'ఒకటి'గా నిలవలేకపోయారు | Sakshi
Sakshi News home page

'ఒకటి'గా నిలవలేకపోయారు

Published Thu, Feb 15 2018 11:26 AM

south africa failed to protect number one rank in odis - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: దక్షిణాఫ్రికా-భారత జట్ల ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభానికి ముందు ఇరు జట్ల ప్రదర్శనకు సంబంధించి పెద్ద చర్చే నడిచింది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలను ఓడించడం అంత ఈజీ కాదని కొందరు అభిప్రాయపడితే, వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను ఓడించడం సఫారీలకు కూడా క్లిష్టమేనని మరికొందరు పేర్కొన్నారు.  ఈ రెండు జట్లు 'టాప్‌' ప్లేస్‌లో ఉండటంతో సిరీస్‌ విజయంపై ఎవరూ ఏకపక్ష నిర్ణయానికి రాలేకపోయారు. అయితే ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటే, దక్షిణాఫ్రికా మాత్రం విఫలమైందనే చెప్పాలి. ఈ క్రమంలోనే సఫారీలకు కొన్ని చేదు జ్ఞాపకాల్ని కూడా తీసుకొచ్చింది.


ఈ సిరీస్‌ ఆరంభానికి ముందు భారత జట్టు టెస్టుల్లో నంబర్‌ వన్‌ హోదాలోనే దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. అయితే తొలి రెండు టెస్టులు కోల్పోయిన తర్వాత భారత జట్టు తన నంబర్‌ వన్‌ ర్యాంకును కోల్పోయే ప్రమాదంలో పడింది. కాగా, చివరి టెస్టులో భారత జట్టు ఘన విజయం సాధించి సిరీస్‌ ఆధిక్యాన్ని తగ్గించడంతో పాటు టాప్‌ ర్యాంకును నిలుపుకుంది. దాంతో టెస్టుల్లో ప్రథమ స్థానాన్ని భారత్‌ నుంచి లాగేసుకుందామని భావించిన సఫారీలకు నిరాశే ఎదురైంది.

ఇక వన్డే సిరీస్‌కు వచ్చేసరికి దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉండి భారత జట్టుతో పోరుకు సిద్ధమైంది. అయితే వరుసగా రెండు వన్డేల్లో విజయానంతరం టీమిండియా నంబర్‌ ర్యాంకును సఫారీల నుంచి చేజిక్కించుకుంది. ఇక మూడో వన్డేలో గెలుపు తర్వాత ఆ ర్యాంకును కాపాడుకున్న భారత జట్టు.. ఐదో వన్డేలో గెలుపు తర్వాత మరింత పదిలం చేసుకుంది. సఫారీ వన్డే టాప్‌ ర్యాంకును చివరి వన్డేతో సంబంధం లేకుండానే భారత్‌ సొంతం చేసుకుంది. ఒకవేళ ఆఖరి వన్డేలో భారత్‌ పరాజయం పాలైనప్పటికీ నంబర్‌ వన్‌ ర్యాంకును మాత్రం కోల్పోదు. దక్షిణాఫ్రికా 'ఒకటి'అనుకుంటే మరొకటి జరగడంతో అయ్యో  సఫారీలు అనుకోవడం అభిమానుల వంతైంది.


 

Advertisement
Advertisement