‘ఓటుకు కోట్లు’లో ఈడీ ఎంట్రీ!

The quotas for the sensational vote made the case a turning point - Sakshi

రూ. 50 లక్షల సంగతి తేల్చేందుకు రంగంలోకి

మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి నోటీసులు

వారం లోపల తమ ఎదుట హాజరుకావాలని ఆదేశం

కేసులోని ఇతర నిందితులకు తాఖీదు యోచనలో ఈడీ

సాక్షి, హైదరాబాద్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసు కీలక మలుపు తిరిగింది. దాదాపు మూడున్నరేళ్ల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర పన్నిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణ మొదలుపెట్టింది. దీంతో మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న కేసులో ఈడీ ఎంట్రీతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నట్లు తెలుస్తోంది. 

ఆ రూ. 50 లక్షలు తేల్చండి...
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఇవ్వజూపిన రూ.50 లక్షల వ్యవహారాన్ని తేల్చాలని గతంలోనే దర్యాప్తు విభాగమైన అవినీతి నిరోధక శాఖ ఈడీకి లేఖ రాసింది. దీంతో తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ఈసీఐఆర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌)నమోదు చేసిం ది. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి స్టీఫెన్‌సన్‌కు ఇచ్చేందుకు యత్నించిన రూ.50 లక్షలు ఎక్కడివో చెప్పాలంటూ ఎమ్మెల్సీగా పోటీ చేసిన వేం నరేందర్‌రెడ్డికి శుక్రవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. గచ్చిబౌలి రోలింగ్స్‌ హిల్స్‌లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు ఈ నోటీసులు అందించారు. కేసుకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. వారం రోజుల్లోపల బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని అధికారులు నరేందర్‌రెడ్డికి స్పష్టం చేసినట్లు తెలిసింది. 

వాళ్లకి కూడా...
ఓటుకు కోట్లు కేసులో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహా, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఇప్పటికే వీరంతా అరెస్టయి బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే వేం నరేందర్‌రెడ్డికి మాత్రం ఈడీ నోటీసులు జారీ చేయగా, మిగిలిన వాళ్లకి సైతం ఈడీ నోటీసులు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే చార్జిషీట్‌తో పాటు సప్లిమెంటరీ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులను ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ ద్వారా నిర్ధారణ టెస్టులు చేయించారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది చంద్రబాబే అని ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్లలోనూ అనేకసార్లు పేర్కొంది. తాజాగా ఈడీ ఎంట్రీతో మరోసారి ఓటుకు కోట్లు కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడు, సూత్రధారిగా ఉన్న చంద్రబాబు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

బాబు పేరు తప్పదు...
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగడంతో చంద్రబాబు వ్యవహారం మరిన్ని ఆధారాలతో తేలబోతోందని ఏసీబీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ రూ.50 లక్షలు వైట్‌ మనీనా.. లేకా నల్లధనమా.. అన్న విషయంలో ఈడీ విచారణ జరుపనుందన్నారు. ఈడీ విచారణ పూర్తి చేయగానే అసలు సూత్రధారి అయిన బాబుపై కూడా మరో సప్లిమెంట్‌ చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఏసీబీలోని కీలక అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top