జ్వరానికి ‘చేప మందు’ | Sakshi
Sakshi News home page

జ్వరానికి ‘చేప మందు’

Published Sun, Aug 20 2017 3:12 AM

జ్వరానికి ‘చేప మందు’ - Sakshi

- మలేరియా వంటి వ్యాధులకు ఆరోగ్య శాఖ విరుగుడు
దోమల గుడ్లను తినే గంబూషియా చేప
మురికి కుంటలు, కాల్వల్లో పెంపకం
ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలు చేస్తున్న అధికారులు
 
సాక్షి, హైదరాబాద్‌: వర్షాకాలం వచ్చిందంటే చాలు జ్వరాలు పంజా విసురుతాయి. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా జ్వరాలు విజృంభిస్తూనే ఉన్నాయి. దోమలను అరికట్టడమే ఈ సమస్యకు పరిష్కారమని భావించిన అధికారులు నూతన విధా నాలను ఆచరణలో పెట్టనున్నారు. దోమల లార్వాల(గుడ్ల)ను తినే గంబూషియా చేపలను వైద్యారోగ్య శాఖ పెంచి, మురికి కుంటల్లో, కాలువల్లో వదులుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దీన్ని అమల్లోకి తెచ్చింది. త్వరలోనే అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది. 
 
ఏటా 3,500 మలేరియా కేసులు..
రాష్ట్రంలో ఏటా 3,500 మలేరియా కేసులు  నమోదవుతున్నాయి. 2017లో జనవరి నుంచి ఆగస్టు 19 వరకు 1,472 మలేరియా కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 400 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
 
ఎప్పటి నుంచో..
దోమల నివారణకు చేపలను వినియోగించడం మన దేశంలో 1928లో మొదలైంది. గంబూషియాను దోమల చేప (మస్కిటో ఫిష్‌)గా పిలుస్తారు. మురికి గుంటలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో ఇవి జీవిస్తాయి. ఒక గంబూషియా చేప తన జీవిత కాలంలో 1,200 గుడ్లు పెడుతుంది. మలేరియా విభాగం అంచనా ప్రకారం ప్రతి చేప రోజులో 360 గుడ్లు, లార్వాలను తింటుంది. దోమల గుడ్లు, లార్వాలు చేపలకు ఆహారం కావడం వల్ల కొత్త దోమలు వృద్ధి చెందవు. గంబూషియాలు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ బతుకుతాయి. వర్షాకాలం మురికి గుంటలు, కాల్వల్లో ఉంటూ దోమల లార్వాలను తినేస్తూ మానవులకు మేలు చేస్తాయి. 
 
తినడానికి పనికిరాని చేపలు..
గంబూషియా చేపలు చాలా చిన్నగా ఉంటాయి.  ఆహారంగా తీసుకునే సైజులో ఉండవు. పర్యావరణ పరంగా గంబూషియా చేపలతో మేలు ఎక్కువ. ఈ చేపలు గరిష్టంగా మూడు అంగుళాలకు మించి పెరగకపోవడం వల్ల వీటిని ఆహారంగా తీసుకునేం దుకు ఎవరూ ఇష్టప డరు. ఈ చేపల వల్ల దోమలకు తప్ప ఇతర జలచరాలకు ఎలాంటి నష్టం ఉండదు.
 
రాష్ట్రంలో మలేరియా కేసులు..
2015 11,880
2016 3,575
2017 1,472
  (ఆగస్టు 19 వరకు) 

Advertisement
Advertisement