హామీలన్నీ అమలు చేస్తాం.. ఇచ్చిన మాట తప్పం | Sakshi
Sakshi News home page

హామీలన్నీ అమలు చేస్తాం.. ఇచ్చిన మాట తప్పం

Published Tue, Apr 9 2019 4:38 AM

YS Jaganmohan Reddy Comments On His Election Promises - Sakshi

చంద్రబాబు 2014లో టీడీపీ మేనిఫెస్టోను చూపించి, ఓట్లు అడిగాడు. హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. ఒక్కటంటే ఒక్క హామీనైనా అమలు చేసిన పాపాన పోలేదు. మళ్లీ మోసం చేస్తున్నాడు. 2014 నాటి కథనే 2019లోనూ వినిపిస్తున్నాడు. రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి
– ఏలూరు సభలో...

ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది. ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా ఉండదు. అన్నీ మూసేస్తారు. పేదలు తమ పిల్లలను స్కూల్‌కు పంపే పరిస్థితి ఉండదు. ఇక ఊరూరా నారాయణ స్కూళ్లు, కాలేజీలే ఉంటాయి. ఎల్‌కేజీ చదవాలన్నా సంవత్సరానికి రూ.లక్ష చెల్లించక తప్పదు. ఇంజనీరింగ్‌ చదవాలంటే ఏడాదికి  రూ.5 లక్షలు వసూలు చేస్తారు.

బాబుకు మళ్లీ ఓటేస్తే కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. ఆర్‌టీసీ చార్జీలు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజీల్‌ రేట్లు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. కుళాయి పన్నులు బాదుడే బాదుడు. పొరపాటున చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే వీర బాదుడు తప్పదు.

సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి ప్రతినిధి, కాకినాడ:  సమాజంలో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లాగా హామీలిచ్చి, గద్దెనెక్కాక మోసం చేయడం తనకు చేతకాదని తేల్చిచెప్పారు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేసి చూపిస్తామని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. అబద్ధాల బాబుకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జగన్‌ సోమవారం కృష్ణా జిల్లా మచిలీపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని ఇంద్రపాలెంలో ప్రచార సభల్లో మాట్లాడారు. 

బాబుకు ఓటేస్తే వీర బాదుడే  
కొవ్వూరు సభలో..
ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంది. ప్రభుత్వ పాఠశాల ఒక్కటి కూడా ఉండదు. అన్నీ మూసేస్తారు. పేదలు తమ పిల్లలను స్కూల్‌కు పంపే పరిస్థితి ఉండదు. ఇక ఊరూరా నారాయణ స్కూళ్లు, కాలేజీలే ఉంటాయి. బాబుకు మళ్లీ ఓటేస్తే కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. ఆర్‌టీసీ చార్జీలు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజీల్‌ రేట్లు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. కుళాయి పన్నులు బాదుడే బాదుడు. పొరపాటున చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే వీర బాదుడు తప్పదు. ప్రజల భూములు, ఇళ్లను బలవంతంగా లాక్కుంటారు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, పొలాలు, నదులు కూడా పూర్తిగా దోచుకుంటారు. 

సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తాడు..: గ్రామాల్లో ఇప్పటికే జన్మభూమి కమిటీలు అనే మాఫియాలను తయారు చేశారు. పెన్షన్‌ కావాలన్నా,  రేషన్‌ కార్డు కావాలన్నా, ఇళ్లు కావాలన్నా, ఆఖరికి మరుగుదొడ్డి కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకోవాల్సి వస్తోంది. చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం చెలాయిస్తాయి. మీరు ఏ సినిమా చూడాలో, టీవీలో ఏ చానల్‌ చూడాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఏ పత్రిక చదవాలో వాళ్లే చెబుతారు. రోగం వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలో, అక్కడ ఎంత ఫీజు చెల్లించాలో వాళ్లే నిర్దేశిస్తారు. మన పిల్లల్ని బడిలో చేర్చాలన్నా వాళ్ల అనుమతి తీసుకోవాల్సిందే. పొరపాటున బాబుకు ఓటేస్తే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వనివ్వరు. రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు తనకు అనుకూలమైన పోలీసులను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులను రాష్ట్రంలోకి రానివ్వడం లేదు.

