వెన్నుపోటు నైజం బాబుదే: హరీశ్‌రావు | Sakshi
Sakshi News home page

వెన్నుపోటు నైజం బాబుదే: హరీశ్‌రావు

Published Thu, Nov 13 2014 2:28 AM

వెన్నుపోటు నైజం బాబుదే: హరీశ్‌రావు

* ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసిన నికృష్టుడు: హరీశ్‌రావు
* కేసీఆర్ నా కన్నతండ్రిలాంటి వారు
* ఈ పదవి, హోదా కేసీఆర్ పెట్టిన భిక్ష
* రేవంత్.. ఇకనైనా తప్పుడు మాటలు మానుకో
* కేసీఆర్‌పై అక్కసుతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శ

 
 సాక్షి, హైదరాబాద్: పదవులను, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని.. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి, చావుకు కారణమైన నికృష్టుడు చంద్రబాబు అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పచ్చకామెర్లు వస్తే లోకమంతా పచ్చగా కనిపించినట్టుగా... వెన్నుపోటు, గోబెల్స్ పునాదుల మీద పుట్టి, బతుకుతున్న టీడీపీ నేతలకు అందరూ వెన్నుపోటుదారులుగానే కనిపిస్తున్నారని విమర్శించారు. ‘‘కేసీఆర్ నాకు వేలు విడిచిన మేనమామ కాదు.. వేలు పట్టుకుని నడిపించిన కన్నతండ్రి లాంటివారు. ఈ పదవి, హోదా, రాజకీయ జీవి తం అన్నీ కేసీఆర్ పెట్టిన భిక్ష. అలాంటి నాయకుడికి వెన్నుపోటని కలలో కూడా కలలు కనొద్దు. వెన్నుపోటు పొడుస్తానంటూ ఎవరు మాట్లాడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..’’ అని ఆయన హెచ్చరించారు.
 
 బుధవారం అసెంబ్లీ లాబీల్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడు తూ... టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా కొద్ది సమయంలోనే కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణకు బాటలు పడుతున్నయి. అన్ని వర్గాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. సమగ్ర సర్వే విజయవంతమైంది. టీడీపీ-బీజేపీ ఒక్కటైనా మెదక్ ఉప ఎన్నికలో చావుతప్పి కన్నులొట్టబోయినట్టు వారికి డిపాజిట్లు వచ్చినయి. ప్రభుత్వానికి, కేసీఆర్‌కు వస్తున్న మంచిపేరును జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారు. సీమాంధ్ర ప్రభుత్వానికి ఏజెంట్లుగా మారిన రేవంత్‌రెడ్డి లాంటి నేతలు పావులుగా పనిచేస్తున్నరు. రేవం త్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా..’’ అని హరీశ్ పేర్కొన్నారు.
 
 అబద్ధాలు, అసత్యాలు, వెన్నుపోట్లు, గోబెల్స్ ప్రచారంతోనే టీడీపీ బతుకుతున్నదని... త్యాగాల పునాదుల మీద పుట్టిన టీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై అక్కసుతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ అసమర్థుల, తెలంగాణ ద్రోహుల చేతుల్లోకి పోవద్దనే ప్రజలు కేసీఆర్‌కు అధికారమిచ్చారని హరీశ్ పేర్కొన్నారు. ‘‘మేం త్యాగాలకు తప్ప వెన్నుపోట్లకు సిద్ధపడం. పదవులను, పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన చరిత్ర బాబుది. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గురిచేసి, చావుకు కారణమైన నికృష్టుడు చంద్రబాబు. కొడుకు లోకేష్‌కు ఎక్కడ పోటీ వస్తాడోనని జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాలకు దూరం చేసిన దుర్మార్గుడు. అలాంటి పార్టీకి రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఉప నాయకుడిగా ఉన్నా రు. ఆ పార్టీ సీమాంధ్ర నాయకుల మెప్పు పొం దడానికి కావాలంటే వాళ్ల కాళ్లు పట్టుకో. అంతేగాని అవాస్తవాలు, గోబెల్స్ ప్రచారం వద్దు. గతంలో ఇలా మాట్లాడితే నవ్వుకున్నా. ప్రజలకు తప్పుడు సమాచారం పోవద్దని ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇకనైనా ఇలాంటి మాటలు మా నుకో..’’ అని రేవంత్‌ను హరీశ్  హెచ్చరించారు.

Advertisement
Advertisement