అందరి ఆరోగ్యానికి చట్టం తెస్తాం

Rahul gives glimpses of Congress manifesto - Sakshi

మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు రాహుల్‌ వెల్లడి

ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో పర్యటన  

రాయ్‌పూర్‌/బార్గఢ్‌: దేశంలోని అందరికీ ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఓ చట్టాన్ని తీసుకొచ్చే అంశాన్ని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ చెప్పారు. ప్రధాని మోదీ తెచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకంపై ఆయన విమర్శలు గుప్పించారు. దేశంలో 15–20 మంది వ్యాపారవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన ‘అందరికీ ఆరోగ్యం’అనే జాతీయ సదస్సు ముగింపు సమావేశంలోæ మాట్లాడారు. ‘ఆరోగ్య భద్రతా చట్టంతో పాటు దేశంలోని అందరు వ్యక్తులకు ఆరోగ్య భద్రత హక్కును కల్పించాలనుకుంటున్నాం. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చాలనుకుంటున్నాం..’అని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలకు కేటాయింపులు పెంచుతామన్నారు.  

తప్పుడు వాగ్దానాలతో మోదీ మోసం 
తప్పుడు వాగ్దానాలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్‌ ఆరోపించారు. ముఖ్యంగా హామీల పేరుతో రైతులను మోదీ మోసం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ఇప్పుడు ఏమైతే వాగ్దానాలు చేస్తుందో వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తుందని చెప్పారు. ‘మేం ఏం చెప్తున్నామో వాటిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతి వాగ్దానాన్ని ఆచరణలో చేసి చూపెడతాం. మోదీ లాగా కాంగ్రెస్‌ తప్పుడు వాగ్దానాలు చేయదు...’అని పశ్చిమ ఒడిశాలో నిర్వహించిన కాంగ్రెస్‌ ర్యాలీలో రాహుల్‌ వ్యాఖ్యానించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చి చూపించామన్నారు. ఈ రాష్ట్రాల్లోని రైతుల వ్యవసాయరుణాల్ని త్వరలోనే మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. వరికి కనీస మద్దతు ధర కింద క్వింటాల్‌కు రూ.2,500 ధరను ఛత్తీస్‌గఢ్‌లో పెంచినట్లు రాహుల్‌ వెల్లడించారు. ‘ఈ రాష్ట్రాల్లోని రైతులు ఒంటరి కాదని కాంగ్రెస్‌ మీతోనే ఉందనే భరోసానిచ్చాం. ఒడిశాలో కూడా అధికారంలోకి రాగానే రైతులను ఆదుకుంటాం..’అని చెప్పారు. 

సూసైడ్‌లకు అబద్దపు హామీలే కారణం
‘మోదీకి అబద్ధాలు చెప్పడం, తప్పుడు వాగ్దానాలతో ప్రజల్ని మోసం చేయడం అలవాటు. బీజేపీ మాటలు నమ్మి దేశవ్యాప్తంగా మోసపోయింది రైతాంగమే. మోదీ ప్రభుత్వం హామీలు నేరవేర్చకపోవడంతో దేశంలో రోజూ రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. అయినా వ్యవసాయ రుణాల మాఫీ, వరికి ఎంఎస్‌పీల గురించి పట్టించుకోదు. నీటిపారుదల రంగాన్ని బలోపేతం చేయడంలో, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పడంలో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం విఫలమైందని రాహుల్‌ దుయ్యబట్టారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top