చంద్రబాబుకు ఓటేస్తే అంతే సంగతులు   | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఓటేస్తే అంతే సంగతులు  

Published Fri, Mar 29 2019 2:28 AM

YS Jagan election campaign in krishna district nandigama - Sakshi

చంద్రబాబు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలను ప్రజలు మరోసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్రంలో 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా ఉండదు. నారాయణ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవాలంటే ఫీజు రూ.25 వేలు ఉంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆ ఫీజు రూ.లక్ష చేస్తారు. ఆర్టీసీని, విద్యుత్‌ సంస్థలను కూడా మిగల్చడు. అవన్నీ ప్రైవేట్‌ పరం చేస్తాడు. కరెంట్, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్, డీజిల్‌ ధరలు, ఇంటి పన్నులను పెంచేస్తాడు. 2014లో బాబు అధికారంలోకి రాగానే రేషన్‌ కార్డుల్లో కోత వేశాడు. 44 లక్షలు ఉన్న పెన్షన్లను 36 లక్షలకు కుదించేశాడు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు పింఛన్లను పెంచాడు. బాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పుడిస్తున్న పెన్షన్లను తగ్గిస్తాడు. ప్రజల భూములు, ఇళ్లను గుంజుకుంటాడు. ఇప్పటికే వెబ్‌ల్యాండ్‌ పేరుతో పేదల భూములను కొల్లగొడుతున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే.. ఇసుక, మట్టి, గుట్టలు, కొండలు, పొలాలు, నదులు సహా ఏవీ మిగలవు. లారీ ఇసుక ధర ఇప్పుడు రూ.40 వేలు పలుకుతోంది. బాబుకు పొరపాటున ఓటేస్తే రూ.లక్షకు చేరడం ఖాయం.  

జన్మభూమి కమిటీలదే పెత్తనం..: పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే .. మీరు ఏ సినిమా, టీవీలో ఏ చానల్‌ చూడాలో, ఏ పేపర్‌ చదవాలో జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో, అక్కడ ఎంత ఫీజు కట్టాలో కూడా వాళ్లే చెబుతారు. వారు చెప్పినంత డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబుకు ఓటేస్తే ఉచిత విద్యుత్తు ఉండదు. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆరోగ్యశ్రీ,, 108, 104 ఇక పూర్తిగా కనిపించకుండా పోతాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్, పక్కా ఇళ్ల పథకాలు రద్దవుతాయి. చంద్రబాబు గత చరిత్రను మరిచిపోవద్దు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలపై వడ్డీలు పెంచేస్తాడు. సున్నా వడ్డీ రుణాలుండవు. రైతులకు రుణాలే ఇవ్వరు. ఎన్నికలకు మూడు నెలల ముందు చేసిన వాగ్దానాలు.. పెట్టిన పథకాలను అధికారంలోకి రాగానే ఎత్తేస్తాడు.

తనను వ్యతిరేకించే వారిని ఎవరినీ బతకనివ్వడు. గ్రామం నుంచి రాజధాని వరకు తన పోలీసులే కాబట్టి మనుషులను చంపినా కేసులు ఉండవు. సీబీఐ, సీఐడీని రాష్ట్రంలోకి రానివ్వడు. వారే చంపించి, బాధిత కుటుంబంపైనే నెపం నెట్టేస్తారు. పొరపాటున బాబుకు ఓటేస్తే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మధ్యతరగతి ప్రజలు, నిరుపేదలకు ఉద్యోగాలు ఉండవు. ఒకవేళ ఉద్యోగాలు వస్తున్నాయంటే వారు ఆ ఉద్యోగాలకు అనర్హులంటూ జడ్జిలకు లేఖ రాసే పరిస్థితి ఎదురవుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు చూపిస్తున్న సినిమాలు, డ్రామాలను నమ్మొద్దు. చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నాడు, మోసాలు చేస్తున్నాడు. ఈసారి కూడా నమ్మితే ఇక మనం ఎవరం మిగలం. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ మారాలి. 

పంటలకు గిట్టుబాటు ధరలేవీ?..: వర్షాభావ ప్రాంతమైన నందిగామ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో సుబాబుల్‌ పండిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సుబాబుల్‌కు టన్నుకు రూ.4,400 గిట్టుబాటు ధర ఉండేది. ఇప్పుడు రూ.2,500 కూడా రావడం లేదు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో సుబాబుల్‌ రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతులకు ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. రుణభారం భరించలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్రాంతంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఎక్కువే. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను చంద్రబాబు, ఆయన కుమారుడు, బినామీలు, మంత్రులు యథేచ్ఛగా దోచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.  బాబు ఐదేళ్ల పాలనలో అబద్ధాలు, మోసాలు, అన్యాయం, అవినీతి, దుర్మార్గాలూ తప్ప ఇంకేమీ లేవు.   

‘‘పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. మీరు ఏ సినిమా, టీవీలో ఏ చానల్‌ చూడాలో, ఏ పేపర్‌ చదవాలో జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తాయి. ఆఖరికి ఏ ఆసుపత్రికి వెళ్లాలో, అక్కడ ఎంత ఫీజు కట్టాలో కూడా వాళ్లే చెబుతారు. వారు చెప్పినంత డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది’’    

Advertisement
Advertisement