పూర్ణిమ తల్లిదండ్రులకు చేదు అనుభవం

పూర్ణిమ తల్లిదండ్రులకు చేదు అనుభవం


- అమ్మానాన్నను చూడను.. వారి వద్దకు వెళ్లను

- వారు బాగుండాలన్నదే నా కోరిక: పూర్ణిమ సాయి

- తల్లిదండ్రులతో ఉంటే వారికి చెడు జరుగుతుందని ‘కల’వరపాటు

- కూతురును కలవకుండానే హైదరాబాద్‌కు చేరుకున్న తల్లిదండ్రులు

- నేడు పూర్ణిమను నగరానికి తీసుకురానున్న సైబరాబాద్‌ మహిళా పోలీసులు


 

సాక్షి, హైదరాబాద్‌/ముంబై:
‘‘నా తల్లిదండ్రులు బాగుండాలి. వారికి ఏమైనా జరిగితే తట్టుకోలేను. ఏడాది పాటు నా వారికి దూరంగా ఉంటే ఇబ్బందులు తప్పుతాయని కలలో దేవుడు చెప్పిన మాటలు నా చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉన్నాయి’’నగరంలో అదృశ్యమై ముంబైలో ఆచూకీ లభించిన పూర్ణిమ సాయి చెపుతున్న మాటలివీ. అమ్మానాన్నలను కలవడం కాదు కదా కనీసం చూసేందుకు కూడా ఆమె ఇష్టపడటంలేదు. దీంతో తల్లిదండ్రులు నాగరాజు, విజయకు మారి పూర్ణిమను కలవకుండానే ముంబై నుంచి సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ సభ్యులు, మానసిక నిపుణులు పూర్ణిమకు ఎంత చెప్పినా తల్లిదండ్రులతో వచ్చేందుకు ఆమె ఇష్టపడలేదు. దీంతో పూర్ణిమను హైదరాబాద్‌ తీసుకొచ్చేందుకు సైబరాబాద్‌ మహిళా పోలీసు లు ముంబై చేరుకున్నారు. మంగళవారం సాయంత్రానికి ఆమెను హైదరాబాద్‌ తీసుకు రానున్నారు. జూన్‌ 7న నమోదైన మిస్సింగ్‌ కేసును కిడ్నాప్‌ కేసుగా మలచడంతో ఆ కేసు విషయంలో ఆమెను రంగారెడ్డి జిల్లాలోని జువెనైల్‌ కోర్టు ముందు హాజరుపరచను న్నారు. ఆ తర్వాత పూర్ణిమ ఇష్టపకారం తల్లిదండ్రుల వద్దకు వెళతానంటే పంపుతారు. లేదంటే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించి ఏదైనా హోంలో ఉంచే అవకాశం ఉంది.

 

‘కల’ కదిలించింది..

జూన్‌ 7న అంటే మిస్సింగ్‌కు రెండు రోజుల ముందు వచ్చిన కల పూర్ణిమను ఆగమాగం చేసింది. 5వ తేదీ తెల్లవారుజామున కలలో సాయిబాబా వచ్చి ‘నువ్వు మీ తల్లిదండ్రులతో ఉంటే వారికి ప్రాణహాని ఉంది. చెడు జరుగుతుంది. నా దగ్గరకు వచ్చేయి. లేదంటే నీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవు. ఎవరికీ తెలియని ప్రదేశానికి రా’అంటూ వచ్చిన కల ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే రోజు పూర్ణిమ అమ్మకు కడుపునొప్పి రావడంతో దానిని చెడుకు తొలి సంకేతంగా భావించింది. మరుసటి రోజు చెల్లెలు తీవ్రమైన దగ్గుబారిన పడటంతో కుటుంబంలో ఇబ్బందులు మొదలయ్యాయని అనుకుంది. దీంతో జూన్‌ 7న ఉదయం ఇంట్లో రూ.వెయ్యి తీసుకుని స్కూల్‌కు వెళుతున్నానని చెప్పి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చి షిర్డీ వెళ్లే రైలు ఎక్కింది.జూన్‌ 8న షిర్డీ సాయి దర్శనం చేసుకుని తల్లిదండ్రులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావొద్దని ప్రార్థించి.. జూన్‌ 9న ముంబైలోని దాదర్‌ రైల్వేస్టేషన్‌ చేరుకుంది. అక్కడికి కిలోమీటర్‌ దూరంలో ఉన్న బోయివాడ పోలీసుల వద్దకు వెళ్లిన పూర్ణిమ.. తన అసలుపేరు, ఊరు, తల్లిదండ్రుల పేరు చెబితే వారిని పిలిపించి తనను పంపిస్తారన్న భయంతో తాను అనాథనని అబద్ధం చెప్పింది. తన పేరు అనికశ్రీ అని, తల్లిదండ్రులు లేరని సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్‌లోని సాయిశ్రీ ఆశ్రమం నుంచి వచ్చానంటూ వివరించింది. పోలీసులు ఆమెను డొంగ్రీలోని బాలసుదర్‌ గృహ్‌కు తరలించారు. సికింద్రాబాద్‌ సమీపంలోని ఠాణాలకు అనికశ్రీ పేరుతో ఎవరైనా తప్పిపోయారన్న కేసు నమోదైందా అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ పేరుతో అదృశ్యమైన కేసు నమోదు కాలేదని తెలియడంతో బోయివాడ పోలీసులు ఊరకుండిపోయారు.

