బాబు అలా చేసినా ఆశ్చర్యమేమీ లేదు: పవన్‌ | Sakshi
Sakshi News home page

బాబు మళ్లీ మోదీ చేయి పట్టుకుని రావచ్చు

Published Sat, Aug 11 2018 3:52 AM

Pawan Kalyan comments on CM Chandrababu - Sakshi

నరసాపురం: బీజేపీని నానారకాలుగా తిట్టిపోస్తున్న సీఎం చంద్రబాబు 2019 ఎన్నికల్లో మళ్లీ ప్రధానమంత్రి మోదీతో జతకట్టి ఆయన చేయిపట్టుకుని ఓట్లకోసం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. మాటలు మార్చడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు.

కాంగ్రెస్‌ను తిట్టినతిట్టు తిట్టని ఆయన మొన్న రాజ్యసభలో వాళ్ల ఎంపీలతో కాంగ్రెస్‌కు ఓటేయించారన్నారు. అధికారంకోసం కులాలమధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు నైజమన్నారు. బీసీలు, కాపుల మధ్య, ఎస్సీల మధ్య, మత్స్యకారులు, ఎస్టీల మధ్య చిచ్చుపెట్టారని విమర్శించారు. కాపు రిజర్వేషన్‌ అంశాన్ని కోల్ట్‌ స్టోరేజ్‌లో పెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సైతం కాపు రిజర్వేషన్‌పై మాటమార్చారన్నారు. కులాల్ని విభజించి అధికారంలోకి రావాలని జనసేన అనుకోదన్నారు.

ఇక్కడ 15 సీట్లు రాకుంటే సీఎం అయ్యేవారా?.. మీ అబ్బాయ్‌ మా తలపై కూర్చునేవారా? ‘‘మా మద్దతుతో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు 15కు 15 సీట్లు మీకిచ్చారు. నిజంగా ఇక్కడ 15 సీట్లూ రాకుంటే మీరు సీఎం అయ్యేవారా? అవినీతితో వేలకోట్లు సంపాదించేవారా? మీ అబ్బాయి అందరి తలలపై ఎక్కి తొక్కే అవకాశం ఉండేదా? చెప్పండి ముఖ్యమంత్రిగారూ..’’ అని పవన్‌ మండిపడ్డారు. అలాంటి ఈ జిల్లాకు ఏమిచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవం జిల్లా అభివృద్ధికి ఉపయోగపడలేదన్నారు. గోదావరి జిల్లా అంటే రాష్ట్రమంతా ఈర‡్ష్య పడే పరిస్థితి ఉండేదని, ఇప్పుడీ జిల్లాలో మంచినీళ్లు కొనుక్కుని తాగాల్సి వస్తోందన్నారు. ఒక్క పరిశ్రమా లేదన్నారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా పరిశ్రమలు పెట్టాలని ముందుకొస్తే మాకెంతిస్తారని స్థానిక ఎమ్మెల్యేలు అడుగుతున్నారన్నారు. మహిళా అధికారులపై దాడులు చేసే ఎమ్మెల్యేకు ఇక్కడ అందలం దక్కుతోందన్నారు. ఏ హామీనీ అమలు చేయని చంద్రబాబు మళ్లీ నియోజకవర్గానికి రూ.25 కోట్లు ఖర్చుపెట్టి 2019 ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా నియోజకవర్గానికి ఎన్నికల ఖర్చును రూ.42 కోట్లకు పెంచినట్టు తెలుస్తోందన్నారు. మిమ్మల్ని ప్రజలెలా నమ్మాలి.. ఎందుకు ఓట్లెయ్యాలని చంద్రబాబును ప్రశ్నించారు. ఇసుక మాఫియా, మైనింగ్‌ మాఫియా సొమ్ములు చంద్రబాబు వద్ద ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తే ద్రోహం చేసుకున్నట్టేనన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement