‘మున్సిపోల్స్‌’పై సీరియస్‌

TPCC Core Committee Has Decided To Take Municipal Elections Seriously - Sakshi

టీపీసీసీ కోర్‌ కమిటీ భేటీలో నిర్ణయం 

‘పౌరసత్వ సవరణ’కు వ్యతిరేకంగా మున్సిపాలిటీల్లో నిరసనలు

సాక్షి, హైదరాబాద్‌: త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న మున్సిపల్‌ ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని టీపీసీసీ కోర్‌ కమిటీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో 50 శాతానికిపైగా పురపాలక చైర్మన్లు, కౌన్సిలర్ల స్థానాలు దక్కించుకోవాలని, అందుకు అనుగుణంగా పార్టీ్ట నాయకత్వం సమష్టిగా కృషి చేయాలని నిర్ణయించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం గాంధీభవన్‌లో కోర్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్‌ చార్జి ఆర్‌సీ కుంతియా, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుసుమకుమార్, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, శశిధర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌ కృష్ణన్, చిన్నారెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

సమావేశంలో భాగంగా మున్సిపల్‌ ఎన్నికలు, పౌరసత్వ చట్ట సవరణ బిల్లు తదితర అంశాలపై చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను రాజకీయంగా సద్వినియోగం చేసుకుని వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో పాగా వేయాలని నిర్ణయించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై చర్చించారు. కాగా, సమావేశానికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచందర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ తదితర నేతలు గైర్హాజరు కావడం గమనార్హం. 

నేటి నుంచి 27 వరకు నిరసన ప్రదర్శనలు 
పౌరసత్వ సవరణ చట్టంపై సామాన్యులు ఆందోళన చెందుతున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సమావేశం అనంతరం విలేకరులతో ఉత్తమ్‌ మాట్లాడుతూ, సవరణ చట్టంపై నేటి నుంచి 27 వరకు మున్సిపాలిటీల్లో నిరసన ప్రదర్శనలు చేపడతామని, 28న కాంగ్రెస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించి సేవ్‌ ఇండియా, సేవ్‌ రాజ్యాంగం పేరుతో ర్యాలీ నిర్వహిస్తామన్నారు. 

నేను పొన్నాల లక్ష్మయ్యను.. 
విలేకరుల సమావేశంలో పాల్గొన్న నేతల పేర్లు చెప్పిన సందర్భంలో ఉత్తమ్‌ తన పేరు ప్రస్తావించకపోవడంతో పొన్నాల లక్ష్మయ్య మైక్‌ అందుకున్నారు. ‘నేను పొన్నాల లక్ష్మయ్యను, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడిని’అంటూ ప్రకటించారు. దీంతో షాక్‌ అయిన ఉత్తమ్‌ ‘అన్నా నేను మీ పేరు చెప్పలేదా.. సారీ’అని అన్నారు. దీనికి పొన్నాల స్పందిస్తూ ‘కాంగ్రెస్‌ పార్టీలో ఎవరి పేర్లు వారే చెప్పకోవాలి కదా’అంటూ చలోక్తి విసిరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top