Axis Bank Partners With RBI Innovation Hub To Launch Kisan Credit Cards - Sakshi
Sakshi News home page

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ లబ్ధిదారులకు శుభవార్త!

Aug 19 2023 6:56 AM | Updated on Aug 19 2023 8:23 AM

Axis Bank Partners With Rbi Innovation Hub To Launch Kisan Credit Cards - Sakshi

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ హబ్‌ (ఆర్‌బీఐహెచ్‌) ప్రవేశపెట్టిన పీటీపీఎఫ్‌సీ (పబ్లిక్‌ టెక్‌ ప్లాట్‌ఫాం ఫర్‌ ఫ్రిక్షన్‌లెస్‌ క్రెడిట్‌) ప్లాట్‌ఫాం కింద ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ రెండు కొత్త రుణ సాధనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనికింద రూ. 1.6 లక్షల వరకు పరిమితితో కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (కేసీసీ).. లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) రూ. 10 లక్షల వరకు రుణాలను అందించనుంది.

కేసీసీలను పైలట్‌ ప్రాతిపదికన ముందుగా మధ్యప్రదేశ్‌లో ప్రవేశపెట్టనుంది. వీటిని పూర్తిగా డిజిటల్‌గానే జారీ చేయనున్నామని, కస్టమర్లు ప్రత్యేకంగా ఏ డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేదని యాక్సిస్‌ బ్యాంక్‌ డిప్యుటీ ఎండీ రాజీవ్‌ ఆనంద్‌ తెలిపారు.

పాన్‌ ధృవీకరణ, ఆధార్‌ ఈకేవైసీ, ఖాతా అగ్రిగేటర్‌ డేటా, స్థల రికార్డులు మొదలైనవన్నీ పీటీపీఎఫ్‌సీ ప్లాట్‌ఫాంలో అధికారికంగా అందుబాటులో ఉండటం వల్ల రుణాల మంజూరీ వేగవంతం కాగలదని పేర్కొన్నారు.    

కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఉపయోగాలు
రైతులకు పంట సాగు కోసం పెట్టుబడులు అవసరమైనప్పుడు అధిక వడ్డీ రేట్లతో అప్పులు చేయకుండా తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు. భారత ప్రభుత్వం 1998లో రైతుల కోసం ఈ కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకాన్ని స్వల్పకాలిక అధికారిక రుణాన్ని అందించే లక్ష్యంతో ప్రారంభించింది. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్థక రంగాల్లో రైతులు, అవసరమైన పరికరాల కొనుగోలు, ఇతర ఖర్చులకు స్వల్పకాలిక రుణాన్ని పొందొచ్చు. దీన్ని నాబార్డ్‌  (నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలెప్‌మెంట్‌) రూపొందించింది.

Advertisement
 
Advertisement
Advertisement