రాబోయే రోజుల్లో మనుషులను చంపేసినా అడిగేవారుండరు. పొరపాటున బాబుకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి వారికి ఉద్యోగాలుండవు. బాబుకు మళ్లీ అధికారం అప్పగిస్తే రైతులకు ఉచిత విద్యుత్‌ ఉండదు. ఆరోగ్యశ్రీ పథకం ఉండదు. ‘108’, ‘104’ సర్వీసులను రద్దు చేస్తాడు. పక్కా ఇళ్ల పథకం పూర్తిగా ఎగిరిపోతుంది. తనను వ్యతిరేకించే వారిని చంద్రబాబు బతకనివ్వడు. మీడియా ఇప్పటికే ఆయనకు అమ్ముడుపోయింది. మద్యం బెల్టు షాపులన్నీ రద్దు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బెల్టు దుకాణాలు కనిపిస్తున్నాయి. వీటికి టీడీపీ నాయకులు అండగా నిలుస్తున్నారు. ఒక్కో మద్యం సీసాపై ఎంఆర్‌పీ కంటే రూ.20 నుంచి రూ.30 దాకా అదనంగా దండుకుంటున్నారు. 

రైతన్నలు, యువతకు చంద్రబాబు దగా   
మచిలీపట్నం సభలో..
పసుపు–కుంకుమ అంటూ చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్నాడు. వారికి 2016 మే నుంచి సున్నా వడ్డీ అందడం లేదు. సున్నా వడ్డీని ఎగ్గొట్టి పసుపు–కుంకుమ పేరుతో మభ్యపెడుతున్నాడు. ఒక్కో సంఘానికి కేవలం రూ.లక్ష మాత్రమే ఇచ్చి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. రుణాల మాఫీ సంగతి అటుంచితే  చంద్రబాబు ఇచ్చిన సొమ్ము వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. బాబు పాలనలో రైతులు అప్పుల పాలయ్యారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తానని తొలి సంతకం పెట్టిన చంద్రబాబు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలను రూ.24 వేల కోట్లకు కుదించాడు. ఐదేళ్లలో రుణమాఫీ కింద కేవలం రూ.14 వేల కోట్లు విదిలించాడు. ఈ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా చాల్లేదు. అలాగే నిరుద్యోగ భృతి పేరిట యువతను సైతం దగా చేశాడు. 2014లో చంద్రబాబు దాదాపు 650 హామీలతో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేశాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు కొత్త హామీలతో మళ్లీ ప్రజలను మోసం చేయాలని కుట్రలు పన్నుతున్నాడు. అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ఓటు వేయాలి.  

రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం అన్యాయం..: మచిలీపట్నం పోర్టు ఇక్కడి ప్రజల కల. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈ పోర్టు కోసం టీడీపీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పోర్టు నిర్మాణానికి 4,800 ఎకరాలు ఎందుకు, కేవలం 1,800 ఎకరాల్లో పూర్తి చేయొచ్చని 2014 ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించాడు. తాను అధికారంలోకి రాగానే కేవలం 1,800 ఎకరాల్లోనే పోర్టు నిర్మాణం పూర్తి చేస్తానని ప్రచారం చేశాడు. కానీ, సీఎం అయ్యాక 33 వేల ఎకరాల సేకరణకు నోటిఫికేషన్‌ ఇస్తూ 2015లో జీవో జారీ చేశాడు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భూసేకరణ అర్డినెన్స్‌–2013 గడువు ఒక్క రోజులో ముగుస్తుందనగా రాత్రికి రాత్రి 33 వేల ఎకరాలను నోటిఫై చేశాడు. ఆనాటి నుంచి రైతులు తమ భూములను కుమార్తెలకు కట్నంగా కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. భూములపై బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. రైతులు పంటలు సాగు చేసుకోలేకపోతున్నారు. నేను ఇక్కడికి మూడుసార్లు వచ్చా.. మీ బాధలు విన్నాను. మీకు నేనున్నాను. మచిలీపట్నం పోర్టుకు 33 వేల ఎకరాలు అవసరం లేదు. 4,800 ఎకరాల కంటే ఒక్క ఎకరా కూడా ఎక్కువ తీసుకోనని హామీ ఇస్తున్నా. మిగిలిన భూములు ఏం చేయాలన్నది రైతుల ఇష్టం. రైతన్నల భూములను ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడం అన్యాయం. అలాంటి పనులు చేయబోనని గట్టిగా చెబుతున్నా.  

