ప్లే ఆఫ్‌ టికెట్ల ద్వారా రూ. 20 కోట్లు!  | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్‌ టికెట్ల ద్వారా రూ. 20 కోట్లు! 

Published Wed, May 1 2019 1:33 AM

 BCCI look to pocket ₹20 crore from IPL playoffs - Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌తో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదాయం యేటికేడు పెరుగుతూనే ఉంది. ఈ సీజన్‌ ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల టికెట్లతోనే రూ. 20 కోట్లు ఆర్జించనుంది. గతేడాదితో పోలిస్తే రూ. 2 కోట్ల ఆదాయం ఈసారి పెరిగింది. సాధారణంగా లీగ్‌ దశలో టికెట్ల రూపేణా వచ్చే ఆదాయం ఫ్రాంచైజీ హోమ్‌ టీమ్‌కు దక్కుతుంది. ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల ఆదాయం మాత్రం బోర్డు ఖజానాలోకే వెళుతుంది. ఈసారి ఫైనల్‌ పోరు డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వేదికపై కాకుండా హైదరాబాద్‌ గడ్డపై జరుగనున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని స్టేడియంలో మూడు స్టాండ్‌లపై ఎప్పటి నుంచో ఆక్యుపెన్సీ వివాదం కొనసాగుతోంది. దీంతో మూడు స్టాండ్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి.

ఇలా అయితే ఫైనల్‌ను ప్రత్యక్షంగా చూసే భాగ్యం తక్కువ మందికి కలుగుతుంది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది చూడాలనే ఉద్దేశంతో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఫైనల్‌ను నిర్వహిస్తున్నారు. మూడు స్టాండ్‌లపై నెలకొన్న వివాదాన్ని నగర పాలక సంస్థతో పరిష్కరించుకోవాలని సూచించామని అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో ఫైనల్‌ను చెన్నై నుంచి తరలించామని బీసీసీఐ పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ చెప్పారు. అయితే చాంపియన్‌ జట్టు ప్రేక్షకుల్ని నిరాశపరచరాదనే ఉద్దేశంతో తొలి క్వాలిఫయర్‌ను చెన్నైలోనే నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement