‘రూలర్‌’ మూవీ రివ్యూ

Balakrishna Ruler Telugu Movie Review And Rating - Sakshi

మూవీ: రూలర్‌
జానర్‌: యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌
నటీనటులు: బాలకృష్ణ, వేదిక, సోనాల్‌ చౌహాన్‌‌, భూమిక, జయసుధ, షియాజీ షిండే, ప్రకాష్‌రాజ్‌, పరాగ్‌ త్యాగి, నాగినీడు, ఝాన్సీ
సంగీతం: చిరంతన్‌ భట్‌
దర్శకత్వం: కె.ఎస్‌ రవికుమార్‌
నిర్మాత: సి. కల్యాణ్‌

నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం. ఈ హీరో సినిమా వస్తే ముఖ్యంగా మాస్‌ ఆడియన్స్‌కు డబుల్‌ ధమాకానే. వారికి కావాల్సిన ఫుల్‌ మాస్‌ ఎలిమెంట్స్‌ బాలయ్య సినిమాలో చూడొచ్చనే ఎగ్జైట్‌మెంట్‌తో ఉంటారు. ఇక తమిళనాట స్టార్‌ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన కెఎస్‌ రవికుమార్‌ బాలయ్య బాబుతో రెండో సారి జత కట్టి ‘రూలర్‌’ ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌లతో సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. దీంతో భారీ అంచనాల నడుమ శుక్రవారం ‘రూలర్‌’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకుందా? నయా లుక్స్‌లో బాలయ్య ఏ మేరకు ఆకట్టుకున్నారు? ‘రూలర్‌’తో బాలకృష్ణ ఈ ఏడాదిని ఘనంగా ముగించారా? అనేది రివ్యూలో చూద్దాం. 

కథ: 
ఈ సినిమా కథ ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ప్రారంభమై వయా రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా తిరిగి ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుంది. సరోజిని నాయుడు(జయసుధ)కు చెందిన పలు కంపెనీల బాధ్యతలను రెండేళ్లు విదేశాల్లో ఐటీ రంగంపై ప్రత్యేక శిక్షణ తీసుకుని భారత్‌కు తిరిగి వచ్చిన తన వారసుడు అర్జున్‌ ప్రసాద్‌(బాలకృష్ణ)కు అప్పగిస్తారు. అయితే పోటీ ప్రపంచంలో భాగంగా తన ప్రత్యర్థి కంపెనీకి చెందిన హారిక(సోనాల్‌) అర్జున్‌కు తారసపడుతుంది. ఈ క్రమంలోనే అర్జున్‌తో హారిక ప్రేమలో పడుతుంది. అయితే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉత్తరప్రదేశ్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అర్జున్‌ ప్రసాద్‌ భావిస్తాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సరోజిని నాయుడు అడ్డుపడతారు. 

ఈ ప్రాజెక్ట్‌కు తన తల్లి ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకొని ఉత్తర ప్రదేశ్‌ బయల్దేరుతాడు అర్జున్‌. అయితే ఈ ప్రయాణంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటాయి. యూపీలో అర్జున్‌ను అందరూ పోలీస్‌ అఫీసర్‌ ధర్మ అని పిలుస్తారు. ఇదే క్రమంలో లోకల్‌ మినిస్టర్‌ భవానీనాథ్‌ ఠాగూర్‌(పరాగ్‌ త్యాగీ) అర్జున్‌పై దాడి చేయిస్తాడు. దీనికి గల కారణాలు ఏంటి? అసలు ధర్మ, అర్జున్‌ ఒక్కరేనా? లేక వేరువేరా?. అసలు ఈ కథలోకి సంధ్య(వేదిక), సీతారామయ్య(నాగినీడు), నిరంజనా ప్రసాద్‌(భూమిక)లు ఎందుకు ఎంటర్‌ అవుతారు? వంటి విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.  


నటీనటులు: 
ఈ సినిమాలో రెండు ఢిపరెంట్‌ షేడ్స్‌లో కనిపించిన బాలయ్య తన నట విశ్వరూపం ప్రదర్శించాడు. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రేమనని.. కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోనని ఈ సినిమాతో నిరూపించారు. ఎనర్జీ, స్టైల్‌, డ్యాన్స్‌, ఫైట్స్‌ ఇలా అన్ని విషయాల్లోనూ ఇరగదీశాడు. సినిమా మొత్తం ఒంటి చేత్తో నడిపించాడంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిత్రంలో బాలయ్య వేసిన స్టెప్పులకు థియేటర్‌లో ఒకటే ఈలలు గోలలు. ఇక నటనకు పెద్ద స్కోప్‌ లేకపోయినప్పటికీ గ్లామరస్‌ పాత్రల్లో హీరోయిన్లు సోనాల్‌, వేదికలు ఆకట్టుకున్నారు. వారి అందచందాలతో కుర్రకారును కట్టిపడేశారు. మరోవైపు రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భూమికకు ఈ చిత్రంలో ఎలాంటి డైలాగ్‌లు లేవు. కానీ స్టోరీ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. మిగతా పాత్రల్లో నాగినీడు, ప్రకాష్‌రాజ్, పరాగ్‌ త్యాగి, ఝాన్సీ, తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. 

