breaking news
ISRO Satish Dhawan Space Centre
-
నేడు జీఎస్ఎల్వీ డీ6 కౌంట్‌డౌన్
-
నేడు జీఎస్ఎల్వీ డీ6 కౌంట్‌డౌన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం ప్రయోగించనున్న జీఎస్ఎవీ డీ6కు మంగళవారం మధ్యాహ్నం 11.52 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభం కానుంది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన క్రయోజనిక్ దశతో రెండోసారి చేస్తున్న ప్రయోగం ఇది. కౌంట్‌డౌన్ ప్రారంభమైన 29 గంటల అనంతరం గురువారం సాయంత్రం 4.52 గంటలకు ప్రయోగం నిర్వహించేందుకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) నిర్ణయం తీసుకుంది. ల్యాబ్ వారు కౌంట్‌డౌన్ సమయంలో బుధవారం రెండోదశలో 39.1 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రయోగానికి ఆరు గంటల ముందు రాకెట్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. 49.1 మీటర్లు పొడవున్న జీఎస్ఎల్వీ రాకెట్ భూమి నుంచి నింగికేగే సమయంలో 416 టన్నుల బరువు ఉంటుంది. నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లలో 170.4 టన్నుల ద్రవ ఇంధనంతో పాటు కోర్ అలోన్దశలో 138.1 ఘన ఇంధనంతో మొదటిదశను 151 సెకన్లలో పూర్తిచేస్తారు. 39.5 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో రెండోదశను పూర్తిచేస్తారు. కీలకదశ అయిన క్రయోజనిక్ దశలో 12.8 టన్నుల క్రయో ఇంధనం సాయంతో పూర్తి చేస్తారు. జీఎస్ఎల్వీ డీ6 ద్వారా 2,117 కిలోలు బరువున్న జీశాట్-6 ఉపగ్రహాన్ని మోసుకెళ్లి 1,024 సెకన్లకు 170 కిలోమీటర్ల పెరూజీ (భూమికి అతి దగ్గరగా), 35,975 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా) 19.95 డిగ్రీల భూ సమాంతర కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశపెడతారు. అక్కడ నుంచి ఉపగ్రహాన్ని హసన్‌లోని కంట్రోల్ సెంటర్ అధీనంలోకి తీసుకుంటుంది.