 

తల్లిదండ్రులను కలిసేందుకు ససేమిరా..

ఇటీవల పూర్ణిమ తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి బాలల హక్కుల సంఘం ప్రతినిధులతో కలసి తమ పాప ఆచూకీ ఉంటే చెప్పండి అంటూ మీడియాతో మొరపెట్టుకున్నారు. ఆ వార్త ఫొటోలతో పాటు ప్రచురితం కావడంతో తుకారాం గేట్‌ ఇన్‌స్పెక్టర్‌ ముంబై పోలీసుల నుంచి తనకు వాట్సాప్‌లో వచ్చిన ‘అనికశ్రీ ఫొటో’కు పత్రికలో వచ్చిన ఫొటోకు దగ్గర పోలికలు ఉండటంతో ఆ ఫొటోను బాచుపల్లి ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణరెడ్డికి పంపారు. ఆదివారం వారు తల్లిదండ్రులను పిలిపించి ఫొటోను చూపగా.. అందులో ఉన్నది తమ అమ్మాయేనని ధ్రువీకరించారు. సోమవారం పోలీసులతో కలసి తల్లిదండ్రులు నాగరాజు, విజయకుమారి ముంబై వెళ్లగా.. వారిని కలిస్తే ఏమవుతుందోనన్న భయంతో పూర్ణిమ తల్లిదండ్రులను చూసేందుకు, కలిచేందుకు ససేమిరా అంది. మానసిక నిపుణులు కూడా ఆమె ఇష్ట్రపకారం మీరు కలవకండి అని చెప్పారని ముంబైకి వెళ్లిన బాచుపల్లి ఎస్సై శంకర్‌ ‘సాక్షి’కి తెలిపారు.

 

‘అనికశ్రీ’ పేరు వెనక కథ ఇదే..

స్టార్‌ప్లస్‌ టీవీ చానల్‌లో ప్రసారమయ్యే ఇష్క్‌బాజ్‌ సీరియల్‌ను పూర్ణిమ చూసేది. ఆ సీరియల్స్‌లో అనికశ్రీ పాత్రను ప్రముఖ సీరియల్‌ నటి సురభి చందన పోషిస్తోంది. ఆ పాత్రకు మంత్రముగ్ధురాలైన పూర్ణిమ ఏకంగా ఆ నటితో ఇన్‌స్ట్రాగామ్‌లో చాట్‌ చేసిన సందర్భాలు ఉన్నాయి. పూర్ణిమ అని చెబితే పోలీసులకు దొరికిపోయే అవకాశం ఉండటంతో తనకు ఇష్టమైన అనికశ్రీ పేరు చెప్పినట్టు తెలుస్తోంది. పూర్ణిమకు నటనపై ఉన్న మక్కువతోనే ముంబైకి వచ్చి ఉంటుందని, చివరకు ఆ సీరియల్‌లో పాత్ర పేరు ‘అనిక శ్రీ’నే తన పేరుగా బోయివాడ పోలీసులకు చెప్పడం దీన్ని స్పష్టం చేస్తోందని పోలీసులు చెపుతున్నారు.

సంబంధిత వీడియోలు

Back to Top