అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం

PrajaSankalpaYatra enters in Pattikonda constituency - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, వెల్దుర్తి (కర్నూలు) : నాలుగేళ్ల పాలనలో ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబును, ఆయన ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 15వ రోజు ముగిసింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకోగానే నేటి పాదయాత్ర ముగిసింది. నేడు కొలుములపల్లె, ముద్దవరం, వెంకటగిరి క్రాస్ రోడ్, బాలాపురం క్రాస్ రోడ్, పెండెకల్, సర్పరాజపురం మీదుగా యాత్ర సాగగా, బుధవారం 16.2 కిలోమీటర్లు నడిచారు. సాయంత్రం ఆరు గంటలకు డోన్ నియోజకవర్గంలో ముగిసిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర వెల్దుర్తి మండలం సర్పరాజపురం వద్ద పత్తికొండ నియోజకవర్గంలో ప్రవేశించింది.

పాదయాత్రలో భాగంగా ముద్దవరం గ్రామంలో ప్రవేశించగానే 200 కి.మీ. మైలురాయిని వైఎస్ జగన్ చేరుకున్న విషయం తెలిసిందే. కాగా, ప్రజాసంకల్పయాత్రతో తమ కష్టాలను తెలుసుకోవడానికి వచ్చిన వైఎస్‌ జగన్‌ కు కర్నూలు జిల్లా వాసులు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. డోన్ నియోజకవర్గంలోని ముద్దవరం, వెంకటగిరి, పెండెకల్‌ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలి రావడంతో పాదయాత్రలో పండగ వాతావరణం కనిపించింది. ఎండను సైతం లెక్కచేయకుండా పాదయాత్రలో పాల్గొనడానికి భారీ సంఖ్యలో తరలివస్తున్న అభిమానులు, మద్ధతుదారులు జననేత వైఎస్‌ జగన్‌తో సెల్ఫీలు దిగుతున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు తమకు చేసిందేమీ లేదంటూ అన్ని సామాజిక వర్గాల ప్రజలు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌కు వారి సమస్యలు చెప్పుకున్నారు.

రాత్రి 7 గంటలకు వెల్దుర్తి మండలం నర్సాపురం క్రాస్‌రోడ్‌కు చేరుకున్న వైఎస్ జగన్ అనంతరం అక్కడే బస చేస్తారు. పాదయాత్రలో భాగంగా ఇప్పటివరకూ వైఎస్ జగన్ ఓవరాల్‌గా 212.2 కిలోమీటర్లు నడిచారు. రేపు (గురువారం) 16వ రోజు నర్సాపురం క్రాస్ రోడ్‌ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top