గెలుపు... రన్‌రేట్‌ రెండూ కీలకమే! | Sakshi
Sakshi News home page

గెలుపు... రన్‌రేట్‌ రెండూ కీలకమే!

Published Sat, Jun 29 2019 8:34 AM

Pakistan Must Win with Good Run Rate Against Afghanistan - Sakshi

లీడ్స్‌: కనుచూపు మేరలో మిణుకుమిణుకుమంటున్న ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ బెర్తును అందుకునే ఆలోచనలో ఉన్న మాజీ చాంపియన్‌ పాకిస్తాన్‌... శనివారం పసికూన అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. తాము విజేతగా నిలిచిన 1992 కప్‌ తరహాలోనే పరిస్థితులు కలిసొస్తున్నందున మున్ముందు సమీకరణాలు అనుకూలించాలంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు నెట్‌ రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంటూ గెలవాల్సి ఉంటుంది. నిలకడగా ఆడే వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌కు హారిస్‌ సొహైల్‌ తోడవడంతో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ వంటి జట్లను ఓడించి ఊపులోకొచ్చింది సర్ఫరాజ్‌ బృందం. ప్రత్యర్థి ఇప్పటికే పూర్తిగా పోరాటం చాలించిన నేపథ్యంలో పాక్‌ పని కాసింత తేలికే కానుంది. యువ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది కివీస్‌పై మూడు వికెట్లతో చెలరేగడం జట్టు బౌలింగ్‌ వాడిని పెంచింది.

కనీసం ఒకటి రెండైనా సంచలనాలు సృష్టిస్తుందని అంచనాలున్న అఫ్గాన్‌... కప్‌లో ఆ స్థాయి ప్రదర్శనే కనబర్చలేదు. దీంతో భారత్‌తో మినహా మరే మ్యాచ్‌లోనూ ప్రతిఘటన చూపలేకపోయింది. ముజీబ్‌ ఫర్వాలేకున్నా మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ బ్యాట్స్‌మెన్‌ను అంతగా ఇబ్బంది పెట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ గుల్బదిన్‌ నైబ్‌ నిరాశ పరుస్తున్నాడు. ఆమిర్, రియాజ్, అఫ్రిది పేస్‌ త్రయాన్ని ఎదుర్కొంటూ ఆల్‌రౌండర్లు నబీ, రహ్మత్‌ షా రాణిస్తేనే జట్టుకు గెలుపు అవకాశాలుంటాయి. అయితే, ప్రపంచ కప్‌ సన్నాహక మ్యాచ్‌లో అఫ్గాన్‌... పాక్‌కు షాకిచ్చింది. మళ్లీ అలాంటి సంచలనం ఏమైనా నమోదవుతుందేమో చూడాలి. 

ముఖాముఖి రికార్డు 
ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మూడు వన్డేలు జరగ్గా అన్నింట్లోనూ పాకిస్తానే గెలిచింది. ప్రపంచ కప్‌లో తలపడటం మాత్రం ఇదే మొదటిసారి.

Advertisement
Advertisement