ఆరంభమా.... ముగింపా !

ఆరంభమా.... ముగింపా ! - Sakshi


టి20లకే యువరాజ్ పరిమితం

వన్డేల్లో దక్కని అవకాశం

‘గౌరవ వీడ్కోలు’గా సందేహాలు

విఫలమైతే కెరీర్ ముగిసినట్లే


 

 ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన తర్వాత... ‘నిజాయితీగా చెప్పాలంటే టి20లకు మాత్రమే ఎంపికై, వన్డేల్లో చోటు దక్కకపోవడం కాస్త నిరాశగా ఉంది’ అంటూ యువరాజ్ సింగ్ స్పందించడం ఆశ్చర్యపరచింది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భారత జట్టుకు మళ్లీ ఆడబోతున్నానన్న సంతోషం కంటే వన్డేల్లో అవకాశం దక్కకపోవటంపై అసంతృప్తి కనిపించింది.  

 

 విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా ఆడటం వల్లే యువరాజ్‌కు మళ్లీ పిలుపు లభించిందనుకుంటే... నిజానికి అతడు వన్డేలకు ఎంపిక కావాల్సింది. కానీ కేవలం టి20లతోనే సరిపెట్టారు. ఐపీఎల్ ఆటతో నెహ్రాను టి20లకు ఎంపిక చేశామన్న సెలక్టర్ల నిర్ణయం సరైనదైతే... మరి ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన యువరాజ్ టి20లకు ఒక్కసారిగా ఎలా అర్హత సాధించాడు.

 

 గత టి20 ప్రపంచకప్ ఫైనల్‌తో ఒక్కసారిగా విలన్‌గా మారిన యువీ ఇప్పుడు మళ్లీ హీరో అయ్యేందుకు

 మరో అవకాశం ఇచ్చారా.. .లేక గౌరవంగా సాగనంపేందుకు చివరి అవకాశం ఇస్తున్నారా!


 

 (సాక్షి క్రీడా విభాగం)

 యువరాజ్ సింగ్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో 11 ఇన్నింగ్స్‌లో ఒకే సెంచరీతో 398 (సగటు 36.18) పరుగులు చేశాడు. పరుగులపరంగా ఇదేమీ పెద్ద ఘనత కాదు. టి20లకు సంబంధించి ఆఖరి సారి ఆడిన 2015 ఐపీఎల్‌లో 13 ఇన్నింగ్స్‌లో 248 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇచ్చిన రూ. 16 కోట్ల విలువకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయాడు. ఇక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం అతను ఆకట్టుకున్నాడు.

 

  పునరాగమనానికి దీనిని మంచి అవకాశంగా భావించిన అతను పట్టుదలతో ఆడినట్లు కనిపించింది. టోర్నీలో 5 ఇన్నింగ్స్‌లో 85.25 సగటుతో 341 పరుగులు చేశాడు. స్కోర్లకంటే అతను ఆడిన తీరు, పరిస్థితులకు తగినట్లుగా వన్డే ఇన్నింగ్స్‌ను మలచిన విధానం పాత యువరాజ్‌ను గుర్తుకు తెచ్చాయి.  సరిగ్గా ఇదే ఆలోచనతో యువరాజ్ కూడా వన్డే అవకాశం కోసం ఎదురు చూసి ఉంటాడు. కానీ అనూహ్యంగా సెలక్టర్లు ఏదో కొత్త కుర్రాడికి తొలి అవకాశం ఇస్తున్నట్లుగా అతడిని టి20లతో సరిపెట్టారు.

 

 రైనాను తప్పించినా...

 విజయ్ హజారేలో యువరాజ్ ఆట చూస్తే ఇప్పుడు వన్డేలకు సరిగ్గా సరిపోతుంది. దక్షిణాఫ్రికాతో, అంతకు ముందు బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఓటమి అనంతరం సెలక్టర్లు జట్టును మార్చాలని గట్టిగా కోరుకుంటే ఇందులో సరిగ్గా ఇమిడిపోయే స్థానం యువరాజ్‌ది. సుదీర్ఘ కాలంగా రెగ్యులర్ సభ్యుడిగా ఉన్న సురేశ్ రైనాపై వేటు వేస్తే... అతనికి ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ హ్యండ్ బ్యాటింగ్‌తో పాటు పార్ట్‌టైమ్ బౌలింగ్ చేయగల యువీకి అవకాశం ఇవ్వాల్సింది.

