11న ‘గ్రేటర్’ తొలి సర్వసభ్య సమావేశం | on 11th Greater First General Metting | Sakshi
Sakshi News home page

11న ‘గ్రేటర్’ తొలి సర్వసభ్య సమావేశం

Jan 29 2016 3:19 AM | Updated on Oct 5 2018 9:09 PM

11న ‘గ్రేటర్’ తొలి సర్వసభ్య సమావేశం - Sakshi

11న ‘గ్రేటర్’ తొలి సర్వసభ్య సమావేశం

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది.

* అదేరోజున గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక
* ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనలు
* ఫిబ్రవరి 3న ఎన్నికల సిబ్బందికి ఆన్‌డ్యూటీ సౌకర్యం
* గ్రేటర్ ఎన్నికల బ్యాలెట్లో ‘నోటా’ లేనట్లే

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ తొలి సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది. అదే రోజున ‘గ్రేటర్’ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 2న జరగనుండగా 5వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

ఆ తర్వాత 11వ తేదీన తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాలని పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ నుంచి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. వాటిని ఆమోదిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇక ‘గ్రేటర్’ ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఆ మరుసటి రోజు న సెలవు ప్రకటించాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది ఆ మరుసటి రోజు విధులకు హాజరుకాకపోయినా ‘ఆన్ డ్యూటీ (ఓడీ)’గా పరిగణించనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో జారీ కానున్నాయి.
 
నోటాకు నో..!
ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ నచ్చకపోతే.. అభ్యర్థులందరినీ తిరస్కరించేందుకు జీహెచ్‌ఎంసీ ఓటర్లకు ‘నోటా (పైవారెవరూ కాదు)’ అవకాశం లేనట్లే! నోటా అమలుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరుతూ లేఖ రాసింది. దీనిపై సాంకేతిక కారణాలతో ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ‘నోటా’ అమలు సాధ్యం కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. దీంతో నోటా అమలు లేనట్లేనని అధికారవర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement