పొత్తు బేరం వెనుక బీజేపీ నేత మాధవ్ బంధుప్రీతి?
తిరుపతి కాదని అనంతపురం కోసం పట్టుబట్టడానికి కారణమిదే?
మాధవ్ బావమరిది కోసమేనని పార్టీ నేతల ఆగ్రహం
సాక్షి, అమరావతి: కూటమి పొత్తుల్లో మరో విచిత్రం ఇది. కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని వ్యక్తి కోసం బీజేపీ నేతలు అనంతపురం మేయర్ సీటు పట్టుబట్టి మరీ తీసుకోవడం ఆ పార్టీలో పెద్ద చర్చకే దారితీసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బంధుప్రీతే ఇందుకు కారణమని పార్టీ నేతలు మండిపడుతున్నారు. నగరపాలక సంస్థల్లో బీజేపీకి తిరుపతితో పాటు మరికొన్ని కార్పొరేషన్లు అడుగుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ, గురువారం రాత్రి ప్రకటించిన సర్దుబాటులో బీజేపీకి వచ్చింది అనంతపురం, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థలు. తిరుపతి వదులుకుని బీజేపీ నేతలు అనంతపురం సీటు కోసం పట్టుబట్టడమే బీజేపీ శ్రేణులను కంగు తినిపించింది.
చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ బంధుప్రీతే ఇందుకు కారణమన్న విషయం పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేని బావమరిది డాక్టర్ విక్రమ్ కోసమే అనంతపురం సీటు పట్టుబట్టి మరీ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం మేయర్ సీటును ఆశిస్తున్న డాక్టర్ విక్రమ్, మాధవ్ సతీమణి ఇద్దరూ అన్నదమ్ముల సంతానం. విక్రమ్‌కు సీటు అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, అనంతపురం మేయర్ స్థానాన్ని కోరి తీసుకోవడం వెనుక ఉద్దేశం అదేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
అనేక ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తికి సీటు ఎలా కేటాయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి తిరుపతి కోసం సీనియర్ నేత భానుప్రకాష్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం బీజేపీ ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న విష్ణువర్థన్‌రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తే. పార్టీ కోసం పనిచేసిన ఇలాంటి అనేక మందిని కాదని మాధవ్ బావమరిది విక్రమ్‌కు అనంతపురం మేయర్ సీటు ఇస్తే పార్టీ శ్రేణులకు ప్రతికూల సంకేతాలు వెళ్తాయని బీజేపీ సీనియర్ నేతలు అంటున్నారు.


