breaking news
AHF
-
ప్రశ్నిస్తేనే సమాధానం.. లైంగిక ఆరోగ్యంపై యువత మాట్లాడాలి!
ప్రశ్నించినప్పుడే ఏ సమస్య అయినా వెలుగులోకి వస్తుంది. చర్చించినప్పుడే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. సమాజంలో జరిగే ప్రతి తప్పిదాన్ని ప్రశ్నించే యువత లైంగిక విషయాలపై చర్చించడానికి మొహమాటపడుతోంది. నేడు ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగా యువతలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్) – ఇండియా కేర్స్ గుర్తుచేస్తోంది.అనుకోని సంఘటనలు జరిగినప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నచ్చిన స్లోగన్లు, పోస్టర్లు పెట్టి రోడ్డు మీదకి వచ్చే యువత... కండోమ్, హెచ్ఐవీ, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (ఎస్టీఐ), వంటి అంశాలపై మాట్లాడటానికి సంకోచిస్తోంది. అవగాహన లేకపోవడం వల్లే అపోహలు బలపడతాయి. సెప్టెంబర్ 4న ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా యువతలో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెంచాల్సిన అవసరాన్ని ఎయిడ్స్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ (ఏహెచ్ఎఫ్)–ఇండియా కేర్స్ గుర్తుచేస్తోంది.ఈ ఏడాది ప్రపంచ లైంగిక ఆరోగ్య దినోత్సవం థీమ్ ‘ఎవ్రీ బాడీ’. లైంగిక ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడం మాత్రమే కాదని వ్యక్తి ఆరోగ్యం, గౌరవం, హక్కులు, సమ్మతి, సంబంధాలు, మానసిక శ్రేయస్సుతో ముడిపడిన అంశమని ప్రపంచ లైంగిక ఆరోగ్య సంఘం తెలిపింది.స్మార్ట్‌ఫోన్‌తో...యువతను చేరుకోవడానికి భారత్‌కు ఉన్న అతిపెద్ద అవకాశాల్లో డిజిటల్ ప్రపంచం ఒకటి. యువతలో 97.1 శాతం మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. 94.3 శాతం మంది ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. హెఐవీ పరీక్షలు, ఎస్టీఐలు, కండోమ్ వినియోగం, గర్భనిరోధక పద్ధతులపై శాస్త్రీయమైన, సులభమైన, సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా యువతకు చేరవేయాల్సిన అవసరం ఉందని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ సూచిస్తోంది.యువత ఆరోగ్యమే కీలకంభారత్లో సుమారు 65 శాతం జనాభా 35 ఏళ్లలోపు వారే. 15–29 ఏళ్ల వారు దాదాపు 27 శాతం ఉన్నారు. ఇంత పెద్ద యువ జనాభా ఉన్న దేశంలో లైంగికత, పునరుత్పత్తి ఆరోగ్యంపై వారికి సరైన అవగాహన కల్పించడం అత్యంత కీలకం. లైంగిక ఆరోగ్యం కేవలం వైద్య అంశం కాదని.. దేశ భవిష్యత్తుతో ముడిపడిన ప్రజారోగ్య అంశమని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ చెబుతోంది.పీర్ ఎడ్యుకేషన్‌తో...ఆరోగ్య సమస్యలపై యువత తమ వయసువారితో మాట్లాడేందుకు ఎక్కువగా సౌకర్యంగా ఉంటారు. అందుకే పీర్ ఆధారిత అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ‘ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?’ అనే ప్రశ్నను ఒక యువకుడు వైద్యుడిని అడగడానికి సంకోచించినా, తనలాంటి మరో యువకుడిని అడగడానికి అంతగా వెనుకాడకపోవచ్చు. అందుకే పీర్ ఎడ్యుకేటర్లు ఆరోగ్య వ్యవస్థకు, యువతకు మధ్య వారధులుగా నిలవగలరని ఏహెచ్ఎఫ్–ఇండియా కేర్స్ భావిస్తోంది.– చైతన్య వంపుగాని, సాక్షి, న్యూదిల్లీ.ఇవి కూడా చదవండి: సీరియల్‌గా వద్దు రియల్‌గా ఉందాం -
ఉచితంగా కండోమ్స్ హోమ్ డెలివరీ..
అత్యవసర సమయాల్లో సైతం మెడికల్ షాప్స్‌లో కండోమ్ కొనడానికి చాలామంది సిగ్గుపడతారు.. తద్వారా జరిగే పొరపాటుకు నిండు జీవితాన్ని కోల్పోతారు! ఇకపై అలాంటి అవాంఛిత మరణాలు ఉండకూడదనే లక్ష్యంతో.. ప్రపంచంలోనే మొట్టమొదటిదిగా ఉచిత కండోమ్ స్టోర్ ఇండియాలో ప్రారంభమైంది. ఎయిడ్స్ హెల్త్ కేర్ ఫౌండేషన్(ఏహెచ్ఎఫ్) అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించిన ఈ స్టోర్స్ ద్వారా ఉచితంగా కండొమ్స్ పొందొచ్చు. దేశంలోని అన్ని ముఖ్యనగరాల్లో ఉచితంగానే హోమ్ డెలివరీ ఇస్తామని, సంబంధిత టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం లేదా మెయిల్ చేయడం ద్వారా కావాల్సిన చోటికే కండోమ్స్ తెప్పించుకోవచ్చని సంస్థ ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. రెండు దశాబ్ధాల నాన్చివేత అనంతరం ఇటీవలే హెచ్ఐవీ, ఎయిడ్స్(నివారణ, నియంత్రణ) బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఉచిత కండోమ్ స్టోర్.. మహమ్మారి నియంత్రణకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని ఏహెచ్ఎఫ్ అభిప్రాయపడింది. దాదాపు 21 లక్షల మంది హెచ్ఐవీ బాధిలున్న ఇండియా.. ప్రపంచంలోనే ఎయిడ్స బాధిత దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. కండోమ్ వినియోగంపై ఉన్న బిడియాల కారణంగా ఏటా కొన్ని వేల మంది భారతీయులు ఎయిడ్స బారినపడుతున్నారు. జాతీయ ఎయిడ్స్ నిర్మూలనా కార్యక్రమం (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ మిషన్) ద్వారా నగరాలు, పట్టణాల్లో ఉచితంగా కండోమ్‌ల పంపిణీ చేపట్టినప్పటికీ.. అవి నాసిరకంగా ఉండటం, అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ప్రజల్లో వాటి వినియోగం పట్ల నిర్లిప్తత ఏర్పడింది. ఈ సవాళ్లన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తాము.. నాణ్యమైన కండోమ్‌లు అందించేందుకు ఉద్యుక్తులయ్యామని, టోల్ ఫ్రీ నంబర్1800 102 8102 లేదా freecondomstoreahf@gmail.com. ద్వారా ఉచిత కండోమ్స్ పొందొచ్చని ఏహెచ్ఎఫ్ తెలిపింది. (గమనిక: ప్రస్తుతానికి సదరు టోల్ ఫ్రీ నంబర్ సరిగా పనిచేయడంలేదు)


