breaking news
Cotton Farming
-
పత్తి యంత్రం రెడీ
పత్తి తీయటంలో వ్యయప్రయాసలతో సతమతమవుతున్న రైతుల కష్టాలు గట్టెక్కే రోజులు వచ్చాయి. భోపాల్లోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (ఐసీఏఆర్ – సీఐఏఈ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి తీసే యంత్రాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల రైతులకు అంకితం చేశారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) సమాచారం ప్రకారం.. ప్రీ–క్లీనింగ్ సిస్టమ్తో కూడిన ఈ యంత్రాన్ని ట్రాక్టర్కు అమర్చి ఉపయోగించాలి. విత్తన పత్తిలో చెత్త 15% కంటే తక్కువగా ఉంటుంది. ఖరీదు రూ. 15 లక్షలు. దీంతో కిలో పత్తి తీత ఖర్చు రూ. 5కు తగ్గుతుంది. గంటకు 0.23 హెక్టారులో పత్తి తీసే సామర్థ్యం దీనికుంది. ఇప్పటి పద్ధతితో పోల్చితే 90% సమయం, 65% ఖర్చు ఆదా అవుతుంది. మంత్రి ‘ఎక్స్’లో ఇలా ట్వీట్ చేశారు.. ‘ఇప్పటివరకు చేతి వేళ్లతో పత్తిని తీస్తున్నారు. అందుకు చాలా సమయంతో పాటు అధిక శ్రమతో కూడిన పని. దాంతో రైతులకు ఖర్చు కూడా గణనీయంగా పెరిగింది. చాలా కాలంగా, రైతులు పత్తి తీసే ప్రక్రియను సులభతరం చేసే యంత్రం కావాలని అడుగుతున్నారు. నేడు వారి కోరిక నెరవేరింది. ఈ యంత్రం త్వరలో రైతులకు అందుబాటులోకి వస్తుంది. ఈ యంత్రంతో పత్తి తీసే పనిని నేను వ్యక్తిగతంగా పరిశీలించాను. సమయంతోపాటు ఖర్చులనూ తగ్గించడానికి, పత్తి సాగును మరింత లాభదాయకంగా మార్చడానికి ఇది సహాయపడుతుంది. అదే సమయంలో, చీడపీడలను తట్టుకుంటూ అధిక దిగుబడినివ్వగల కొత్త పత్తి రకాలను అభివృద్ధి చేస్తున్నాం..’ అని మంత్రి పేర్కొన్నారు. 2 వరుసల్లో వత్తుగా విత్తిన పత్తి మొక్కల (హెచ్డీపీఎస్) నుంచి సీజన్లో ఒకేసారి పత్తి తియ్యటానికి వీలుగా ఈ యంత్రాన్ని రూపొందించారు. -
పత్తి సాగులో నష్టం..రైతు బలవన్మరణం
పత్తి సాగులో నష్టం.. ఓ యువ రైతును బలి తీసుకుంది. గుంటూరు జిల్లా దుర్గి మండలానికి చెందిన జడ శ్రీనివాస్(27) నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవటంతో పత్తి ఎర్రబారి, ఎదుగుదల లోపించింది. దీంతో దిగుబడి రాలేదు. రూ. లక్ష కుపైగా ఉన్న అప్పును తీర్చేదారి కానరాక సోమవారం ఉదయం ఇంట్లోనే పురుగు మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. శ్రీనివాస్ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. అతనికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.


