తెలుగమ్మాయి.. వెలుగమ్మాయి!
‘పొరుగింటి పుల్లకూర రుచి’ అనే సామెత మన సినిమా పరిశ్రమకు బాగా వర్తిస్తుంది. ఎంత అందగత్తె అయినా కానివ్వండి... ఎంతటి ప్రతిభావంతురాలైనా అయ్యుండనీయండి.. ‘తెలుగమ్మాయి’ అయితే చాలు.. మనోళ్లు పక్కన పెట్టేస్తారు. అదే పరభాషా కథానాయికలైతే... నెత్తిన పెట్టేసుకుంటారు. అందుకు ఉదాహరణగా చాలామంది హీరోయిన్లే ఉన్నారు. అయితే.. మనకు పొరుగింటి పుల్లకూర ఎలా అయితే రుచో... పొరుగింటివారికి మన పుల్లకూర కూడా అలాగే రుచికరం కదా. అందుకేనేమో.. మనమ్మాయిలు పరభాషల్లో దుమ్ము రేపేస్తున్నారు. పరభాషల్లో సత్తా చాటుతున్న మన తెలుగమ్మాయిల గురించి చెప్పుకుందాం.
రచ్చ గెలిచి ఇంట గెలవడం అంటే ఇదే!: ‘ఫొటో’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది అంజలి. ‘తెలుగమ్మాయా... బావుందే..’ అనుకున్నారంతా. కానీ... అవకాశాలే రాలేదు. ఒకటి, రెండు సినిమాల్లో చేసినా గుర్తింపు రాలేదు. మరో వైపు పరభాషా కథానాయికలు దుమ్ము రేపేస్తున్నారు. అవకాశాలు రావాలంటే.. పరభాష నాయిక అయ్యుండాలనే సత్యాన్ని తెలుసుకుందో ఏమో.. సొంత భాషను వదిలేసి తమిళ భాషను నమ్మేసుకుంది. ఇంకేముంది తెలుగమ్మాయిలంటే తమిళ తంబీలకు అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది కదా.. అవకాశాలు వెల్లువెత్తాయి. ఆపకుండా పదమూడు సినిమాలు చేసేసింది. ఇవే గాక మలయాళంలో ఓ సినిమా, కన్నడంలో ఓ సినిమా. తమిళంలో స్టార్ హీరోయిన్ అయ్యేసరికి ఆటోమేటిగ్గా తెలుగులో క్రేజ్ మొదలవుతుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, బలుపు, మసాలా చిత్రాల్లో వెంటవెంటనే అవకాశాలొచ్చేయి. ప్రస్తుతం అంజలి చేస్తున్న సినిమా ‘మదగజరాజా’(ఎం.జి.ఆర్). విశాల్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రం ‘నటరాజు తానే రాజు’(ఎన్.టి.ఆర్) పేరుతో తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సినిమాతో అటు తమిళ ప్రేక్షకుల్ని, ఇటు మనవాళ్లని ఒకేసారి అలరించనుందీ తెలుగమ్మాయి.
