ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో వయగ్రా యాడ్ | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో వయగ్రా యాడ్

Published Sat, Nov 28 2015 5:55 PM

ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్‌లో వయగ్రా యాడ్

పారిస్: ప్రపంచవ్యాప్తంగా భీతావహం సృష్టించేందుకు తమదైన శైలిలో ఆన్‌లైన్‌లో ప్రచార వీడియోలు పోస్ట్ చేస్తూ యువతను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులపై హ్యాకర్లు తాము చేస్తున్న దండయాత్రను తీవ్రతరం చేశారు. ఎప్పటికప్పుడు అభ్యంతరకరమైన ఐఎస్‌ఐఎస్ వీడియోలను ఆన్‌లైన్ నుంచి తొలగిస్తున్న ఈ హ్యాకర్లు తాజాగా టెర్రరిస్టులను హేళన చేస్తూ ఓ ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్‌లోకి చొరబడి 'వయగ్రా' యాడ్‌ను పోస్ట్ చేశారు.

 కోపోద్రేకాల స్థానంలో కామోద్రేకాలను ప్రేరేపించి మానసిక ప్రశాంతతను వయగ్రా కల్పిస్తుందని అనానిమస్ గ్రూప్‌నకు చెందిన గోస్ట్ సెక్ అనే హ్యాకింగ్ గ్రూప్ ఓ వీడియోలో వెల్లడించింది. పారిస్‌లో రక్తపాతం సృష్టించి అమాయకుల ప్రాణాలను తీసిన ఐఎస్‌ఐఎస్‌ను సైబర్ ప్రపంచంలో ఎక్కడ దాగున్నా వెతికి వెతికి పట్టుకుంటామని కూడా హెచ్చరించింది. 'మా చూపు నుంచి నీవు ఎప్పటికీ తప్పించుకోలేవు. మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్నాం. మీ ఆనవాళ్లు కూడా దొరక్కుండా త్వరలోనే అతిపెద్ద ఆపరేషన్ నిర్వహిస్తాం' అని ఆ వీడియోలో హ్యాకర్ల అధికార ప్రతినిధి ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

 సైబర్ ప్రపంచంలో ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్లపై గుర్తుతెలియని ఈ హ్యాకర్లు గత కొంతకాలంగా దాడులు జరుపుతున్నారు. ఎక్కడ టెర్రరిస్టుల వెబ్‌సైట్లు కనిపించినా మూసివేస్తున్నారు. ఖాతాలను కట్టేస్తున్నారు. తాజా వయగ్రా యాడ్ అనంతరం కూడా ఐఎస్‌ఐఎస్ వెబ్‌సైట్‌ను మూసివేశారు.

Advertisement
Advertisement