సత్వర సాయమే లక్ష్యంగా.. | Sakshi
Sakshi News home page

సత్వర సాయమే లక్ష్యంగా..

Published Thu, Dec 7 2023 1:10 AM

వడ్డాదిలో డైవర్షన్‌ రోడ్డు మునిగి వంతెనపై నుంచి ప్రవహిస్తున్న నీరు  - Sakshi

జిల్లాలో వర్షపాతం
సహాయ కార్యక్రమాలు ముమ్మరం
● వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంకు వివరించిన కలెక్టర్‌

సాక్షి, అనకాపల్లి: మిచాంగ్‌ తుపాను తీరాన్ని దాటాక కూడా జిల్లాలో వర్షం కొనసాగింది. మంగళవారంతో పోలిస్తే వర్షపాతం తక్కువైనా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీటితో బుధవారం వాగులు, వంకలు ఉధృతరూపం దాల్చాయి. అయితే అధికారుల ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తినష్టం తప్పింది. మంగళవారం జిల్లాలో అత్యధికంగా బుచ్చెయ్యపేట మండలంలో 8.7 సెం.మీ వర్షం కురిసింది. పెద్దేరు జలాశయంలోకి 4 వేల క్యూసెక్కులు వరద నీరు వచ్చి చేరడంతో అంతే వరద నీటిని 3 ప్రధాన గేట్ల ద్వారా పెద్దేరు నదిలోకి విడుదల చేస్తున్నారు. రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు తక్షణ సూచనలు అందిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.

12 మండలాలపై ప్రభావం

జిల్లాలో వర్షాలు జోరుగా కురిసినా ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించగలిగామని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి చెప్పారు. అధికారులు, ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల కృషితో ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 32,091 ఎకరాల వరి పంటపై తుపాను ప్రభావం కనిపించిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నాలుగు జెర్సీ ఆవులు చనిపోయినట్లు గుర్తించామని, 25 ఇళ్లు దెబ్బతిన్నాయని, 86 పూరిళ్లు పాక్షికంగా నష్టపోయాయన్నారు. 409 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, 54 వైద్యశిబిరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తుపాను ప్రభావం కనిపించిన 32,091 ఎకరాల్లో 12,566 ఎకరాలు నీటమునిగాయని, నేలకొరిగినవి 18,935, మిగతా 590 ఎకరాల్లో పనలు నీటితో నిండిపోయాయన్నారు. 535 ఎకరాల్లో ఉద్యానపంటలపై తుపాను ప్రభావం కనిపించిందన్నారు. విద్యుత్‌ శాఖలో రూ.21 లక్షల విలువైన ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, 38 విద్యుత్‌ స్తంభాలకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేశామన్నారు. వీటిని యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకోవడం జరిగిందని, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై వైద్యశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.

●బుచ్చెయ్యపేట మండలం ఆర్‌.భీమవరానికి చెందిన ఇద్దరు యువకులు దేవర అప్పారావు, గడదాసు ఈశ్వరరావు పొలాలకు వెళ్లి ఊటగెడ్డలో నుండి ఇంటికొస్తూ.. నీటి ఉధృతికి కొట్టుకుపోతుండగా స్ధానికులు వెంటనే తాళ్లు వేసి ఇద్దరి యువకుల్ని రక్షించారు.

●మాడుగుల మండలంలో గాదిరాయి, పంట చెరువు, వొమ్మలి సవడ చెరువులు, వీజేపురం వద్ద గొరిగెడ్డలకు గండి పడడంతో పంట పొలాలు నీటి ముంపునకు గురయ్యాయి. జెడ్పీ సీఈవో పోలినాయుడు, తహసీల్దార్‌ పీవీరత్నం గండ్లకు ఇసుక బస్తాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.

స్వయంభూ వినాయకుడికీ తప్పని ముంపు

చోడవరం: స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం గర్భగుడిలోకి వర్షపు ఊటనీరు చేరింది. గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏనుగుబోదు చెరువు నిండిపోవడంతో ఊటనీరు ఆలయంలోకి వచ్చి స్వామివారి మూలవిరాట్‌ను ముంచింది. ముంపు నీరును బయటకు తోడేందుకు ఆలయ వర్గాలు చర్యలు చేపట్టాయి.

మండలం సెం.మీ

బుచ్చెయ్యపేట 8.7

యలమంచిలి 7.8

కశింకోట 6.6

ఎస్‌.రాయవరం 6.4

నర్సీపట్నం 6.1

చోడవరం 6.1

రోలుగుంట 5.9

దేవరాపల్లి 5.8

మండలం సెం.మీ

పరవాడ 4.9

పాయకరావుపేట 4.3

రావికమతం 3.9

మాడుగుల 3.4

అనకాపల్లి 3.2

అచ్యుతాపురం 2.6

రాంబిల్లి 1.9

మునగపాక 1.1

సాక్షి, అనకాపల్లి: తుపాను సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అనకాపల్లి జిల్లా నుంచి కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి, ఎస్పీ మురళీకృష్ణ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాపై తుపాను ప్రభావం, తీసుకున్న ముందస్తు చర్యలు, బాధితులకు అందుతున్న సహాయ చర్యలను కలెక్టర్‌ వివరించారు. ప్రభుత్వ సాయం అందరికీ అందాలని ముఖ్యమంత్రి చెప్పారు. తుపాను కారణంగా ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు తక్షణ సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని ఆదేశించారు.

అప్రమత్తత కొనసాగాలి

తుమ్మపాల: తుపాను ప్రభావంపై గురువారం వరకు అప్రమత్తంగా ఉండాలని, సహాయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని కలెక్టర్‌ రవి పట్టాన్‌శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి ఆయన జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో బుధవారం వెబ్‌ఎక్స్‌ నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల వారికి పరిస్థితిని వివరించి శిబిరాలకు చేర్చాలన్నారు.

శిబిరాలలో పూర్తిస్థాయి ఏర్పాట్లు, నాణ్యమైన భోజనాలు అందాలన్నారు. పూర్తిగా వరద ప్రభావం తగ్గిన తరువాతే వారిని ఇంటికి పంపించాలని ఆదేశించారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాత కార్డు ఉన్నా, లేకపోయినా అందరికీ రేషన్‌ అందజేయాలని ఆదేశించారు.

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

జడి వానలో జోరుగా పునరుద్ధరణ చర్యలు

తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలుకు చర్యలు

సీఎం ఆదేశాల మేరకు వర్షాలతో ఇళ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం

జిల్లాలో 32,091 ఎకరాల వరి పంటపై తుపాను ప్రభావం

ముందస్తు అప్రమత్తతతో తప్పిన ప్రాణ, ఆస్తినష్టాలు

బుచ్చెయ్యపేటలో అత్యధికంగా 8.7 సెం.మీ వర్షపాతం

1/1

Advertisement
Advertisement