అద్భుత సృష్టికి సిద్ధమైన టోక్యో | Sakshi
Sakshi News home page

అద్భుత సృష్టికి సిద్ధమైన టోక్యో

Published Sun, Feb 14 2016 6:28 PM

అద్భుత సృష్టికి సిద్ధమైన టోక్యో

టోక్యో: ప్రపంచంలో ఇప్పటికే ఎత్తయిన మానవ నిర్మిత కట్టడం బుర్జ్ ఖలీఫా అతి త్వరలోనే రెండో స్థానంలోకి వెళ్లిపోనుండగా తొలిస్థానానికి రాబోతున్న జెడ్డా టవర్ ను కూడా తలదన్నే నిర్మాణం రాబోతుంది. కళ్లు గిర్రున తిరిగేలా టోక్యోలో 1600 మీటర్ల (1.6కిలో మీటర్లు లేదా ఒక మైలు) ఎత్తున ఓ భారీ స్కై టవర్( ఆకాశహార్మ్యం) రానుంది. బుర్జ్ ఖలీఫా సరాసరి దాదాపు 800 మీటర్లపైన ఎత్తుంటుంది. ఇలా ఎత్తయిన టవర్ల జాబితాలో షాంఘై టవర్, మాక్కా రాయల్ క్లాక్ టవర్ కూడా ఉన్నాయి.

2021నాటికి ఈ జాబితా కాస్త కాస్తంత పక్కకు జరిగి తిరిగి కొత్త జాబితా రానుంది. సౌదీ అరెబియాలో జెడ్డా టవర్ నిర్మాణం జరుగుతోంది. దీని ఎత్తు సరాసరి ఆకాశంలోకి ఒక కిలో మీటర్.. అయితే, ఈ టవర్లను తల దించుకునేలా, ఎప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్ ఏదంటే తమదే అని చెప్పేలా జపాన్లో ఓ భారీ టవర్ నిర్మాణం జరగనుంది. దీని ఎత్తు సరాసరి 1,600 మీటర్లు. అంటే బుర్జ్ ఖలీఫా కు రెండింతలన్నమాట. కిలో మీటర్నరకు పైగా ఎత్తుతో కనిపించబోయే ఈ నిర్మాణాన్ని ఖాన్ పెడర్సన్ ఫాక్స్ అసోసియేట్స్(కేపీఎఫ్), లిస్లీ ఈ రాబర్సన్ అసోసియేట్స్(ఎల్ఈఆర్ఏ) అనే సంస్థలు ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించాలని అనుకుంటున్నారు.

దీనికి 'స్కై మైల్ టవర్' అని నామకరణం చేశారు. ఇది ఏకంగా సముద్రం లోపల నిర్మించబోతున్నారు. 2045నాటికి ఈ కట్టడం పూర్తవుతుందని ఒక అంచనా. దీనికి సంబంధించిన నమునా చిత్రాలు విడుదల చేశారు. ఇందులో నివాస సముదాయాలతోపాటు పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యాపార సముధాలు, ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ఒక్క టవర్ ఓ భారీ మెగాసిటీగా మారనుంది. దాదాపు 50 వేలమంది ఇందులో నివాసం ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. సముద్రంలో నిర్మాణం చేపడుతున్న ఈ టవర్కు అలలపోటు తగలకుండా దాని చుట్టూ రింగుల వంటి నిర్మాణాలు దాఆపు 500 నుంచి 5000 చదరపు మైళ్ల వెడల్పుతో నిర్మించనున్నారు. భవిష్యత్లో కనిపించబోయే టోక్యో భవిష్యత్లో నిర్మించబోయే ఎన్నో నగరాలకు ఆదర్శంగా నిలవనుంది.  

Advertisement
Advertisement