గిట్టుబాటు ధరలేవీ.. రైతులకు రుణాలేవీ?..: వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు ప్రారంభించారు. ఆయన మరణించిన తర్వాత పనులు ఆగిపోయాయి. ఈ ఐదేళ్లలో కృష్ణా డెల్టా ఆధునికీకరణను గాలికొదిలేశారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి వస్తున్న నీళ్లు బందరు వరకూ రావడం లేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఐదేళ్లుగా కనీసం ఒక్క పంట కూడా సరిగ్గా పండలేదు. పంటలకు కనీసం గిట్టుబాటు ధర కూడా ఈ ప్రభుత్వం కల్పించలేకపోతోంది. రైతులకు బ్యాంకు రుణాలు అందడం లేదు.  

పేదల సొంతింటి కల నిజం చేస్తాం..: మచిలీపట్నంలో భూకబ్జాలు ఎక్కువగా ఉన్నాయి. శ్మశానాలు, మరుగుదొడ్లను కూడా వదలకుండా కబ్జా చేస్తున్నారు. వైఎస్సార్‌ హయాంలో మచిలీపట్నంలో 4 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత ఐదేళ్లలో ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం 10 వేల మంది దరఖాస్తు చేసుకున్నా ఒక్కరికి కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సొంతింటి కలను నిజం చేస్తాం. అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కూడా కట్టించి ఇస్తాం. ఈ ప్రాంతంలో రోల్డ్‌ గోల్డ్‌ తయారీపై దాదాపు 50 వేల మంది అధారపడి జీవిస్తున్నారు. మన ప్రభుత్వం రాగానే ఇమిటేషన్‌ జువెలరీ పార్క్‌కు నీరు ఇస్తాం, యూనిట్‌ రూ.3.75కే కరెంట్‌ సరఫరా చేస్తాం.  

2014 నాటి కథనే 2019లో వినిపిస్తున్నాడు  
ఏలూరు సభలో..
చంద్రబాబు 2014లో టీడీపీ మేనిఫెస్టోను చూపించి, ఓట్లు అడిగాడు. హామీలతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. 50 పేజీల టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి కులానికీ ఒక పేజీ కేటాయించాడు. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలనే దానిపై పీహెచ్‌డీ చేశాడు. ఆ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చాడు. వ్యవసాయ రుణాలు మాఫీ, రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, పొదుపు సంఘాల రుణాల మాఫీ, మహిళలకు భద్రత.. ఇలా ఎన్నో హామీలిచ్చాడు. ఒక్కటైనా అమలు చేశాడా? ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ను జట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినా కనీసం అడిగే నాథుడే లేడు. నిందితులపై ఎలాంటి చర్యల్లేవు.  గుడిసె లేని ఆంధ్రప్రదేశ్‌ వచ్చిందా? పేదవాడికి ఇల్లు దక్కిందా? కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలైందా? ఎన్‌టీఆర్‌ సుజల పథకం, రూ.2కే మినరల్‌ వాటర్‌ వచ్చిందా? అవినీతి రహిత పరిపాలన వచ్చిందా? ఒక్కటంటే ఒక్క హామీలైనా అమలు చేసిన పాపాన పోలేదు. చంద్రబాబు మళ్లీ మోసం చేస్తున్నాడు. 2014 నాటి కథనే 2019లో మళ్లీ వినిపిస్తున్నాడు. రాజకీయ నాయకుడు ఒక హామీ ఇచ్చి, దాన్ని ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకురావాలి. అప్పుడే ఈ వ్యవస్థలో మార్పు వస్తుంది. విశ్వసనీయత అనే పదానికి అర్థం వస్తుంది.  

ఏలూరు వన్‌టౌన్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.15 కోట్లు విడుదల చేశారు. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని ఎవరూ పట్టించుకోలేదు.  ఇక్కడే తమ్మిలేరు ఉంది. వర్షాలు పడినప్పుడు  దిగువ ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. ఈ ముంపును నివారించేందుకు  రిటైనింగ్‌ వాల్‌ కట్టడం కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.30 కోట్లు కేటాయించి, సగం పనులు పూర్తి చేశారు. ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మిగతా పనులను గాలికొదిలేశాయి.  

ప్రత్యేక హోదాతో పన్ను రాయితీలు లభిస్తాయి. పరిశ్రమలు, ఆస్పత్రులు, హోటళ్లు, ఐటీ కంపెనీలు వస్తాయని తెలిసి కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి కాపురం చేశాడు. కేంద్ర కేబినెట్‌లో ఉన్న టీడీపీ ఎంపీలు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఏనాడూ డిమాండ్‌ చేయలేదు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎప్పుడూ నోరు విప్పలేదు

ప్రత్యేక హోదాను విస్మరించిన బాబు  
ఇంద్రపాలెం సభలో..
తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు. కాకినాడ పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తానన్నాడు. చివరకు కనీసం అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ కూడా నిర్మించలేదు. 19 నియోజకవర్గాలున్న ఈ జిల్లాలో ఏకంగా 14 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. వారు సరిపోరన్నట్టుగా చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను కొనేశాడు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో 17 మందిని చంకలో పెట్టుకుని ఈ జిల్లాకు చంద్రబాబు చేసిందేమిటి? చంద్రబాబు వల్ల మన జిల్లాకు ఏమైనా మంచి జరిగిందా?     

ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు..: రాష్ట్రంలో గత నెల రోజులుగా జరుగుతున్న కుట్రలను ప్రజలంతా చూస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చ జరగకూడదని ఆయనకు అమ్ముడుపోయిన పత్రికలు, టీవీ చానళ్లు ప్రయత్నిస్తున్నాయి. అందుకే రోజుకో పుకారు పుట్టిస్తున్నాయి. చంద్రబాబు పాలనపై ప్రజల్లో చర్చ జరిగితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు బాగా తెలుసు. కుట్రలో భాగంగా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ రోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. మనం కేవలం చంద్రబాబు ఒక్కరితోనే యుద్ధం చేయడం లేదు. ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టీవీ9తో, టీవీ5తో, ఇతర అమ్ముడుపోయిన చానళ్లతోనూ యుద్ధం చేస్తున్నాం. 

25 ఎంపీ స్థానాలు గెలిపిస్తే
రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపిస్తే.. అటు తెలంగాణలోని 17 మంది ఎంపీలు కూడా మనకు తోడై.. 42 మంది ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా దిగి రావాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో ఎవరికీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎవరైనా ప్రధానమంత్రి కావాలంటే మన దగ్గర ఉన్న 42 మంది ఎంపీల మద్దతు కీలకమవుతుంది.  ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ సంతకం పెట్టిన వారికే మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తాం.  

చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం చెలాయిస్తాయి. మీరు ఏ సినిమా చూడాలో, టీవీలో ఏ చానల్‌ చూడాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఏ పత్రిక చదవాలో వాళ్లే చెబుతారు. రోగం వస్తే ఏ ఆసుపత్రికి వెళ్లాలో, అక్కడ ఎంత ఫీజు చెల్లించాలో వాళ్లే నిర్దేశిస్తారు. మన పిల్లల్ని బడిలో చేర్చాలన్న వాళ్ల అనుమతి తీసుకోవాల్సిందే. పొరపాటున బాబుకు ఓటేస్తే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పేరుతో 
బ్యాంకుల నుంచి రుణాలు ఇవ్వనివ్వరు.

రాబోయే రోజుల్లో మనుషులను చంపేసినా అడిగేవారుండరు. పొరపాటున బాబుకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి వారికి ఉద్యోగాలుండవు. సంక్షేమ పథకాలు రద్దవుతాయి. పక్కా ఇళ్ల పథకం పూర్తిగా ఎగిరిపోతుంది. తనను వ్యతిరేకించే వారిని చంద్రబాబు బతకనివ్వడు.

వైఎస్‌ జగన్‌ హామీలు 
- ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులను రెగ్యులేట్‌ చేసే విధంగా కమిషన్‌ను తీసుకొస్తాం. ఆ కమిషన్‌ నేరుగా సీఎంకు రిపోర్ట్‌ చేసేలా బాధ్యతలు అప్పగిస్తాం. 
- ఫీజులు తగ్గించడమే కాదు.. స్కూళ్లు, కాలేజీల్లో మెరుగైన వసతులు కల్పించే విధంగా నేరుగా రెగ్యులేటరీ కమిషన్‌ ద్వారా నేనే సమీక్షిస్తా.
- నెలకు రూ.40 వేల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డులు అందజేస్తాం. వైద్యం ఖర్చు రూ.1,000  దాటితే చాలు వాళ్లందరినీ యూనివర్సల్‌ హెల్త్‌ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొస్తాం.  
- ఆర్టీసీ, ప్రభుత్వ శాఖలు అద్దెకు తీసుకునే బస్సులు, కార్ల కాంట్రాక్టును నిరుద్యోగ యువతకే ఇస్తాం. వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ వచ్చేలా చేస్తాం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీలకు 50% రిజర్వేషన్‌ కల్పిస్తాం. 
- ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా వారి చేతికే అందజేస్తాం.  
- మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం.. ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం. 
- పరిశ్రమలకు  అవసరమైన నైపుణ్యాలను యువతలో పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. యువతకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం.    
- పంటల సాగుకు పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో ప్రతి రైతన్నకు రూ.12,500 అందజేస్తాం. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాం.  
- రైతులకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాం. 
- అవ్వాతాతల పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుతాం.   
- ఇల్లు లేని పేదల కోసం ఐదేళ్లలో అక్షరాలా 25 లక్షల ఇళ్లు కట్టిస్తాం.  
- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతిఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తాం.  
- ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఏర్పాటు చేస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం.  
- ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించి, నెలకు రూ.5 వేలు వేతనమిస్తాం. 
- ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు అందజేస్తాం. వడ్డీ లేని రుణం రూ.10 వేలిస్తాం.  
- జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేల చొప్పున స్టైఫండ్‌ మూడేళ్ల పాటు ఇస్తాం. వారి సంక్షేమం కోసం రూ.100 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తాం.  
- సొంత ఆటో, సొంత ట్యాక్సీ ఉన్న డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం.  

చిన్నచిన్న దుకాణాలు పెట్టుకున్న నాయీ బ్రాహ్మణులు, రజకులకు, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు అందజేస్తాం.  
అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, హోంగార్డులకు తెలంగాణలో కంటే రూ.1,000 ఎక్కువ జీతం చెల్లిస్తాం.  
ఏపీఎస్‌ ఆర్టీసీలో పనిచేస్తున్న 65 వేల మంది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తాం.  
సంఘమిత్ర, వీవోఏలు, వెలుగు యానిమేటర్లకు జీతం రూ.10 వేలు ఇస్తాం.  
మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 % ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొస్తాం.  
పిల్లలను బడికి పంపించే అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం. ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. 
ప్రభుత్వమిచ్చే ఫ్లాట్లకు పేదలు తమ వాటా కింద చెల్లించాల్సిన రూ.3 లక్షల రుణం మాఫీ చేస్తాం.
తొలి బడ్జెట్‌లోనే రూ.1,100 కోట్లు  కేటాయించి 13 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తాం.   
మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ప్రోత్సాహకం.
45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాం. 
చేపల వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేల ఆర్థిక సాయం అందజేస్తాం.  

Advertisement

తప్పక చదవండి

Advertisement