హైదరాబాద్ ఓటమి | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఓటమి

Published Sat, Apr 25 2015 7:41 PM

హైదరాబాద్ ఓటమి

ముంబై: ఐపీఎల్-8లో సన్ రైజర్స్ హైదరాబాద్కు మరో ఓటమి ఎదురైంది. శనివారం ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగులతో హైదరాబాద్పై విజయం సాధించింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ పూర్తి ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. ధావన్ (29 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 42) దూకుడుగా ఆడినా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. లోకేష్ 25, రవి బొపార 23, హనుమ విహారి 16 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో మలింగ 4, మెక్లెనాగన్ 3 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో ఏడు మ్యాచ్ లాడిన ముంబైకిది రెండో విజయం కాగా ఆరు మ్యాచ్ లాడిన సన్ రైజర్స్ కు నాలుగో పరాజయం.

లక్ష్యసాధనను సన్ రైజర్స్ దీటుగా ఆరంభించింది. ఓపెనర్ ధావన్ దూకుడుగా ఆడటంతో 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది. అయితే ఆ మరుసటి బంతికి మరో ఓపెనర్ వార్నర్ (9) అవుటవడంతో హైదరాబాద్కు కష్టాలు ఆరంభమయ్యాయి. ఆ వెంటనే ధావన్ కూడా అదే బాటపట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ కోలుకోలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిపాలైంది.
 

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్ సిమన్స్ (42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్తో 51) హాఫ్ సెంచరీతో రాణించాడు. పొలార్డ్ 33, రోహిత్ శర్మ 24, పార్థివ్ పటేల్ 17 పరుగులు చేశారు. కాగా తెలుగుతేజం అంబటి రాయుడు 7 పరుగులకే వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ మూడు, స్టెయిన్, ప్రవీణ్ చెరో రెండు వికెట్లు తీశారు.  
 

Advertisement
Advertisement