 

 కానీ సందీప్ పాటిల్ బృందం ఇదంతా పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. ఆసీస్ పర్యటనకు జట్టు ఎంపిక చేయడానికి సరిగ్గా ఒక రోజు ముందు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘యువరాజ్ బాగా ఆడుతున్న మాట వాస్తవమే. అయితే ఆస్ట్రేలియాలో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌కు అతడిని ఎంపిక చేయలేదంటే ఇప్పుడు అదే గడ్డపై జరిగే మరో వన్డే సిరీస్‌కు అతనికి స్థానం ఇస్తారని అనుకోను’ అని వ్యాఖ్యానించడం చివరకు నిజమైంది.

 

 చెలరేగిపోగలడా..?

 టి20ల్లో యువరాజ్ అనగానే అందరికీ 2007 ప్రపంచకప్‌లో ఆరు సిక్సర్లే గుర్తుకు వస్తాయి. అయితే ఆ తొలి టోర్నీ విజయంలో భాగమైన తర్వాత ఒకట్రెండు మ్యాచ్‌లలో మినహా భారత్ తరఫున యువీ ఆ స్థాయిలో మెరుపులు చూపించలేకపోయాడు. ఐపీఎల్‌లో సహచర భారత క్రికెటర్లతో పోలిస్తే అతని రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. నిజానికి యువీ చిరస్మరణీయ విజయాలు అందించింది, అతనికి స్టార్‌గా గుర్తింపు దక్కింది వన్డేలతోనే. కీలక సమయంలో బరిలోకి దిగి ఆరంభంలో నిలదొక్కుకొని ఆ తర్వాత చివర్లో ధాటిగా ఆడే బ్యాటింగ్ శైలి అతనిది.

 

  టి20ల్లో చివర్లో ఎన్ని బంతులు ఆడేందుకు అవకాశం వస్తుందో చెప్పలేం. తొలి బంతినుంచే షాట్లు ఆడే క్రమంలో వైఫల్యానికి అవకాశం కూడా ఎక్కువ. ఈ భయం యువీకి కూడా ఉంది. ‘ఆస్ట్రేలియాలో పరిస్థితులు కఠినంగా ఉంటాయి. టి20ల్లో కనీసం నిలదొక్కుకోవడానికి కూడా సమయం ఉండదు. ఈ ఫార్మాట్‌లో ఆడటం అంత సులువు కాదు. పునరాగమన సమయంలో ఇది మరీ ఇబ్బందికరం’ అని అతను వ్యాఖ్యానించాడు.

 

 విమర్శలు రాకూడదనే

 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ ‘నన్ను తప్పిస్తారని సెలక్టర్లు కాస్త ముందుగా చెప్పి ఉంటే నా చివరి మ్యాచ్ ఢిల్లీలో ఆడి గౌరవంగా రిటైర్ అయ్యేవాడిని. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు’ అంటూ బహిరంగంగానే విమర్శించాడు. భారత క్రికెట్‌కు సంబంధించి వీరూ స్థాయి ఆటగాడే యువీ కూడా. జట్టుకు దూరంగా ఉంచి సాగదీయడంకన్నా ఒక అవకాశం ఇస్తే పోలా... అనే ధోరణిలో సెలక్టర్లు కనిపించారు.

 

  జట్టు ఎంపిక తర్వాత ఎవరూ అడక్కుండానే ‘యువీ తిరిగి రావడం మా కెప్టెన్‌కు చాలా సంతోషం కలిగించింది’ అని పాటిల్ వ్యాఖ్యానించారు. గతంలో ఎప్పుడు యువరాజ్‌ను తప్పించినా ధోనినే అందుకు కారణమన్నట్లు విమర్శలు వచ్చేవి. ఇప్పుడు ధోని ఉండగానే యువరాజ్‌కు అవకాశం కల్పించడం అంటే  పనిలో పనిగా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టినట్లే. టి20ల్లో అనుభవం అవసరం...అంటూ సెలక్టర్లు చెప్పే మాటలు కూడా వాస్తవదూరమే. ఇప్పుడున్న జట్టు, యువ ఆటగాళ్లకంటే కూడా భారత గడ్డపై జరిగే టి20 ప్రపంచకప్‌లో యువీ ఎక్కువ ప్రభావం చూపిస్తాడనుకోవడం కూడా అత్యాశే. కాబట్టి ఇప్పుడు టి20ల పేరు చెప్పి యువీకైతే ఒక అవకాశం ఇచ్చారు.  కుర్రాళ్లతో  పోటీ మధ్య అతను సత్తా చాటుతాడా... లేక ఇన్నింగ్స్ ముగిస్తున్నట్లు తనే ప్రకటిస్తాడా అనేది ఇక యువరాజ్ చేతుల్లోనే ఉంది!

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top