రోగుల బిల్లులు స్వాహా | Sakshi
Sakshi News home page

రోగుల బిల్లులు స్వాహా

Published Fri, Nov 10 2023 5:36 AM

డీఈవోకు ఫిర్యాదు చేసిన పత్రం - Sakshi

● విద్యాశాఖలో ఓ అధికారి ఇష్టానుసారం ● విధులుకు రాకుండానే రిజిష్ట్రర్‌లో సంతకాలు ● చర్యకు వెనుకాడుతున్న విద్యాశాఖాధికారులు ● ఇబ్బందులు పడుతున్న టీచర్లు

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యాశాఖలో ఓ ఉద్యోగి అవినీతి, ఆరోపణలు తారస్థాయికి చేరుకున్నాయి. గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు రావడం, పలువురు ఉపాధ్యాయులు విద్య శాఖాధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో ఆయన మరింతగా రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది. అతడికి కొంతమంది తోటి ఉద్యోగులు, అధికారుల అండదండలు ఉండడంతో ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఉపాధ్యాయ సంఘాల నాయకులు గతంలో ఆ ఉద్యోగిపై ఫిర్యాదు చేయడంతో అతడిని ఆ సెక్షన్‌ నుంచి తొలిగించారు. ఆ ఉద్యోగికి ఎలాంటి సెక్షన్‌ ఇవ్వకపోగా ప్రస్తుతం ఆయనను ఖాళీగానే ఉంచారు. దీంతో ఆ ఉద్యోగి విధులకు రాకపోవడం, హాజరు పట్టికలో మాత్రం విధులు నిర్వహిస్తున్నట్లు సంతకాలు చేస్తున్నాడు. అయితే అతడి అక్రమాలు తవ్వినకొద్ది బయట పడుతూనే ఉన్నాయి. ఉపాధ్యాయులు గతంలో రోగాల బారినపడి బిల్లుల కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం, కొంతమంది ఉపాధ్యాయులకు మరింతగా బిల్లులు పెంచుతామని డబ్బులు అడగడం ఆయనకు పరిపారిటిగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు త్వరగా చేపిస్తామని సంబంధిత బాధితులకు ఫోన్‌చేసి అడగడం, వారి నుంచి డబ్బులు తీసుకొని ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనేక మంది బాధిత ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆదిలాబాద్‌ పట్టణంలోని తాటిగూడ పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు 2022లో మెడికల్‌ బిల్లుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఏడాది గడిచినా ఆ బిల్లులు చేయకపోవడం, కార్యాలయంలో ఆ ఫైల్‌ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయమై ఆ ఉపాధ్యాయులు డీఈఓకు ఫిర్యాదు చేశాడు. సంబంధిత ఫైల్‌ కూడా కార్యాలయంలో కనిపించకపోవడంతో ఆ ఉద్యోగి ఆందోళన చెందుతున్నాడు. ఇలాంటి తతంగాలు అనేకంగా జరుగుతున్నట్లు సమాచారం. అయినప్పటికీ ఆ ఉద్యోగిపై చర్యలకు వెనుకాడటం వెనుక మతలబు ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విషయమై జిల్లా విద్య శాఖాధికారి ప్రణితను వివరణ కోరగా, ఆయనకు మెమో జారీ చేయడం జరిగిందని, అతడి వివరణ అనంతరం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రిజిష్ట్రర్‌లో సంతకాలు చేసిన దృశ్యం
1/1

రిజిష్ట్రర్‌లో సంతకాలు చేసిన దృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement