Sakshi News home page

‘ఎంతపన్జేస్తివి కొడుకా..’

Published Fri, Jul 3 2015 2:31 AM

‘ఎంతపన్జేస్తివి కొడుకా..’ - Sakshi

♦ తల్లిదండ్రులు మందలించారని యువకుడి బలవన్మరణం  
♦ ఏకైక కుమారుడి మృతితో కన్నీటిపర్యంతమైన కన్నవారు
♦ జవహర్‌నగర్ ఎన్టీఆర్‌నగర్‌లో విషాదం
 
 జవహర్‌నగర్ : ‘పని చేసుకుని ప్రయోజకుడివి అవుతావనుకున్నం.. ఇంత పని చేస్తావనుకోలేదురా.. తండ్రి.. ఉన్న ఒక్కకొడుకువు సచ్చిపోతివి.. మేమెవరి కోసం బతకాలి.. ఎందుకు బతకాలిరా.. నాయినా..’ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కన్నవారు మందలించడంతో క్షణికావేశానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషాదకర సంఘటన స్థానిక అంబేద్కర్‌నగర్‌లోని ఎన్టీఆర్‌నగర్‌లో చోటుచేసుకుంది.

ఎస్‌ఐ అంజయ్య, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పరిధిలోని పోతప్పగూడకు చెందిన మోనార్ రవీంద్రరావు, మీరాబాయి దంపతులకు ఓ కూతురు, కుమారుడు మొనార్ సతీష్(26) ఉన్నారు. బతుకుదెరువు కోసం 15 సంవత్సరాల క్రితం జవహర్‌నగర్‌కు వలస వచ్చారు. రవీంద్రరావు చర్లపల్లిలోని ఓ కంపెనీలో లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కూతురు వివాహం కాగా కుమారుడు సతీష్ ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు.

2005 సంవత్సరంలో ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన అతడు తిరిగి 2012లో ఇంటికి తిరిగి వచ్చాడు. కొద్దిరోజులు బాగానే ఉన్న సతీష్ ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. పద్ధతి మార్చుకుని ప్రయోజకుడివి కావాలని తల్లిదండ్రులు అతడిని బుధవారం ఉదయం మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు సతీష్. క్షణికావేశానికి గురైన అతడు బుధవారం రాత్రి ఇంట్లో తన గదిలో ఫ్యాన్ రాడ్డుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున తల్లిదండ్రులు సతీష్‌ను పిలవగా స్పందనలేదు. తలుపులు విరగ్గొట్టి చూడగా అప్పటికే ఉరివేసుకుని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు.

ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో సతీష్ తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించారు. ‘ప్రయోజకుడివి అవుతావనుకున్నం తండ్రి.. ఎంతపన్జేస్తివి కొడుకా.. ఇక మాకెవరు దిక్కు.. మేమెవరి కోసం బతకాలి’ అంటూ రవీంద్రరావు దంపతులు రోదించిన తీరుకు కాలనీవాసులు కంటతడి పెట్టుకున్నారు. యువకుడి ఆత్మహత్య సమాచారం అందుకున్న ఎస్‌ఐ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement