సమన్వయకర్తలే కీలకం

Rahul Gandhi's tour in hyderabad on 13th, 14th  - Sakshi

కాంగ్రెస్‌ గెలుపులో కృషి చేయాలి

పదిరోజుల్లో బూత్‌ కమిటీలన్నీ పూర్తి  

సమన్వయకర్తల సమావేశంలో ఉత్తమ్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాబోయే ఎన్నికల్లో పార్టీలో నాయకులు, కార్యకర్తలకు మధ్య సమన్వయకర్తలే కీలకంగా పనిచేయాలని, 2019లో కాంగ్రెస్‌ విజయమే లక్ష్యంగా వారి పనితీరు ఉండాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూచించారు. పదిరోజుల్లో బూత్‌ కమిటీలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం గాంధీభవన్‌లో నియోజకవర్గ సమన్వయకర్తలు, డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ.. సమన్వయకర్తలు నియోజకవర్గంలో ఇంచార్జ్‌లు కారని, వారు నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం చేసి ఒక్కతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలని, నియోజవర్గంలో శక్తి ఆప్‌ నమోదును పెద్ద ఎత్తున చేయించాలని సూచించారు.

బూత్‌ కమిటీ నుంచి నియోజకవర్గ కమిటీల వరకు అన్ని కమిటీలను పది రోజుల్లో పూర్తి చేయాలని తెలిపారు. రాహుల్‌ గాంధీ పర్యటన 13, 14 తేదీల్లో ఉందని, అప్పటిలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కమిటీ వేయాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలో రాహుల్‌ పర్యటించే అవకాశముందని, ఈ నేపథ్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాల్లో వచ్చేలా ప్రయత్నాలు చేయాలని సూచించారు.

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ఇందులో సమన్వయకర్తలదే కీలక బాధ్యత అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ కుంతియా అన్నారు. రాహుల్‌ పర్యటనను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీమ్, శ్రీనివాస్‌ కృష్ణన్, శక్తి ఆప్‌ ఇంచార్జ్‌ రామ్మోహన్‌రెడ్డి, ఏఐసీసీ ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ ప్రసాద్, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌యాదవ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, తన్నీరు నరేందర్‌ పాల్గొన్నారు.

ఓయూకు రాహుల్‌ వచ్చేలా చూడండి
ఓయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా రాహుల్‌ గాంధీని ఆహ్వానించాలని పలు విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. దీనిపై సహకరించాలని ఉత్తమ్‌ను ఆయన నివాసంలో ?శుక్రవారం విద్యార్థి సంఘాల నేతలు కలిశారు. దీనిపై ?సానుకూలంగా స్పందించిన ఉత్తమ్‌.. రాహుల్‌ రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఏదో ఒకరోజు ఓయూలో పర్యటించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఉత్తమ్‌ను కలసిన వారిలో ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ కోటూరి మానవతారాయ్, ఓయూ జేఏసీ నేతలు దరవు ఎల్లన్న, పున్నా కైలాశ్, శనగోని దయాకర్, బీసీ జేఏసీ నేతలు నాయకులు బొమ్మా హనుమంతరావు, బాల లక్ష్మి, గడ్డం శ్రీను, శివ రాజ్‌ తదితరులు ఉన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top