ప్రతి గడపనా.. ప్రగతి బావుటా | Sakshi
Sakshi News home page

ప్రతి గడపనా.. ప్రగతి బావుటా

Published Tue, May 14 2024 10:00 AM

ప్రతి

ఉమ్మడి తూర్పున రూపురేఖలు మారిన పల్లెలు

అధునాతన సౌకర్యాలతో బడులు, ఆసుపత్రులు

సచివాలయాలు, ఆర్‌బీకే, విలేజ్‌ క్లినిక్‌లతో గ్రామాల్లోనే సేవలు

పారిశ్రామికాభివృద్ధికీ పెద్ద పీట

కళ్ల ముందే కనిపిస్తున్న మార్పు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎందరో ఉద్దండులు ఏలిన ఉమ్మడి తూర్పు గోదావరి రాజకీయ చైతన్యానికి మారుపేరు. పునర్విభజనతో ఈ జిల్లా కాస్తా మూడు జిల్లాలైంది. అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ సార్వత్రిక ఎన్నికలు రాజకీయంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సహజంగానే రాజకీయాల్లో ‘తూర్పు’ సెంటిమెంట్‌ను బలంగా విశ్వసిస్తారు. ఈ జిల్లాల ప్రజలు ఇచ్చే తీర్పు రాష్ట్ర దశ, దిశలను నిర్దేశిస్తాయని నమ్ముతారు. నాటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అరకులోయతో కలిపి నాలుగు లోక్‌సభ, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండేవి. వీటిలో ఒకటైన రంపచోడవరం జిల్లాల విభజన అనంతరం పాడేరు జిల్లాలో కలిసింది. ఉమ్మడి జిల్లాలో జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ సీపీ, అధికార పక్షమైన టీడీపీల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. ఈ పోరులో టీడీపీ కేవలం నాలుగంటే నాలుగు (పెద్దాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్‌, మండపేట) అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. మిగిలిన 14 అసెంబ్లీ స్థానాలతో పాటు, కాకినాడ, అమలాపురం, రాజమహేంద్రవరం, అరకులో ఎంపీ సీట్లలో ప్రజలు అప్రతిహతమైన మెజార్టీలు అందించడంతో వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించింది. నాడు ప్రతిపక్ష నేతగా నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర ద్వారా తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలకు పరిష్కారం చూపాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గట్టి పట్టుదలతో మేనిఫెస్టో రూపొందించారు. దీనిని తు.చ. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకంతో వైఎస్సార్‌ సీపీకి దాదాపు అన్ని వర్గాల ప్రజలూ పట్టం కట్టారు.

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా..

వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగించారు. ఆర్థికంగా అన్ని వర్గాలకూ లబ్ధి చేకూర్చడం ద్వారా ప్రతి ఇంటా ప్రగతి జెండా ఎగురవేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99 శాతం పైగా అమలు చేశారు. పార్టీ, కులం, మతం, వర్గం చూడకుండా అర్హతే ప్రామాణికంగా పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందజేసి ప్రజల మనసుల్ని చూరగొన్నారు. ప్రధానంగా గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిటకే తీసుకుని వచ్చారు. ప్రతి నెలా ఒకటో తేదీన తెల్లవారకుండానే అవ్వాతాతల ఇళ్ల తలుపు తట్టి మరీ పింఛన్లు అందించారు. ‘నాడు–నేడు’తో బడులు, ఆస్పత్రుల స్వరూపాన్నే మార్చేసి, విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. కోవిడ్‌ వంటి కష్టకాలం ఎదురైనా, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కరోనా బాధితులకు వెన్నంటే నిలిచి, వారి ప్రాణాలకు భరోసా ఇచ్చారు.

ప్రగతికి పెద్దపీట

ఫ పల్లె, పట్టణమనే తేడా లేకుండా అవసరమైన ప్రతిచోటా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు.

ఫ ఉమ్మడి జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయాలు, వైద్య, ఆరోగ్య రంగం, ఇతర రంగాలతో పాటు మునుపెన్నడూ లేనివిధంగా కారుణ్య నియామకాల ద్వారా వేలాది మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.

ఫ నూతన పారిశ్రామిక విధానం ద్వారా కాకినాడ జిల్లావ్యాప్తంగా గడచిన ఐదేళ్లలో రూ.875.18 కోట్ల పెట్టుబడులతో 3,586 మందికి ఉపాధి కల్పించేలా 10 పెద్ద పరిశ్రమలు స్థాపించారు. వీటిలో రూ.330 కోట్లతో 5 రొయ్యలు ప్రాసెసింగ్‌కు సంబంధించినవి ఉండటం విశేషం. వీటి ద్వారా రోజుకు 232 టన్నుల రొయ్యలను శుద్ధి చేస్తున్నారు. సుమారు 2,956 మంది నేరుగా ఉద్యోగాలు పొందారు. ఇంకా యు.కొత్తపల్లి మండలం కేఎస్‌ఈజెడ్‌లోని పొన్నాడ, పెద్దాపురం మండలం జి.రాగంపేట, ప్రత్తిపాడు మండలం లంపకలోవ వద్ద వివిధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు లభించాయి. ఆక్వా, ఆహార పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారు.

ఫ కాకినాడ జిల్లాలో 2019–20 నుంచి ఇప్పటి వరకూ రూ.390 కోట్ల పెట్టుబడులతో 3,516 మైక్రో, స్మాల్‌, మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎంఎస్‌ఎంఈ) ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా 16,394 మంది ఉపాధి పొందుతున్నారు.

ఫ నవ్య తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ తొలి దశలో రూ.1,000 కోట్లు, రెండో దశలో మరో రూ.1,500 కోట్లు కలిపి మొత్తం రూ.2,500 కోట్ల పెట్టుబడితో గ్రాసిమ్‌ కాస్టిక్‌ సోడా ప్లాంట్‌ నిర్మించింది. దీని ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతోంది.

ఫ గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డి గ్రామంలో రూ.260 కోట్ల అంచనాతో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఏపీఐఐసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.13.50 కోట్ల విలువైన 20.07 ఎకరాల భూమి కేటాయించింది. ఈ పరిశ్రమ నిర్మాణం పూర్తయితే 210 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి దక్కుతుంది.

ఫ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి గ్రామం వద్ద రూ.1,350 కోట్ల పెట్టుబడితో త్రివేణి రెన్యువబుల్స్‌ సంస్థ ఆధ్వర్యాన సోలార్‌ గ్లాస్‌ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2,400 మందికి ఉద్యోగాలు లభించాయి.

ఫ ఇంకా నల్లజర్ల మండలం పోతవరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామం వద్ద ఏర్పాటవుతున్న పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఉపాధి లభించనుంది. జిల్లా వ్యాప్తంగా 2,427 ఎంఎస్‌ఎంఈల ఏర్పాటు ద్వారా 10,179 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి.

సమపాళ్లలో అభివృద్ధి, సంక్షేమం

ఉమ్మడి జిల్లాలో ప్రజలకు రూ.వేల కోట్లతో సంక్షేమం, అభివృద్ధిని అందించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం తోడుగా నిలిచింది. పారిశ్రామికాభివృద్ధికీ పెద్ద పీట వేస్తోంది. ఆ ధైర్యంతోనే ‘మీ ఇంటిలో ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా మంచి జరిగి ఉంటేనే ఓటేయండి’ అని ఎన్నికల ప్రచార సభల్లో సీఎం జగన్‌ ధైర్యంగా అడిగారు. దీనికి అనుగుణంగానే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం జరిగే పోలింగ్‌లో అన్ని వర్గాలకూ మంచి చేసిన ముఖ్యమంత్రికి మద్దతు తెలిపేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. వారితో పాటు హైదరాబాద్‌, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఓటర్లు బస్సులు, రైళ్లలో ఒక రోజు ముందుగానే స్వస్థలాలకు ఆదివారం నాటికే చేరుకున్నారు. మరికొందరు సోమవారం ఉదయానికి చేరుకోనున్నారు. గడచిన ఐదేళ్లుగా తమ తమ కుటుంబాలకు జరిగిన మేలును, కళ్ల ముందే కనిపిస్తున్న మార్పును గుర్తుంచుకుని, సంక్షేమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలనే సంకల్పంతో వారున్నారు. గతంలో జన్మభూమి కమిటీల అరాచకాలు, అక్రమాల పాలన మరోసారి వద్దు బాబూ అంటూ ఓటుతో బుద్ధి చెప్పాలని భావిస్తున్నారు. 2014లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ అమలు చేయని చంద్రబాబు.. ఇప్పుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ హామీలను సైతం ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడున్న పథకాలకు డబుల్‌, త్రిబుల్‌ ఇస్తానంటూ ఆయన ఊదరగొడుతున్నా జన స్పందన కరువవుతోంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో పరుగులు పెట్టించిన ప్రస్తుత ప్రభుత్వానికే మరోసారి మద్దతుగా నిలవాలనే సంకల్పంతో ఆయా వర్గాలు సిద్ధమవుతున్నాయి.

జిల్లాలో అభివృద్ధి జరిగిందిలా..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా

ఫ జిల్లాలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. లంక గ్రామాలకు వారథులు నిర్మించారు. రహదారులను బాగు చేశారు.

ఫ గోదావరి లంక, మత్స్యకార గ్రామాల దాహార్తిని తీర్చేందుకు రూ.1,650 కోట్లతో మెగా వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఫ రూ.450 కోట్లతో జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు జరుగుతున్నాయి.

ఫ 979.734 ఎకరాల లంక భూములకు సంబంధించి 2,991 మంది లబ్ధిదారులకు లీజు పట్టాలు పంపిణీ చేశారు.

ఫ నాడు–నేడులో ఆరు పీహెచ్‌సీలను రూ.9.21 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు.

ఫ గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా 515 సచివాలయాలను అభివృద్ధి చేశారు. రూ.72.88 కోట్లతో 1,102 పనులు చేపట్టారు.

ఫ మన బడి నాడు–నేడు కింద మొదటి విడతలో 436 పాఠశాలలను రూ.104.96 కోట్లతో అభివృద్ధి చేశారు. రెండో విడతలో 761 పాఠశాలలను, 10 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను రూ.257 కోట్లతో కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు.

ఫ పేదలకు రికార్డు స్థాయిలో మొదటి విడతలో 24,644 ఇళ్లు మంజూరు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన వైఎస్సార్‌ పట్టణ పథకం ద్వారా రూ.443.59 కోట్లతో, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన వైఎస్సార్‌ గ్రామీణ పథకం ద్వారా 9,810 ఇళ్ల నిర్మాణం రూ.176.58 కోట్లతో జరుగుతున్నాయి.

ఫ ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనే సంకల్పంతో 1,834 ఆవాసాల్లో రూ.515.93 కోట్లతో ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైపులైన్లు నిర్మించారు. 209 జగనన్న కాలనీ లే అవుట్లలో కుళాయిల ఏర్పాటుకు రూ.45.75 కోట్లు కేటాయించారు.

ఫ గడచిన ఐదేళ్లలో రహదారులు, భవనాల నిర్మాణాలకు రూ.299.40 కోట్లు ఇచ్చారు.

ఫ పి.గన్నవరం మండలంలో లంక గ్రామాల ప్రజల కష్టాలను గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి హామీ మేరకు రూ.49.50 కోట్లతో గోదావరిపై వంతెన పనులు చురుకుగా జరుగుతున్నాయి.

ప్రతి గడపనా.. ప్రగతి బావుటా
1/1

ప్రతి గడపనా.. ప్రగతి బావుటా

Advertisement
 
Advertisement
 
Advertisement