దటీజ్ స్వాతి: అంజలితో పోల్చుకుంటే స్వాతి కెరీర్ చాలా బెటర్. తెలుగులో త్వరగానే అవకాశాలొచ్చాయి. ‘కలర్స్’ టీవీ ప్రోగ్రామ్‌తో పాపులరైన తను... కృష్ణవంశీ ‘డేంజర్’తో తెలుగుతెరకు పరిచయమైంది. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ చిత్రంలో అయితే... త్రిషకే పోటీ ఇచ్చింది. ఎంత చేస్తే ఏం లాభం.. అవకాశాలే రాలేదు. ఇలాకాదని తమిళంలో ‘సుబ్రమణియపురం’ చేసింది. నిజానికి ఆ సినిమాలో స్వాతి చేసింది కూడా ఏమీ లేదు. సినిమా మొత్తం కొంటెగా నవ్వడం తప్ప. కానీ ఆ నవ్వుకే పడిపోయారు తమిళ తంబీలు. సినిమా పెద్ద హిట్. తమిళంలో తనేంటో ప్రూవ్ చేసుకుందిగా! తెలుగులో ‘అష్టాచెమ్మా’ అవకాశం దూసుకొచ్చింది. కథానాయికగా నటించిన తొలి సినిమాతోనే నంది అవార్డును కొట్టేసింది. తర్వాత కలవరమాయే మదిలో, గోల్కొండ హైస్కూల్, అప్పల్రాజు చిత్రాల్లో కథానాయికగా చేసింది. అయితే.. విజయాలే వరించలేదు. పక్కనపెట్టేయడానికి ఈ ఒక్క రీజన్ చాలదా మనోళ్లకి. కట్ చేస్తే... మిరపకాయ్, కందిరీగ లాంటి చిత్రాల్లో అతిథి పాత్రలతో సరిపెట్టుకుంది స్వాతి. మళ్లీ తమిళ తెరను నమ్ముకుంది. ‘పోరాళి’ రూపంలో మరో హిట్. మలయాళ ఇండస్ట్రీని నమ్ముకుంది. ‘ఆమెన్’ పెద్ద హిట్. తర్వాత తెలుగులో చేసిన ‘స్వామిరారా’ పెద్ద హిట్. మళ్లీ మలయాళంలో చేసిన ‘నార్త్ 24 కథమ్’ పెద్ద హిట్. తమిళంలో చేసిన ‘ఇదర్కుదానా ఆశపట్టాయ్ బాలకుమార’ పెద్ద హిట్.. హిట్ల మీద హిట్లు. తెలుగమ్మాయి సత్తా ఏంటో నిరూపించేసింది. తమిళంలో తాను చేసిన ‘అమాలి తుమాలి’ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. అలాగే... జై సరసన నటిస్తున్న ‘వడకర్రీ’ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇంకో మలయాళం సినిమా కూడా చేసేస్తోంది. దటీజ్ స్వాతి.
లండన్ బ్రిడ్జ్ ఎక్కేసింది: ‘నీకూ నాకు డాష్ డాష్’ అంటూ తెలుగుతెరకు పరిచయమై.. తొలి అడుగుతోనే ఎదురుదెబ్బ తిన్న తెలుగమ్మాయి నందిత. ‘ప్రేమకథాచిత్రమ్’తో ముందు అందర్నీ భయపెట్టి, ఆనక కితకితలు పెట్టి మరీ తను హిట్టు కొట్టేసింది. మరి అంత హిట్టు కొట్టాక అయినా అవకాశాలు రావాలి కదా. తెలుగమ్మాయి అవ్వడం వల్లే అనుకుంటా రాలేదు. అందుకే... మలయాళంలో ‘లండన్ బ్రిడ్జ్’ ఎక్కేసింది. ఈ సినిమాతో అక్కడి స్టార్ హీరో పృథ్వీరాజ్‌తో జతకట్టే ఛాన్స్ పట్టేసింది. ఈ సినిమా హిట్ అయితే, ఇంటగెలిచి, రచ్చ గెలిచిన క్రెడిట్ నందిత కొట్టేసినట్టే.
తెలుగువారికి ఎప్పుడు చిక్కుతుందో: మల్లెలతీరంలో సిరిమల్లెపువ్వు... నిజంగా పేరుకు తగట్టే సిరిమల్లె పువ్వులా ఉంటుంది శ్రీదివ్య. హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే చిత్రాల్లో బాలనటిగా నటించిన ఈ సిరిమల్లెపువ్వుని ‘మనసారా’ హీరోయిన్ని చేశాడు రవిబాబు. అటుపై ‘బస్‌స్టాప్’తో హిట్టు కొట్టేసి, ‘మల్లెలతీరం..’తో ప్రశంసలు కొట్టేసి తాపీగా తమిళ తెరవైపు చూస్తోంది శ్రీదివ్య. అక్కడ తాను చేసిన తొలి సినిమా ‘వరుత్తపడాద వాలిబర్ సంగమ్’. సూపర్‌డూపర్ హిట్. ఆ ఒక్క సినిమాతో శ్రీదివ్య తలరాత మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మాయి చేతిలో అయిదు తమిళ సినిమాలున్నాయి. క్షణం తీరికలేకుండా తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. మరి తెలుగువారికి ఎప్పుడు చిక్కుతుందో ఏమో!
తమిళంలో బిజీ బిజీ: ‘ఆవకాయ్ బిర్యాని’ సినిమాతో ‘బంపర్ ఆఫర్’ కొట్టేసి, ఓం శాంతి, రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాలతో అనుకోని ఎదురుదెబ్బలు తిని, ‘పిల్ల జమిందార్’ పుణ్యమా అని కాస్త ఊపిరి పీల్చుకున్న తెలుగమ్మాయి బిందుమాధవి కూడా ప్రస్తుతం తమిళంలో బిజీ బిజీ. ఈ రెండేళ్లలో ఆరు తమిళ సినిమాల్లో నటించి అక్కడ బాగా పాపులర్ అయ్యింది తను. ప్రస్తుతం ఈ తెలుగమ్మాయి చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. కానీ తెలుగు సినిమానే బిందుమాధవిని చిన్నచూపు చూస్తోంది.
ఏదీ ఏమైనా... ఇలా మన అమ్మాయిలు పరభాషల్లో విజయకేతనం ఎగురవేయడం నిజంగా శుభపరిణామమే. తెలుగు నటీమణులైన భానుమతి, అంజలీదేవి, సావిత్రి, వాణిశ్రీ లాంటి తారలు తమిళనాట కూడా సూపర్స్టార్లుగా వెలిగారు. మన శారద మలయాళంలో సూపర్‌స్టార్‌గా భాసిల్లారు. వారంత కాకపోయినా... తెలుగు సినిమా సత్తాను మన అమ్మాయిలు కూడా చాటి చెప్పాలని ఆశిద్దాం.
తెలుగులో ఓ సినిమా, తమిళంలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. గత ఇరవై రోజులుగా అండమాన్ నికోబార్ రాజధాని ఫోర్ట్బ్లేయర్లో మలయాళం సినిమా షూటింగ్ జరుగుతోంది. అతిఫ్అలీ, తన్నీ వెయిన్ హీరోలు. వీరిద్దరికీ జోడీగా చేస్తున్నా. ఈ సినిమా షూటింగ్ అయ్యాక... తెలుగు ‘కార్తీకేయ’ షూటింగ్లో పాల్గొంటా. జై హీరోగా తమిళంలో ‘వడకర్రీ’ సినిమా చేస్తున్నా. ప్రస్తుతం ఈ మూడు సినిమాలతో బిజీ బిజీ. ఈ నెలంతా హైదరాబాద్‌లో
ఉండను. వచ్చే నెల కూడా వస్తాననే నమ్మకం లేదు. ఆనందకరమైన విషయం ఏంటంటే... మలయాళంలో నేను చేసిన తొలి సినిమా ‘ఆమెన్’లో క్రిస్టియన్‌గా చేశాను. రెండో సినిమా ‘నార్త్ 24 కథమ్’లో హిందూగా నటించాను. ప్రస్తుతం చేస్తున్న సినిమాలో ఆద్యంతం బురఖాతో ముస్లింగా కనిపిస్తా. నన్ను ఆదరిస్తూ.. భిన్నమైన పాత్రలతో ప్రోత్సహిస్తున్న మలయాళ పరిశ్రమకు, మలయాళ ప్రేక్షకులకు థ్యాంక్స్. - స్వాతి