పాక్ భారీ స్కోరు
అబుదాబి: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది. యూనిస్ ఖాన్ (349 బంతుల్లో 213; 15 ఫోర్లు; 2 సిక్సర్లు) డబుల్ సెంచరీకి తోడు మిస్బా (101) శతకం సాధించడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌ను 6 వికెట్లకు 570 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కెరీర్లో యూనిస్కిది ఐదో డబుల్ సెంచరీ. అలాగే 181 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటి పాక్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన మూడో బ్యాట్స్‌మన్ అయ్యాడు.
304/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన పాక్ ఆదిలోనే అజహర్ అలీ (109) వికెట్ కోల్పోయింది. మూడో వికెట్‌కు యూనిస్, అలీ కలిసి రికార్డు స్థాయిలో 236 పరుగులు జోడించారు. ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (16 బ్యాటింగ్), లియోన్ (1 బ్యాటింగ్) ఉన్నారు.