దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు | Sakshi
Sakshi News home page

దసరా నాటికి పార్టీ జిల్లా ఆఫీసులు

Published Thu, Jul 18 2019 6:56 AM

KCR Tells Build Party District Offices By Dussehra - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జిల్లా కేంద్రాల్లో నిర్మించే పార్టీ కార్యాలయ భవనాల నిర్మాణాన్ని దసరా నాటికి పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పార్టీ నేతలను ఆదేశించారు. గత నెల 27న శంకుస్థాపన జరిగిన పార్టీ కార్యాలయాల భవన నిర్మాణ పను లను వేగంగా పూర్తిచేసి దసరా నాటికి ప్రారంభోత్సవం జరిగేలా చొరవ తీసుకోవాలన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ముఖ్యనేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. పార్టీ నేతలకు జిల్లాల వారీగా కార్యాలయాల నిర్మాణానికి ఒక్కో జిల్లాకు రూ.60 లక్షల చొప్పున చెక్కును, పార్టీ కార్యాలయ భవన నమూనాను అందజేశారు. నిబంధనలకు లోబడి పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. పార్టీ నేతలనుద్దేశించి కేసీఆర్‌ గంటపాటు మాట్లాడారు. ప్రభుత్వ కార్యకలాపాలను పార్టీ కేడర్‌ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలు పూర్తి స్థాయిలో అంది తే తెలంగాణ ముఖచిత్రంలో గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. కొత్తగా నిర్మించే పార్టీ జిల్లా కార్యాలయాల ద్వారా మనం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి’ అని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్తులో నియోజకవర్గ స్థాయిలోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించే యోచనలో ఉన్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. 

త్వరలో జిల్లా పర్యటనలు 
పోడు భూముల విషయంలో అటవీ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో జిల్లాల వారీగా పర్యటిం చే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన కేసీఆర్‌.. పర్యటనల సందర్భంగా ఆయా సమస్యలను పరిష్కరిస్తాననే భరోసా ఇచ్చినట్లు సమాచారం. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. నెలాఖరుకల్లా గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని, కమిటీల్లో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వివిధ రంగాల నిపుణుల తో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. పురపాలక ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించేలా పార్టీ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని, అన్ని వర్గాలను కలుపుకుని పోవాలని సూచించారు. 

దేశ, రాష్ట్ర రాజకీయాల తీరుపై విశ్లేషణ 
కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చినందున భవిష్యత్తులో వారి పాలనను ప్రజలు అంచనా వేస్తారని కేసీఆర్‌ అభిప్రాయపడ్డా రు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడతాయనే భావన ప్రజల్లో ఉం దన్నారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలే వరుస గా అధికారంలోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావించా రు. మంచి పాలన అందించే వారికే ప్రజలు పట్టంగడతారని అన్నారు. సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement