యువోత్సాహం | Sakshi
Sakshi News home page

యువోత్సాహం

Published Tue, May 14 2024 10:00 AM

యువోత

నమ్మకం కలిగించాలి

నాయకుడనే వాడు ప్రజలకు నమ్మకం కలిగించాలి. విశ్వసనీయతకు మారుపేరుగా ఉండాలి. ఒకసారి అవకాశం ఇస్తే కొన్నేళ్లు పాటు దానిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయాలి. అలాంటి నాయకుడికే నా ఓటు.

– దడాల అక్ష, ఇంజినీరింగ్‌ విద్యార్థి, తూరంగి

పేద విద్యార్థులకు మేలు చేయాలి

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉద్యోగ, విద్యావకాశాలు కల్పించాలి. కులం ప్రాతిపదికన కాకుండా, ఆర్థిక వెనుకబాటును ప్రామాణికంగా తీసుకుని అవకాశాలు కల్పించాలి. అలాంటి నాయకుడికే నా ఓటు.

– సీహెచ్‌ సిద్ధార్థ, డిగ్రీ విద్యార్థి, కాకినాడ

కాకినాడ సిటీ: ఎన్నికల విషయంలో యువ ఓటర్ల దృక్పథం మారుతోంది. ఎన్నికల, ఓటింగ్‌పై గతంలో యువకులు పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘంతో పాటు, పలు సంస్థలు ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా ప్రచారం చేయడంతో, యువత ఆలోచనా సరళి మారింది. 18 ఏళ్లున్న వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడంతో కాకినాడ జిల్లాలో యువ ఓటర్ల సంఖ్య పెరిగింది.

జిల్లాలో మొత్తం 16,99,122 మంది ఓటర్లుండగా, యువ ఓటర్ల సంఖ్య 7,36,101 మంది ఉన్నారు. ప్రజాస్వామ్యంలో తమకు నచ్చిన, మెచ్చిన నేతను ఎన్నుకునేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు. రానున్న ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామంటున్నారు. అవినీతి రహితంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పాలించే నేతనే ఎన్నుకుంటామని ప్రతినబూనుతున్నారు. యువత భవితకు భరోసా కల్పించాలని, పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నేతనే ఈసారి ఎన్నుకుంటామని చెబుతున్నారు.

తొలిసారిగా ఓటు వేసేందుకు..

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని తొలిసారిగా పొందిన యువత ఓటేసేందుకు సిద్ధమవుతోంది. భారత రాజ్యాంగం 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించింది. దేశంలో బీటెక్‌, డిగ్రీ, ఇతర యూజీ కోర్సులు చేస్తున్న వారు, తొలిసారిగా ఓటు హక్కు పొందారు. వీరంతా ఈ నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసి తమకు నచ్చిన ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోనున్నారు. కొత్తగా ఓటరుగా నమోదైన వారు సమర్థ నాయకత్వానికి ఓటు వేస్తామని, ఏళ్ల అనుభవం, ఇతర అంశాలను పట్టించుకోమన్నారు. యువత ఆశయాలను అర్థం చేసుకుని ముందుకు నడిపించ గలిగే నేతకు జై కొడతామంటున్నారు యువత. ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నా యువత ఓటర్లే కీలకం. దీంతో అన్ని రాజకీయ పార్టీలు యువ ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. వీరు ఏ పార్టీకి మద్దతు పలికితే ఆ పార్టీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఉరకలేస్తున్న కొత్త ఓటరు

యువత ఆశయాలు అర్థం చేసుకునే నాయకుడే రావాలి

సమర్థ పాలన అందించే వారికే ఓటు

తొలిసారి ఓటు వేయబోతున్న

యువ ఓటర్ల మనోగతం

జిల్లాలో యువ ఓటర్లు

నియోజకవర్గం 18–19 20–29 30–39

తుని 4,506 40,146 61,534

ప్రత్తిపాడు 3,550 36,958 61,386

పిఠాపురం 3,640 37,867 63,680

కాకినాడ రూరల్‌ 3,999 41,358 68,199

పెద్దాపురం 3,416 35,771 60,036

కాకినాడ సిటీ 3,680 39,381 62,449

జగ్గంపేట 3,450 37,245 63,800

మొత్తం 24,241 2,68,776 4,41,084

మంచి నాయకుడిని ఎన్నుకుంటాం

అబద్ధపు హామీలిచ్చి మోసం చేసే నాయకుడిని కాకుండా, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తు తరాల గురించి ఆలోచించి, రైతులకు, మహిళలకు, పేద వర్గాల వారికి మేలు చేసే వారికే నా ఓటు.

– కాకర మణికంఠ, కాకినాడ

హామీలు నెరవేర్చాలి

ఎన్నికల్లో పోటీ చేసేవారు తాము ప్రకటించిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు చేయగలిగాలి. అలాంటి వ్యక్తికే నేను ఓటు వేస్తాను. ఎన్నికల సమయంలో హామీలిచ్చి, వాటిని నెరవేర్చలేని నాయకులు మనకు అవసరం లేదు.

– చిల్లా కిషోర్‌, డిగ్రీ విద్యార్థి, కాకినాడ

యువోత్సాహం
1/3

యువోత్సాహం

యువోత్సాహం
2/3

యువోత్సాహం

యువోత్సాహం
3/3

యువోత్సాహం

Advertisement
 
Advertisement
 
Advertisement