బోనాల పండుగకు వేళాయె | - | Sakshi
Sakshi News home page

బోనాల పండుగకు వేళాయె

Jun 26 2025 6:33 AM | Updated on Jun 26 2025 6:33 AM

బోనాల

బోనాల పండుగకు వేళాయె

● నేటి నుంచి ఆషాఢమాసం ప్రారంభం ● ఊరుకట్టడితో ప్రత్యేక పూజలు ● డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు ● వనభోజనాలు, గోరింటాకు సంబురాలు

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలో బోనాల సందడి షురూ కానుంది. ఈనెల 26 నుంచి నెలరోజుల పాటు డప్పు చప్పుళ్లు పోతరాజుల విన్యాసాలు శివసత్తుల సిగాలు, కళాకారుల ఆటపాటలు, డీజే హోరుతో వాడవాడలు మార్మోగనున్నాయి. బోనాల జాతర సంస్కృతి సంప్రదాయలను కొనసాగించడమే కాదు... ఆర్థిక కోణంలోనూ అనేక మందికి ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఊరు కట్టడి ఆనవాయితీ. మహిళలు మెహందీ (గోరింటాకు)తో మురిసిపోతుంటారు. గురువారం ప్రారంభమయ్యే ఆషాఢమాసంపై ప్రత్యేక కథనం..

ఊరుకట్టడి ఇలా..

గ్రామీణ ప్రాంతాల్లో పాడి పంటలు, పిల్లాపాపలు, పశుసంపద సల్లంగా ఉండాలని కోరుతూ గ్రామస్తులంతా ఏకమై ఊరు కట్టడి చేస్తారు. పూజలు పూర్తయ్యేంత వరకు గ్రామస్తులెవరూ బయటకు వెళ్లరు. బయటి వ్యక్తులను గ్రామంలోకి రానీయరు. గ్రామ దేవతలైన పోచమ్మ, భూలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకలను బలిఇస్తారు. పోతరాజు గావుపట్టి ఊరు చుట్టూ తిరుగుతూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బోనాలతో ఊరేగింపుగా వెళ్లి..

ఆషాఢమాసంలో డప్పుచప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మతల్లికి బోనాలు సమర్పిస్తారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలలో ముదిరాజ్‌ల ఆరాధ్యదైవం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ముదిరాజ్‌ కులస్తులంతా కలిసి బోనాలతో బయలుదేరి అమ్మవారిని దర్శించుకుంటారు. హమాలీవాడ పోచమ్మ చెరువు సమీపంలోని మండేలయ్యకు రజకులు, గౌడ కులస్థులు ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పించడం ఆనవాయితీ. తాటి, ఈత వనంలో తమకు మంచి జరగాలని గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఎల్లమ్మతల్లికి బోనాలు సమర్పిస్తారు.

మహిళలకు గోరింటాకు పండుగ..

ఆషాఢమాసం వచ్చిందంటే గోరింటాకు గుర్తుకు వస్తుంది. మహిళలు, యువతులు, పిల్లల చేతులు గోరింటాకుతో కళకళలాడుతుంటాయి. రుతువు మారినవేళ గోరింటాకు పెట్టుకుంటే కాళ్లు, చేతులు గోళ్లు శుభ్రపడుతాయని రోగనిరోథకంగా అంటూ వ్యాధులను దూరం చేస్తుందని నమ్మకం. ఒకప్పుడు గోరింటాకు ముద్దలుగా చేసి ఇంటిల్లిపాది చేతులు, కాళ్లకు పెట్టుకునే వారు. పట్టణ ప్రాంతాల్లో మెహందీగా వివిధ ఆకృతుల్లో తీర్చిదిద్దటానికి కొంతమందికి ఉపాధి మార్గంగా మారింది. విద్యాసంస్థల్లో గోరింటాకు విశిష్టతను తెలిపేలా విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. బాలికలు, మహిళలు, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు నిర్వహిస్తారు.

పండుగతో ఉపాధి..

బోనాల పండుగ ఉపాధికి ఊతమివ్వనుంది. ప్రత్యేకంగా పోతరాజుల విన్యాసాలకు ఎంతో ప్రాధాన్యమిస్తారు. ఇతర ప్రాంతాలకు చెందిన కళాకారులు మంచిర్యాల ప్రాంతాలకు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. బోనం సమర్పించేందుకు కుండలు ఎంతో అవసరం. నైవేద్యం సమర్పించే కుండతో పాటు దానిపై ఉండే చిన్న చిన్న బుడ్డిదీపం పెట్టే ముంత కలిపి ఒక సెట్‌లాగా ఉంటుంది. ఈ సమయంలో కుమ్మరులు బిజీగా ఉంటారు. డప్పులు వాయించేవారి నుంచి డీజేల వరకు ఉపాధి పొందనున్నారు. బోనం అలంకరణకు అవసరమైన పూల వ్యాపారం ఊపందుకుంటుంది. హైదరాబాద్‌, తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు పూలను సిద్ధం చేస్తారు. మేకలు, కోళ్లకు భలే డిమాండ్‌ ఉంటుంది.

బోనాల పండుగకు వేళాయె1
1/1

బోనాల పండుగకు వేళాయె

Advertisement
 
Advertisement
Advertisement