పెన్సిలిన్–జీ తయారీ కంపెనీపై డప్పుకొట్టుకుంటున్న తెలుగుదేశం నేతలు
ప్రధాని మోదీ వీడియో క్లిప్‌ను రీ–ట్వీట్ చేస్తూ తమ ఘనతేనంటూ సోషల్ మీడియాలో చాటింపు
వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలోనే లైఫియస్ కంపెనీ నిర్మాణం పూర్తి, పెన్సిలిన్–జీ ఉత్పత్తి ప్రారంభం
ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటూ మంత్రి లోకేశ్ చేసిన ట్వీట్‌పై అభ్యంతరాలు
జగన్ హయాంలోనే ఫార్మా హబ్‌గా కాకినాడ
సాక్షి, అమరావతి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు సర్కారు నిస్సిగ్గుగా ఇప్పటికే తన ఖాతాలో వేసుకుంటున్న విషయం జగమెరిగిన సత్యం. గూగుల్ డేటాసెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఇలా పలు ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుని డప్పు కొట్టుకుంటున్న తెలుగుదేశం పార్టీ నేతలు తాజాగా మరో క్రెడిట్ చోరీకి పాల్పడడం అందరినీ విస్మయపరుస్తోంది. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించిన అరబిందో లైఫియస్ కంపెనీ క్రెడిట్‌ను కూడా దేశం ఘనతగా చాటుకోవడం తాజాగా చర్చనీయాంశంగా మారింది.
అబద్ధపు ప్రచారం ఇలా...
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 2020లో కాకినాడ వద్ద అరబిందో గ్రూపు ఏర్పాటు చేసిన లైఫియస్ అనే పెన్సిలిన్–జీ తయారీ కంపెనీ నిర్మాణాన్ని టీడీపీ తమ గొప్పగా ప్రచారం చేసుకోవడం ఆశ్చర్యపరుస్తోంది. మంత్రి నారా లోకేశ్ దగ్గర నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వరకు అంతా ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
చాలా ఏళ్ల తర్వాత భారత్‌లో తిరిగి పెన్సిలిన్–జీ తయారీ మొదలైందని, కాకినాడ వద్ద లైఫియస్ కంపెనీ పెన్సిలిన్–జీ తయారు చేస్తోందంటూ ఒక సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన వీడియా క్లిప్‌ను మైగవ్‌ఇండియా పోస్ట్ చేయగానే తెలుగుదేశం నాయకులు తమ ప్రభుత్వ ఘనతగా పేర్కొంటూ రీ–ట్వీట్ చేస్తుండటం చూసి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. కోవిడ్ సమయంలో అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి కంపెనీని వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రారంభిస్తే ఇప్పుడు ఈ ఘనతను బాబు కూటమి తన ఖాతాలో నిస్సిగ్గుగా వేసుకోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు.
అసలు నిజాలు ఇలా.....
వైఎస్ జగన్ తన హయాంలో మూడు కీలక భారీ ప్రాజెక్టులను తీసుకురావడంతో కాకినాడ ఫార్మాహబ్‌గా ఎదిగింది. సుమారు రూ.5,000 కోట్ల పెట్టుబడులతో అరబిందో మూడు, దివీస్ ఒక ఫార్మా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న దివీస్ ఫార్మా సమస్యను వైఎస్ జగన్ అధికారం చేపట్టిన వెంటనే పరిష్కరించి ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నారు.. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ) పథకం కింద అరబిందో మూడు యూనిట్లను ఏర్పాటు చేశాయి.
2020లో పనులు ప్రారంభించిన ఈ యూనిట్లు 2024లోనే ఉత్పత్తిని ప్రారంభించడం విశేషం. ఇందులో రూ.2,500 కోట్లతో లైఫియస్ పేరుతో ఏటా 15,000 టన్నుల పెన్సిలిన్–జీ, 1.8 లక్షల టన్నుల గ్లూకోజ్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చింది. రూ.1,000 కోట్లతో ఏటా 3,600 టన్నుల 6–అమినో పెన్సిలానిక్ యాసిడ్ తయారీ యూనిట్ క్యూలే పేరుతో ఏర్పాటు చేసింది.


