నాయుడుపేటటౌన్: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ముఖంపై బండరాయితో కొట్టి ఒక యువకుడిని దారుణంగా హత్యచేశారు. స్థానిక సామాజిక ఆరోగ్యకేంద్రం వెనుక భాగంలో యువకుడి మృతదేహాన్ని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. హతుడిని ఓజిలి మండలం కారూరు గ్రామానికి చెందిన రుద్రపాక బాలగోవిందు (18)గా పోలీసులు గుర్తించారు. మృతదేహం సమీపంలోనే అతడి హత్యకు ఉపయోగించిన రాయిని గుర్తించారు.
ఈ హత్యలో అతడి బంధువులు, స్నేహితుల ప్రమేయం ఉండవచ్చని, మద్యం తాగించి హత్యచేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తల్లి రుద్రపాక గీత, నాయనమ్మ రమణమ్మతో డీఎస్పీ మాట్లాడి వివరాలు సేకరించారు. బాలగోవిందు శుక్రవారం కారూరు నుంచి నాయుడుపేట పిచ్చిరెడ్డితోపులో ఉన్న నాయనమ్మ రమణమ్మ ఇంటికి వచ్చినట్లు వారు తెలిపారు. శనివారం ఇద్దరు స్నేహితులు వచ్చి బాలగోవిందును పిలుచుకెళ్లారని, వారే హత్యచేసి ఉంటారని మృతుడి కుటుంబసభ్యులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.


