దేశంలో నాలుగు స్తంభాలాట | Sakshi
Sakshi News home page

దేశంలో నాలుగు స్తంభాలాట

Published Wed, Jun 13 2018 11:48 AM

TDP Leaders Conflicts In PSR Nellore - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగర తెలుగుదేశం పార్టీలో నాలుగు స్తంభాలాట మొదలైంది. ముఖ్య నేతలు ఎవరికి వారుగా నగర పార్టీపై పెత్తనం కోసం పాకులాడుతున్నారు. రాష్ట్ర మంత్రులు మొదలుకుని నగర స్థాయి కీలక నాయకుల వరకు అందరూ ఇదే పనిలో ఉండటంతో అధికార పార్టీ కార్పొరేటర్లు తలో గూటికి చేరారు. ఫలితంగా నగరపాలనపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రోజురోజుకీ వివాదాలు ముదురుతున్నాయి. వీటిని పరిష్కరించాల్సిన అమాత్యులే గ్రూపు రాజకీయాలకు ఆజ్యం పోసి పెద్దపీట వేస్తుండటంతో నగరపార్టీలో గందరగోళంగా మారింది. తాజాగా నగరపాలక సంస్థలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలే అధికార పార్టీ గ్రూపు వ్యవహారాలకు ప్రత్యక్ష ఉదాహరణ.

ఇక్కడ అందరూ నేతలే. అందరికీ పాలనపై పెత్తనం కావాలి. అయితే ఎవరికీ పాలనపై మాత్రం సమగ్ర అవగాహన ఉండదు. దోచుకోవటమే ఎజెండాగా అధికశాతం నాయకులు పనిచేస్తుండటం, వారి మధ్యలో కూడా సమన్వయం లేకపోవటంతో ఒక వర్గం లుకలుకలుమరోవర్గం బహిర్గతం చేయటం.. పర్యవసానంగా నగరపాలనకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు అన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్లలో లెక్కకు మించి గ్రూపులు ఉండటం, ఎవరికి తోచినట్లు వారు చేస్తుండటంతో నగర పార్టీలో చీలికలు మొదలవుతున్నాయి. తెరపైకి కార్పొరేటర్లను పెట్టి తెరవెనుక చక్రం తిప్పటానికి ఇద్దరు మంత్రులు పోటి పడుతున్నా అది పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవటం, నాలుగేళ్లుగా పాలన సాగిస్తున్నా అటుపాలనపై కానీ, ఇటు పార్టీ కార్పొరేటర్లపై కానీ నగర మేయర్‌కు పూర్తి స్థాయి పట్టులేకపోవటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. వాస్తవానికి గత ఎన్నికల్లో నగరంలో అధికార పార్టీ గుర్తుపై 17 మంది కార్పొరేటర్లు గెలుపొందారు. దీంతో మెజార్టీ సీట్లు గెలుపొందిన ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలుపొందిన అబ్దుల్‌ అజీజ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. తదనంతర రాజకీయ పరిణామాలతో నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో పాటు 14 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరటంతో మేయర్‌ స్థానాన్ని అధికార పార్టీ దొడ్డిదారిన కైవసం చేసుకుంది.

ఇక నగరంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలుపొందిన ఆనం రగంమయూర్‌ రెడ్డి కూడా అధికార పార్టీకి మద్దతు పలికి ఆ పార్టీలో చేరటంతో టీడీపీ కార్పొరేటర్ల సంఖ్య 33కు చేరింది. ఈ క్రమంలో నగరంపై పట్టు కోసం మొదటి నుంచి నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే నగరంలో ప్రతి విషయంలో మంత్రి నారాయణ జోక్యం అధికంగా ఉండటంతో మేయర్‌ పట్టుసాధించటంలో విఫలమయ్యారు. ఈ క్రమంలో జిల్లా పార్టీలో సీనియర్‌ మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా పాలనపై పట్టు కోసం కొందరు కార్పొరేటర్లకు మద్దతుగా ఉన్నారు. అసలే అధికార పార్టీ ఏ ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవటం, తారాస్థాయిలో విభేదాలు ఉన్న క్రమంలో నగరంలోని అధికార పార్టీ కార్పొరేటర్లు నాలుగు గ్రూపులయ్యారు.

మంత్రి నారాయణ గ్రూపులో ప్రస్తుతం నగర ఇన్‌చార్జి మంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో ఆయన వర్గంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు కొనసాగుతున్నారు. అలాగే రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి వర్గంలో ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి సంబంధించిన గ్రూపులో మరో ఎనిమిది కార్పొరేటర్లు ఉన్నారు. వీరిని కార్పొరేటర్‌ జెడ్‌ శివప్రసాద్‌ ఈగ్రూప్‌ వ్యవహారాలు చక్కదిద్దుతుంటారు. అలాగే నగర అధ్యక్షులుగా ఉన్న నుడా చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి గ్రూపులో ఇద్దరు సీనియర్‌ కార్పొరేటర్లు ఉన్నారు. ఇక చివరగా నగర మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ గ్రూపులో ఆరుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఇక ఒక్క కార్పొరేటర్‌ మాత్రం పరిస్థితికి అనుగుణంగా నడుచుకుంటున్నారు.

నిన్న నిప్పో..నేడు స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలు
రెండు నెలల క్రితం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో టీడీపీ సీనియర్‌ కార్పొరేటర్‌ నూనె మల్లికార్జున్‌యాదవ్‌ నిప్పో స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై మేయర్‌ అజీజ్‌ను నిలదీశారు. నిప్పో అంశాన్ని వ్యతిరేకిస్తూ రీజాయిండర్‌ ఇచ్చారు. ఈ వ్యవహారం టీడీపీలోని కార్పొరేటర్ల మధ్య విభేదాలను బట్టబయలు చేసింది. అయితే చివరి నిమిషంలో టీడీపీలోని కొందరు కార్పొరేటర్లకు భారీగా ముడుపులు ముట్టడంతో కౌన్సిల్‌లో ఆమోదం తెలిపారు.  ఇదే క్రమంలో ఈ నెల 9వ తేదీన జరిగిన కార్పొరేషన్‌ స్టాండింగ్‌ ఎన్నికల్లో టీడీపీలోని వర్గపోరు మరోసారి రచ్చకెక్కింది. ఐదుగురు కమిటీ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఎనిమిది మంది టీడీపీ నుంచి నామినేషన్‌ వేయడం చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, మేయర్‌ అజీజ్‌లు నిర్ణయించిన కార్పొరేటర్లతో పాటు మరో ముగ్గురు ఎవరికి వారు నామినేషన్‌ వేశారు. పార్టీ ఆదేశాలతో ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్లు ఉపసంహరించుకోగా, ప్రశాంత్‌కిరణ్‌ మాత్రం తన నామినేషన్‌ను ఉపసంహరించుకోలేదు. దీంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. రానున్న రోజుల్లో కార్పొరేషన్‌లో టీడీపీలో రచ్చ మరింత ముదురుతుందని తెలుస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement