కాయ్‌ రాజా కాయ్‌ | Sakshi
Sakshi News home page

కాయ్‌ రాజా కాయ్‌

Published Wed, May 15 2024 10:05 AM

కాయ్‌ రాజా కాయ్‌

● వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో ఉత్సాహం ● రూ.లక్షల నుంచి కోట్లలో బెట్టింగులు ● కొన్నిచోట్ల పందేనికి భూములు కూడా.. ● తేడా రాకుండా ఇరువర్గాల అగ్రిమెంట్లు ● ఓటమి భయంతో కూటమి నాయకుల వెనకడుగు

సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మళ్లీ ప్రభంజనం స్పష్టం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. రెండోసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. సోమవారం జరిగిన పోలింగ్‌ సరళితో పాటు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వివిధ సంస్థలు జరిపిన సర్వేల్లో వైఎస్సార్‌సీపీకే ఓటర్లు పట్టం కట్టబోతున్నారని ఇప్పటికే తేటతెల్లం చేశాయి. దీంతో గెలుపుపై వైఎస్సార్‌సీపీ శ్రేణులతో పాటు పలువురు పందాలకు ముందుకొస్తున్నారు. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ భారీగా బెట్టింగులకు దిగుతున్నారు. పందాలపై ఆసక్తి ఉన్న వారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు పోలయ్యాయన్న దానిపై సోమవారం సాయంత్రం నుంచే తమకున్న పరిచయాలు, ఇతర మార్గాల ద్వారా ఆరా తీయడం మొదలు పెట్టారు. ఏ ప్రాంతంలో, ఏ వర్గం ఓట్లు ఎంతమేర ఎవరికి ఎంత పడ్డాయి? వంటి అంశాలపై మంగళవారం నాటికి నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, పేద, మధ్య తరగతికి చెందిన ఓటర్లు అత్యధికంగా వైఎస్సార్‌సీపీ వైపే మొగ్గు చూపారు. ఇలా మెజార్టీ అంచనాలన్నీ వైఎస్సార్‌సీపీ గెలుపునే సూచిస్తుండడంతో ఓ నిర్ధారణకు వచ్చిన వీరు బెట్టింగులకు సిద్ధమయ్యారు. సోమవారం వరకు కూటమి గెలుస్తుందని ఊరేగిన వారంతా పోలింగ్‌ జరిగాక వెనక్కి తగ్గారు. ఇప్పుడు బెట్టింగ్‌లకు అంతగా ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల మాత్రం ఇంకా కూటమిపై ఆశలు పెట్టుకున్న వారు పందాలు కాస్తున్నారు. ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకంటే మళ్లీ ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైనే బెట్టింగులకు దిగుతున్నారు. కొన్నిచోట్ల రూ.లక్షల్లోను, అక్కడక్కడ రూ.కోట్లలోనూ సై అంటున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా భూములనే ఫణంగా పెడుతున్నారు. అంతేకాదు.. పందాలు కాసి ఫలితాలు వెలువడ్డాక తేడాలు రాకుండా లిఖిత పూర్వక అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు.

రూ.లక్షల నుంచి కోట్ల వరకు..

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల్లో పందాల సందడి జోరుగా కనిపిస్తోంది. పెందుర్తి నియోజకవర్గంలో కొంతమంది రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు బెట్టింగులకు దిగారు. ఇక్కడ మళ్లీ వైఎస్సార్‌సీపీనే అధికారంలోకి వస్తుందని కొందరు, సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిప్‌రాజే రెండోసారి గెలుస్తారని పందాలు కాశారు. ఈ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో వైఎస్సార్‌సీపీ, కూటమి నాయకులు తమ పొంట పొలాలను ఫణంగా పెట్టి పందెం వేశారు. ఆ మేరకు సాక్షుల సమక్షంలో స్టాంపు పేపర్లపై ఒప్పంద పత్రాలు రాసుకున్నారు కూడా. అలాగే భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ ఉత్తర, విశాఖ పశ్చిమ, గాజువాక, నర్సీపట్నం తదితర నియోజకవర్గాల్లో పందాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కనీసం రూ.లక్ష నుంచి కోటి వరకు పందాలు నడుస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ, కూటమి అభ్యర్థుల మధ్య ఒకింత గట్టి పోటీ ఉన్న చోట్ల ఈ పందాలు మరింతగా కనిపిస్తున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటికి రెండింతలు చొప్పున ఇచ్చేలా బెట్టింగులకు సిద్ధమవుతున్నారు. కాగా ఎన్నికల ముందు వరకు పందాలకు కాలు దువ్విన కూటమి శ్రేణులు.. పోలింగ్‌ తర్వాత వెనక్కి తగ్గారు. అదే సమయంలో గెలుపుపై ధీమాతో ఉన్న వైఎస్సార్‌సీపీ అభిమానులు మాత్రం దూకుడుగా ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement