breaking news
Ferran Torres
-
సాహోరే స్పెయిన్
అంచనాలకు మించి మెరిపించిన స్పెయిన్ జట్టు రెండోసారి జగజ్జేతగా నిలిచింది. తుది సమరంలో ఆద్యంతం పక్కా ప్రణాళికతో ఆడుతూ డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా జట్టు ఆట కట్టించింది. సగర్వంగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఒక్కొక్కరు కాదు జట్టుగా ఆడితే ప్రపంచాన్ని జయించవచ్చని స్పెయిన్ నిరూపించింది. మొదట్లో వెనుకబడినా చివర్లో చెలరేగిపోతూ విజయాన్ని లాగేసుకుంటున్న అర్జెంటీనాకు తుది పోరులో స్పెయిన్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. నిర్ణిత 90 నిమిషాల్లో గోల్ చేయలేకపోయినా... అదనపు సమయంలో స్పెయిన్ సక్సెస్ సాధించింది. 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్ ఫెరాన్ టోరెస్ గోల్‌తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా తమ జోరును కొనసాగించి అర్జెంటీనాకు నిరాశను మిగిల్చింది. 16 ఏళ్ల తర్వాత స్పెయిన్ విశ్వవిజేత కావడంతో ఆ దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. సోమవారం స్వదేశానికి వచ్చిన ప్రపంచకప్ వీరులకు ఆ దేశం బ్రహ్మరథం పట్టింది. తిరుగులేని ఆధిక్యం... ఫైనల్లో అర్జెంటీనాపై స్పెయిన్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. ఆట ఆరంభమైన దగ్గరి నుంచి దాదాపు మ్యాచ్ ముగిసే వరకు బంతి స్పెయిన్ నియంత్రణలోనే ఉంది. ఈజిప్‌్ట, ఇంగ్లండ్‌లతో మ్యాచ్‌ల తరహాలో అర్జెంటీనా ఆఖర్లో కోలుకుంటుందని అందరూ భావించినా... స్పెయిన్ అసలు అలాంటి అవకాశమే ఇవ్వలేదు. తుది పోరులో జట్టు సభ్యులు ఒకరికొరకు ఏకంగా 853 పాస్‌లు ఇచ్చుకున్నారంటే, ప్రత్యర్థికంటే కనీసం 400 సార్లు ఎక్కువగా బంతిని ‘టచ్’ చేశారంటేనే స్పెయిన్ ఎలా బంతిపై పట్టు నిలబెట్టుకుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లు కుబార్సి, లాపోర్ట్, రోడ్రి మధ్యనే బంతి తిరుగాడింది. ఇద్దరు డిఫెండర్లు, మిడ్‌ఫీల్డర్ కలిపి ఫైనల్లో 359 సార్లు బంతిని ‘టచ్’తో తమ మధ్యే ఉంచుకున్నారు. టోర్నీ మొత్తంలో ఒకే ఒక గోల్ ఇవ్వడం జట్టు ఆధిపత్యాన్ని సూచిస్తోంది. టీమ్ మొత్తం 20 షాట్లు ఆడగా... 12 నేరుగా లక్ష్యంవైపే వెళ్లాయి. ఫైనల్ స్కోర్ 1–0తో చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగిందేమో అనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. ఒక జట్టు మాత్రమే పూర్తి ఏకపక్షంగా మ్యాచ్‌లో నిలిచింది. ఏకైక గోల్ సాధించిన ఫెరాన్ టోరెస్‌తో పాటు ఈ గోల్లో అతనికి సహకరించిన పెడ్రో పొరోస్, నికో విలియమ్స్... ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన మికెల్ మెరీనో, కెపె్టన్ రోడ్రి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక గోల్‌కీపర్ యునై సైమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏడు మ్యాచ్‌లలో ‘క్లీన్ షీట్’తో అతను జట్టును కాపాడిన తీరు నిజంగా సూపర్.వరుస టైటిల్స్ జోరు... రెండేళ్ల క్రితం బెర్లిన్‌లో యూరోపియన్ చాంపియన్‌షిప్ గెలుచుకున్న స్పెయిన్ ఇప్పుడు ప్రపంచకప్ విజేతగా నిలిచింది. 2008లో కూడా సరిగ్గా ఇదే తరహాలో యూరోప్ విజేతగా నిలిచిన రెండేళ్లకు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. నేషన్స్ లీగ్, అండర్–23 ఒలింపిక్ స్వర్ణం, అండర్–19 యూరోపియన్ చాంపియన్‌షిప్‌లతో కలిపితే గత ఐదేళ్లలో స్పెయిన్ పురుషుల జట్టు 5 పెద్ద టోరీ్నల్లో విజేతగా నిలవడం విశేషం. వీటికి తోడు 2023లో మహిళల ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కూడా సాధించిన స్పెయిన్...రెండు విభాగాల్లో ఒకే సారి ప్రపంచ కప్‌ను తమ వద్ద ఉంచుకున్న తొలి జట్టుగా నిలిచింది. దీనిని బట్టి చూస్తే ఫుట్‌బాల్‌లో స్పెయిన్ ఎంత నిలకడగా, ఘనంగా రాణిస్తుందో అర్థమవుతుంది. చేతులెత్తేసిన అర్జెంటీనా... వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయం 90 నిమిషాల వరకు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై ఒక్క షాట్ కూడా ప్రయత్నించని మొదటి జట్టుగా అర్జెంటీనా నిలిచింది! 117వ నిమిషంలో గానీ తొలి షాట్ కొట్టని జట్టు వరల్డ్ కప్ గెలుస్తుందని ఆశించగలమా! స్పెయిన్‌తో తుది పోరులో అర్జెంటీనా పరిస్థితి ఇలాగే కనిపించింది. అసలు ఇలాంటి ఆటను అభిమానులెవరూ ఊహించలేదు. మెస్సీపైనే అందరి దృష్టీ ఉండగా... ఇతర ఆటగాళ్లెవరూ జట్టు కోచ్ స్కలోని అంచనాలు నిలబెట్టలేకపోయారు. మ్యాక్ అలిస్టర్, రోడ్రిగో డి పాల్, లియాండ్రో పెరేడ్స్ ఫైనల్లో పూర్తిగా విఫలమయ్యారు. అసలు సమరంలో మెస్సీని నిలువరించడంలో స్పెయిన్ పూర్తిగా సఫలమైంది. మ్యాచ్ ముగియడానికి నాలుగు నిమిషాల ముందు మెస్సీ కొట్టిన కార్నర్ కిక్‌ను సబ్‌స్టిట్యూట్ గ్విలియోనా సిమోన్ క్రాస్ బార్ మీదుగా పంపించి వృథా చేయడం జట్టు పరిస్థితికి అద్దం పట్టింది. ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డుతో మైదానం నుంచి ని్రష్కమించడంతో చివర్లో 10 మందితోనే ఆడటం కూడా అర్జెంటీనా జట్టుకు చేటు చేసింది. నిజానికి స్పెయిన్ విజయం మ్యాచ్ ఆరంభంలోనే ఖాయమయ్యేది! అయితే అర్జెంటీనా గోల్ కీపర్ ఎమిలియానో మార్జినెజ్ అసాధారణ ప్రదర్శనతో గెలుపు ఆలస్యమైంది. ఫైనల్లో రికార్డు స్థాయిలో 12 షాట్లను అతను అడ్డుకోగలిగాడు.