విశ్లేషణ: 
‘నలభైకి పైగా అంతస్థుల గల మేడ నుంచి పడిపోతున్న ఓ యువతిని హెలికాప్టర్‌లో వచ్చి బాలయ్య కాపాడతాడు’. ఈ ఒక్క సీన్‌తో అర్థమవుతుంది సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో. బాలకృష్ణ సినిమా అంటే ఎలాంటి అంచనాలు పెట్టుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సినిమాలో నందమూరి ఫ్యాన్స్‌ ఊహించని సీన్లు, హీరో ఎలివేషన్‌ షాట్స్‌, ఫైట్లు హై రేంజ్‌లో ఉన్నాయి. ‘ఎన్టీఆర్‌’ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలకృష్ణ.. తన తదుపరి చిత్రం కమర్షియల్‌ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్‌ రవికుమార్‌కు అప్పగించాడు. అయితే బాలయ్య బాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుబు నూటికినూరు శాతం నిలబెట్టుకోలేకపోయాడు. 

కేవలం బాలకృష్ణ ఇమేజ్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకుని డైరెక్టర్‌ కథను అల్లుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. కథలో ఏదో మూలన కాస్త కొత్త దనం కనిపించినప్పటికీ.. దానిని అటుతిప్పి ఇటుతిప్పి రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాగా మలిచాడు. బాలకృష్ణ ఎలివేషన్‌ సీన్స్‌, ఫైట్స్‌, కమర్షియల్‌ హంగుల మీద దృష్టిపెట్టినంత శ్రద్ద కథ, కథనంపై పెడితే ఇంకాస్త బెటర్‌గా ఉండేది. ఇక రెండో అర్థబాగంలో పోలీస్‌ ఆఫీసర్‌గా వచ్చే బాలయ్య లుక్‌ సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. 

బాలకృష్ణ ఎలివేషన్‌ సీన్లు, ఇంగ్లీష్‌ డైలాగ్‌ సోనాల్‌ అందచందాలు, హీరోహీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయెట్‌ సాంగ్‌, శ్రీనివాస్‌ రెడ్డి బృందం కామెడీతో ఫస్టాఫ్‌ సక్సెస్‌ ఫుల్‌గా ముగుస్తుంది. తొలి అర్థభాగం ముగిసే సరికి సినిమా అసలు కథలోకి ఎంటర్‌ కాదు. అయితే సెకండాఫ్‌లో అసలు స్టోరీలోకి ఎంటర్‌ అయ్యాక సినిమా ఎటో వెళ్లిపోతుంది. దీనిపై దర్శకుడు తన సీనియార్టీని ఉపయోగించి అభిమానులను కాస్త మెస్మరైజ్‌ చేయాల్సింది. కానీ దర్శకుడు ఏమాత్రం తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించలేదని ఈ సినిమాతో అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే సినిమాకు చాల ప్లస్‌గా నిలిచింది డ్యాన్స్‌. బాలయ్య ఇమేజ్‌ను పరిగణలోకి తీసుకుని డ్యాన్స్‌లను ఎక్సలెంట్‌గా కంపోజ్‌ చేశారు మూవీ కొరియోగ్రాఫర్స్‌.  ఫార్మేషన్స్‌, బాలయ్యకు ఆప్ట్‌ అయ్యే స్లైలీష్‌ స్టెప్పులను కంపోజ్‌ చేశారు. 

సినిమాకు మరోప్లస్‌ పాయింట్స్‌ ఫైట్స్‌. నందమూరి ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించిన ఫైట్లు వారిని మైమరిపిస్తాయి. ఇక సాంకేతిక వర్గం విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే సాంగ్స్‌, హీరోయిన్‌ ఎంట్రీ సీన్లలో కెమెరా పనితనం కనిపించింది. ఇక మ్యూజిక్‌ డైరెక్టర్‌ చిరంతన్‌ భట్‌ మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమాకు తగ్గట్టు పాటలను కంపోజ్‌ చేశాడు. బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో రఫ్పాడించాడు. అయితే ఎడిటింగ్‌, స్క్రీన్‌ ప్లేపై కాస్త దృష్టి పెట్టాల్సి ఉండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఓవరాల్‌గా సినిమా గురించి చెప్పాలంటే వన్‌ మ్యాన్‌ షోతో సినిమాను బాలయ్య నెట్టుకొచ్చాడు. బాలకృష్ట కష్టానికి తగ్గట్టు దర్శకుడు తన ప్రతిభను ప్రదర్శిస్తే సినిమా వేరే రేంజ్‌లో ఉండేది.

ప్లస్‌ పాయింట్స్‌
బాలకృష్ణ ఎనర్జీ
డ్యాన్స్‌ ఫార్మేషన్స్‌
సినిమాటోగ్రఫీ

మైనస్‌ పాయింట్స్‌ 
దర్శకత్వ విలువలు
ఎడిటింగ్
సాగదీత సీన్లు
సినిమా నిడివి
కథనంలో కొత్తదనం లేకపోవడం

- సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.25/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top