విరాట్ రికార్డుల మోత | Sakshi
Sakshi News home page

విరాట్ రికార్డుల పంట

Published Sun, Oct 29 2017 6:33 PM

Virat Kohli first to get 2000 runs in 2017

కాన్పూర్: న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డుల మోత మోగించాడు. ఈ మ్యాచ్ ద్వారా తొమ్మిదివేల వన్డే పరుగుల్ని పూర్తి చేసుకుని అత్యంత వేగవంతంగా ఆ ఫీట్ ను అందుకున్న క్రికెటర్ గా రికార్డు నెలకొల్సిన కోహ్లి.. మరో రెండు రికార్డుల్ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. 2017లో రెండు వేల అంతర్జాతీయ పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. తద్వారా  అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగుల్ని చేసిన తొలి క్రికెటర్ గా కోహ్లి ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్ కు ముందు 1991 పరుగులతో ఉన్న కోహ్లి.. మరో తొమ్మిది పరుగులు చేసి ఈ ఏడాది రెండు వేల పరుగుల మార్కును చేరాడు. 2017లో కోహ్లికి ఇది 40వ అంతర్జాతీయ మ్యాచ్. మరొకవైపు తాజా మ్యాచ్ ద్వారా కోహ్లి తన కెరీర్ లో 32వ వన్డే శతకాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక శతకాలు నమోదు చేసిన తొలి కెప్టెన్ గా కోహ్లి ఘనత సాధించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ కోహ్లి కెప్టెన్ గా చేసిన సెంచరీలు ఆరు. దాంతో అత్యధిక శతకాలు చేసిన కెప్టెన్ గా రికార్డు నెలకొల్పాడు.

Advertisement
Advertisement