల్పించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులతో ప్రస్తుతం అమలవుతున్న విద్యాపరమైన అంశాలపై డీఈవో కమలకుమారి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రామచంద్రపురం డీవైఈవో నరసింహ ఫణి, డీఈవో కార్యాలయ ఏడీ విజయలక్ష్మి, సూపరింటెండెంట్‌ భాను, డీసీఈబీ సెక్రటరీ బి.హనుమంతరావు, సమగ్ర శిక్ష సీఎంవో బీవీవీ సుబ్రహ్మణ్యం, ఏఎంవో పి.రాంబాబు, జిల్లాలోని ఎంఈవోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement