టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి: స్మృతి ఇరానీ | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలి: స్మృతి ఇరానీ

Published Mon, Nov 5 2018 3:02 AM

BJP Will Win 2019 Election Says Smriti Irani - Sakshi

హైదరాబాద్‌: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి ఓటు వేసి టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పిలుపునిచ్చారు. నియంతగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ కార్యకర్తలంతా కృషి చేయాలని, పోలింగ్‌ రోజైన డిసెంబర్‌ 7ను తెలంగాణ విమోచన దినంగా భావించాలని ఆమె సూచించారు. ప్రజాస్వామ్యం అంటే కుటుంబ పాలన అని టీఆర్‌ఎస్‌ పార్టీ అనుకుంటోందని ఆమె ఎద్దేవా చేశారు. అంబర్‌పేట ఛే నంబర్‌ చౌరస్తాలో ఆదివారం జరిగిన బీజేపీ అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గ సమ్మేళనంలో స్మృతి ఇరానీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్‌ 17ను టీఆర్‌ఎస్‌ ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. పేదల ఆరోగ్యం కోసం కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ప్రవేశపెడితే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు.

ఈ పథకం అమలు చేస్తే ప్రధాని నరేంద్ర మోదీకి పేరు వస్తుందని అనుకోవడం టీఆర్‌ఎస్‌ పార్టీ భ్రమని, మోదీకి దేశవ్యాప్తంగా ప్రజాదరణ ఉందన్న విషయాన్ని ఆ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. నిజాయితీ, నిబద్ధతకు మారుపేరైన కిషన్‌రెడ్డికి అందరూ అండగా ఉండాలన్నారు. కిషన్‌రెడ్డి విజయమే నిజమైన దీపావళి వేడుకగా భావించాలని ఆమె కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి బీజేపీ గెలుపునకు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని ఆయన కోరారు. సమావేశంలో బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ బూత్‌స్థాయిలో కార్యకర్తలు పట్టుదలతో పనిచేయాలన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అంబర్‌పేటలో ప్రజలంతా మనవైపే ఉన్నారని మన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు.
 

Advertisement
Advertisement