భవిష్యత్తు కూడా వారిదే...ఎనిమిది మ్యాచ్‌లలో ఒకే ఒక్క గోల్ ఇవ్వడం... దాదాపు లోపాలు లేని ఆట... ఇద్దరు 19 ఏళ్ల కుర్రాళ్లను సమర్థంగా వాడుకోవడంతో పాటు వారి చుట్టూ సీనియర్లతో కలిపి జట్టును సన్నద్ధం చేయడం... టోర్నీ ఆరంభానికి ముందే తాము అనుకున్న ప్రణాళికకు పూర్తి కట్టుబడి దానినే అమలు పర్చడం... స్పెయిన్‌ను రెండోసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిపాయి. ఈ జట్టు ఎలాంటి థ్రిల్లర్ సినిమాను తలపించే అనూహ్య మలుపుల తరహా ఆట ఆడలేదు. కానీ ఏం చేయాలనే దానిపై జట్టుకు చాలా స్పష్టత ఉంది. మిడ్‌ఫీల్డర్లు సత్తా చాటి దూసుకుపోగా, డిఫెండర్లు అయిన అద్భుత ఆటను ప్రదర్శించారు. ప్రతీ మ్యాచ్‌లో ఒక్కో హీరో జట్టు నుంచి వచ్చాడు. ఏడుగురు ప్లేయర్లు గోల్ స్కోరర్లు కావడం విశేషం కాగా క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్), డిబ్రూయిన్ (బెల్జియం), ఎంబాపె (ఫ్రాన్స్), మెస్సీల వంటి స్టార్లను స్పెయిన్ డిఫెన్స్ సమర్థంగా అడ్డుకుంది. టోర్నీ మొత్తంలో కలిపి ప్రత్యర్థులకు 43 సార్లు మాత్రమే షాట్లకు అవకాశం చిక్కింది. స్పెయిన్ గెలుపు ఇక్కడితోనే ఆగిపోదు. వచ్చే దశాబ్దంలో ఫుట్‌బాల్‌ను శాసించగల సామర్థ్యం టీమ్‌లో ఉంది. 19 ఏళ్ల ఇద్దరు కుర్రాళ్లు భవిష్యత్తులో టీమ్‌ను ముందుకు తీసుకెళ్లగలరు. ‘యంగ్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ కుబార్సి అద్భుతంగా ఆడుతుండగా... లమీన్ యామల్ విలువేమిటో ప్రపంచం ఇప్పటికే చూసింది. ఈ వయసులోనే వీరిద్దరు వరల్డ్ కప్ నెగ్గిన బృందంలో సభ్యులుగా ఉన్నారు.2026 ప్రపంచకప్ అవార్డులుగోల్డెన్ బూట్ (టోర్నీ టాప్ స్కోరర్): కిలియన్ ఎంబాపె (ఫ్రాన్స్; 10 గోల్స్). 2022 ప్రపంచకప్‌లోనూ ఎంబాపెకే గోల్డెన్ బూట్ అవార్డు లభించింది. వరుసగా రెండు ప్రపంచకప్‌లలో గోల్డెన్ బూట్ గెల్చుకున్న ఏకైక ప్లేయర్ ఎంబాపెనే. గోల్డెన్ బాల్ (టోర్నీ బెస్ట్‌ప్లేయర్): స్పెయిన్ కెప్టెన్ రోడ్రి. గోల్డెన్ గ్లౌవ్ (టోర్నీ బెస్ట్ గోల్‌కీపర్): స్పెయిన్ గోల్‌కీపర్ సిమోన్. మొత్తం ఎనిమిది మ్యాచ్‌ల్లో సిమోన్ ఒక్క గోల్ మాత్రమే సమరి్పంచుకున్నాడు. బెస్ట్ యంగ్ ప్లేయర్: కుబార్సి (స్పెయిన్). ఫెయిర్‌ప్లే అవార్డు: నెదర్లాండ్స్ – సాక్షి క్రీడా విభాగం -
ఫిఫా వరల్డ్‌కప్ హీరో.. ముందుగా భారత్‌లోనే మెరిశాడు!
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో స్పెయిన్ యువ సంచలనం లమీన్ యామల్ ఆది నుంచి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనతో జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు ఈ టీనేజర్.ముఖ్యంగా ఫ్రాన్స్‌తో సెమీ ఫైనల్లో కీలక సమయంలో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి.. అతి పిన్న వయసులోనే వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అయితే, అర్జెంటీనాతో ఫైనల్లో మాత్రం ఫెరాన్ టోరెస్ స్పెయిన్ హీరోగా అవతరించాడు.అదనపు సమయంలోని 106వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి గోల్ కొట్టి స్పెయిన్‌ను గెలిపించాడు టోరెస్. నికో విలియమ్స్ ఇచ్చిన హెడర్‌ను గోల్‌గా మలిచి అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లాడు. తద్వారా స్పెయిన్ వరల్డ్‌కప్ చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు.ఎవరీ టోరెస్?26 ఏళ్ల టోరెస్ బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో ఫార్వర్డ్ ప్లేయర్. స్పెయిన్‌లోని ఫెయెస్లో 2000, ఫిబ్రవరి 29న జన్మించాడు. ఆరేళ్ల వయసులోనే వాలెన్షియా అకాడమీలో చేరాడు. యూత్ జట్టు తరఫున రాణించి.. 2017లో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. వాలెన్షియా తరఫున2017- 2020 మధ్యలో 71 మ్యాచ్‌లలో ఆరు గోల్స్ సాధించాడు.మాంచెస్టర్ సిటీ తరఫున 2020-2022 మధ్య కాలంలో 28 మ్యాచ్‌లలో తొమ్మిది గోల్స్ కొట్టిన టోరెస్.. ప్రీమియర్ లీగ్, ఈఎఫ్ఎల్ కప్ గెలిచిన జట్టులు సభ్యుడు.ఇక ఆ తర్వాత అంటే 2021-22 సీజన్లో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్లో చేరాడు టోరెస్. లా లిగా, కోపా డెల్ రెయ్, సూపర్కోపా కప్పులు గెలిచాడు. ప్రస్తుతం పారిస్ సెయింట్ జర్మేన్ జట్టుకు ఆడుతున్నాడు.భారత్‌లోనే ముందుగా మెరిశాడుస్పెయిన్ అండర్-17 జట్టు తరఫున 2017లో భారత్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో టోరెస్ పాల్గొన్నాడు. స్పెయిన్ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించిన అతడు.. ఇంగ్లండ్‌తో టైటిల్ పోరులోనూ సత్తా చాటాడు.కోల్‌కతాలో ఇంగ్లండ్- స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగగా.. ఇంగ్లండ్ 5-2 గోల్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీంతో స్పెయిన్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ టోర్నీ గ్రూప్ దశలో స్పెయిన్ మూడు విజయాలు సాధించింది. అనంతరం నాకౌట్ దశలో ఫ్రాన్స్, మాలి జట్లపై గెలిచింది.ఈ ఈవెంట్లో టోరెస్ రెండు గోల్స్ కొట్టడంతో పాటు.. రెండు అసిస్ట్‌లు ఇచ్చి తన వంతు పాత్ర పోషించాడు. కాగా టోరెస్ స్పెయిన్ తరఫున 2020లో అరంగేట్రం చేశాడు. అండర్-17, 19, 21 స్థాయిల్లో ఆడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ముద్దుపేరు తెలుసా?ఇక లీప్ సంవత్సరంలో జన్మించిన టోరెస్ నాలుగేళ్లకోసారి తన పుట్టినరోజు జరుపుకొంటాడు. అతడి ముద్దుపేరు ‘ది షార్క్’. గోల్ కొట్టినపుడు అతడు షార్క్ ఫిన్ (షార్క్ వెనుక భాగంలో కనిపించే త్రికోణాకారపు రెక్క లాంటిది) సింబాలిక్‌గా సెలబ్రేట్ చేసుకోవడమే ఇందుకు కారణం. షార్క్ ఫిన్‌ను శక్తి, ప్రత్యేక గుర్తింపు, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తారు. నీటి మీద ఫిన్ కనిపిస్తే అది ప్రమాద సూచనగా భావిస్తారు. తన ముద్దుపేరు మీదుగా టోరెస్ ఓ క్లాత్ బ్రాండ్ కూడా తీసుకువచ్చినట్లు సమాచారం.చదవండి: గోల్డెన్ బూట్, గోల్డోన్ గ్లోవ్, గోల్డెన్ బాల్.. ప్రైజ్ మనీ ఉంటుందా?Spain 🤝 Mexico City #FIFAFanFestival #FIFAWorldCup pic.twitter.com/PxkGAyW6tC— FIFA World Cup (@FIFAWorldCup) July 20, 2026


