పోలీసుల తీరుతో నామినేషన్లు వేయలేకపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు
నిరసన వ్యక్తంచేస్తూ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, అభ్యర్థుల నిరాహార దీక్ష
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటన.. న్యాయపోరాటం చేస్తామని వెల్లడి
నరసరావుపేట: నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్ల, నరసరావుపేట మండలాలకు చెందిన వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికలను బహిష్కరించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. గత బుధవారం నుంచి నామినేషన్లు దాఖలు చేయాలని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భావిస్తున్నా.. భద్రతా కారణాలు సాకుచూపి పోలీసులు అడ్డుకుంటూ వచ్చారు. శుక్రవారం భద్రత కల్పిస్తామని నామినేషన్లు వేసుకోవచ్చని హామీ ఇచ్చారు. ఈ మేరకు డాక్టర్ గోపిరెడ్డి పిలుపు మేరకు గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయానికి నామినేషన్ పత్రాలతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు చేరుకున్నారు.
అయితే పోలీసులు భద్రత కల్పించకపోవడంతో పార్టీ కార్యాలయ ఆవరణలోనే నామినేషన్ పత్రాలతో నిరాహారదీక్షకు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ తాము వచ్చి నామినేషన్ కేంద్రాలకు తీసుకెళతామని సమాచారం ఇచ్చారు. కానీ నామినేషన్ల దాఖలు ప్రక్రియ మరో గంటలో ముగిస్తుందనగా సాయంత్రం 4.10 గంటలకు డీఎస్పీ తన సిబ్బందితో వచ్చి బయట టీడీపీ శ్రేణులు బాగా మోహరించి ఉన్నారని, వారందరినీ దూరంగా తరిమి వచ్చే సరికి ఈ సమయం పట్టిందని, తమ వద్ద 250 మంది సిబ్బంది ఉన్నారని, మీకు భద్రత ఇవ్వగలం కానీ దూరం నుంచి ఏ రాయి వచ్చి పడినా పట్టించుకోవద్దని వివరించారు. అందుకు డాక్టర్ గోపిరెడ్డి, అభ్యర్థులు అంగీకరించి నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
అంతలోనే డీఎస్పీ మళ్లీ తమకు అందిన ఆదేశాల మేరకు కేవలం రొంపిచర్ల అభ్యర్థులను మాత్రమే తీసుకెళతామని మెలిక పెట్టారు. దీనికి గోపిరెడ్డి స్పందిస్తూ రెండు మండలాలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు 45 మంది, ఇద్దరు జెడ్పీటీసీ అభ్యర్థులు మొత్తం 47 మంది సిద్ధంగా ఉన్నారని, వారందరినీ నామినేషన్ల దాఖలుకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. ఆ తర్వాత డీఎస్పీ ఉన్నతాధికారులతో మాట్లాడతానంటూ కాలయాపన చేయడంతో బాగా ఆలస్యమైపోయింది. ఆ సమయంలో నామినేషన్ల కేంద్రానికి వెళ్లినా నామినేషన్లు సమర్పించే పరిస్థితి లేకపోవడంతో గోపిరెడ్డి అభ్యర్థులతో చర్చించి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పోలీసుల తీరును నిరసించారు.
భద్రత ఇవ్వటంలో విఫలమైనందునే..
అనంతరం గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసులు భద్రత ఇవ్వడంలో విఫలమైనందునే తమ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలు చేయలేకపోయారని, దీనివల్లే ఎన్నికలను బహిష్కరించినట్టు ప్రకటించారు. తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం కోసం పోరాడతామని వెల్లడించారు.


